Friday, September 27, 2024

మోడీ దిగ్విజయ యాత్ర

- Advertisement -
- Advertisement -

మానవాళి విజయం యుద్ధక్షేత్రంలో కాదు.. సమష్ఠి శక్తిలోనే ఉందని ఐక్యరాజ్యసమితి వేదికపై నుంచి ప్రకటించడం ద్వారా ప్రపంచ శాంతికి భారత్ కట్టుబడి ఉన్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి విస్పష్టంగా చెప్పారు. పలు దేశాలు యుద్ధాలతో, సంక్షోభాలతో, కలహాలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ప్రధాని తన అమెరికా పర్యటనలో దాదాపు ప్రతి వేదికపైనా శాంతి సుస్థిరతలతోనే ప్రపంచం ముందుకు వెళ్తుందన్న విషయాన్ని పదేపదే నొక్కి చెప్పారు.

అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ సభ్యత్వ దేశాలుగా గల క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అగ్రరాజ్యానికి బయల్దేరి వెళ్లిన ప్రధాని మోడీకి ఎప్పటిలాగే అపూర్వ స్వాగతం లభించింది. తన మూడు రోజుల పర్యటనలో అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించడంతో పాటు వివిధ దేశాధినేతలతో టెక్నాలజీ, ఆర్థికాభివృద్ధి, ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని ముఖాముఖీ ఫలవంతమైన చర్చలు జరిపారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్న భారత్‌కు మద్దతు ఇస్తామని అగ్రరాజ్యం హామీ ఇవ్వగా, వివిధ టెక్ దిగ్గజాలతో మోడీ జరిపిన భేటీలో పలువురు సిఇఒలు ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం హర్షించదగిన మరొక పరిణామం. బైడెన్ తో మోడీ జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో కోల్‌కతాలో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ నెలకొల్పేందుకు అంగీకారం కుదరడం గమనార్హం.

ఇరుదేశాల మధ్య పరస్పర సాంకేతిక సహాయ సహకారాల వినిమయంలో భాగంగా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు అగ్రరాజ్యం అంగీకరించింది. సైనిక దళాలు వినియోగించే సాంకేతిక పరికరాలలో వాడే చిప్స్ తయారీలో ఈ సెమీకండక్టర్ ప్రాజెక్టు కీలకమవుతుంది. మోడీ పర్యటనలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే- ఎప్పుడో అక్రమ మార్గాల ద్వారా తరలిపోయిన 297 ప్రాచీన కళాఖండాలను తిరిగి భారత్‌కు అగ్రరాజ్యం అప్పగించడం. ఢిల్లీలో గత జులైలో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో సాంస్కృతిక కళాఖండాలను తిరిగి రప్పించడంపై అమెరికా -భారత్ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ అప్పగింత జరిగింది. విల్మింగ్టన్‌లో జరిగిన క్వాడ్ సదస్సులో సైతం మోడీ ఉద్రిక్తతలు, సంఘర్షణలు ప్రపంచాన్ని చుట్టుముడుతున్నాయని ఆందోళన వ్యక్తపరిచారు. తనకు, పొరుగు దేశాలకు మధ్య విభేదాలు సృష్టించేందుకు ‘విభజించు- పాలించు’ అనే వ్యూహాన్ని క్వాడ్ సదస్సు అమలు చేస్తోందంటూ చైనా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో క్వాడ్ సదస్సు ఎవరికీ వ్యతిరేకం కాదని ప్రధాని తేల్చిచెప్పారు.

వాస్తవానికి క్వాడ్ సదస్సు ఈసారి ఇండియాలోనే జరగవలసి ఉండగా బైడెన్ అభ్యర్థన మేరకు వేదిక విల్మింగ్టన్‌కు మారింది. తన పర్యటనలో మూడోరోజు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన మోడీ, మానవాళి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచ నేతల చర్యలు ఉండాలని ఆకాంక్షించారు. ‘ఒక భూగోళం- ఒక కుటుంబం- ఒక భవిష్యత్తు’ అనే నినాదానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. యుద్ధ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఉక్రెయిన్, పాలస్తీనా అధ్యక్షులతో సైతం ప్రధాని భేటీ కావడం విశేషం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మోడీ భేటీ కావడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి కాగా, ఈ ఏడాదిలో మూడోసారి. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్ కట్టుబడి ఉందని మరోసారి పునరుద్ఘాటించిన మోడీ, రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని నిలువరించే దిశగా శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడంలో భారత్ సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

తన పర్యటనలో వివిధ దేశాధినేతలతో భేటీ అయిన ప్రధాని.. అమెరికా ఎన్నికలలో పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవకపోవడానికి కారణం ఆ దేశ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడమే కారణం కావచ్చు. కేంద్రంలో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన ఎన్‌డిఎ ప్రభుత్వం స్వతంత్ర విదేశాంగ విధానానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందనడానికి మోడీ ఇటీవలి కాలంలో రష్యా, ఉక్రెయిన్, అమెరికాలలో జరిపిన పర్యటనలు, సాధించిన విజయాలే ఉదాహరణలు. వివిధ దేశాలతో సంబంధ బాంధవ్యాలను పటిష్టపరచుకోవడంలో ప్రధాని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ ‘భారత దేశ చరిత్రలో అమెరికాకు బాగా దగ్గరైన ప్రధాని మోడీ, అమెరికా చరిత్రలో భారత్ కు బాగా దగ్గరైన అధ్యక్షుడు బైడెన్’ అంటూ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News