Friday, November 22, 2024

ప్రధాని సమీక్షకు సిఎం మమత గైర్హాజరు

- Advertisement -
- Advertisement -

PM Modi announced 1000 Cr To Cyclone Yaas Hit States

 

యాస్ తుపాను సమావేశానికి అధికారులనూ పంపని పశ్చిమ బెంగాల్ సిఎం
రాజ్యాంగ విలువలు ఖూనీ చేశారు : నడ్డా
బెంగాల్ సిఎస్‌పై కేంద్రం చర్యలు

న్యూఢిల్లీ : ఇటీవలి యాస్ తుపాన్ తాకిడి రాష్ట్రాలకు రూ 1000 కోట్ల సాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు. తుపాన్ ప్రభావిత పశ్చిమ బెంగాల్ , ఒడిశా, జార్ఖండ్‌లలో తక్షణ సహాయక చర్యల కోసం ఈ మొత్తాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీ శుక్రవారం ఒడిశా, బెంగాల్‌లో ఏరియల్ సర్వే చేపట్టారు. తుపాన్‌తో జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా అంచనావేసేందుకు ఈ పర్యటన జరిపారు. యాస్‌తో దెబ్బతిన్న ప్రాంతాలలో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు, మౌలిక నిర్మాణ వ్యవస్థల పునర్నిర్మాణానికి కేంద్రం నుంచి సాయం అందుతుందని ప్రధాని భరోసా కల్పించారు. త్వరలోనే దెబ్బతిన్న రాష్ట్రాలకు మంత్రుల స్థాయి బృందం వెళ్లుతుంది. పరిస్థితిని తెలుసుకుంటుంది. నష్టం వివరాలపైఆరాతీసి, సాయాన్ని వేగిరపరుస్తుందని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటన వెలువరించింది.

తుపాన్ సంబంధిత ఘటనలలో మరణించిన వారి కుటుంబాలకు రెండులక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. అయితే తమ రాష్ట్రానికి దాదాపు రూ 15000 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రధాని ఏరియల్ సర్వే నేపథ్యంలో బెంగాల్ సిఎం మమత బెనర్జీ తెలిపారు. గత ఏడాది మే నెలలో వచ్చిన పెను తుపాన్ అంఫాన్‌తో పూర్తిగా దెబ్బతిన్న బెంగాల్‌కు కేంద్రం నుంచి అందింది కేవలం రూ వేయి కోట్లు, అదీ అడ్వాన్ రూపంలో అని తెలిపారు. బెంగాల్‌లోని వెస్ట్ మిధ్నాపూర్ జిల్లాలోని కలైకుండ వైమానిక స్థావరం నుంచి ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తరువాత అక్కడ జరిగిన యాస్ తుపాన్ నష్టం సమీక్ష సమావేశానికి సిఎం మమత హాజరు కాలేదు. బెంగాల్‌లోని సౌత్, నార్త్ 24 పరగణాల జిల్లాలు, ధిఘా, ఈస్ట్ మేథినిపూర్, నందిగ్రామ్ జిల్లాల మీదుగా ప్రధాని గగనతల సమీక్ష సాగింది. అంతకు ముందు ప్రధాని మోడీ ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. తరువాత రాష్ట్రంలో ఏరియల్ సర్వేకు వెళ్లారు. బుధవారం యాస్ ఒడిశా తీరం వెంబడి భూ ఉపరితలానికి తాకింది. నష్టం కల్గించింది. ఒడిశాలో తుపాన్ దుర్ఘటనలతో ముగ్గురు చనిపోయారు.

20వేల కోట్ల సాయం అవసరం : మమత
యాస్ తుపాన్‌తో బెంగాల్‌కు అపార నష్టం వాటిల్లిందని, కేంద్రం నుంచి రూ. 20000 కోట్ల సాయం అం దించాలని ప్రధాని మోడీకి బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అభ్యర్థించారు. ఈ మేరకు ప్రధానికి వివరాలతో నివేదిక అందించారు. దెబ్బతిన్న ప్రాంతాల పు నర్నిర్మాణానికి ఈ ప్యాకెజ్ అత్యవసరమని తెలిపారు.

చీఫ్ సెక్రటరీ వెనక్కి
ప్రధాని, మమత వివాదం ఉదంతం తర్వాత కేంద్రం బెంగాల్ చీఫ్ సెక్రటరీ ఆలాపన్ బందోపాధ్యాయను వెనక్కి పిలిపించింది. ఈ నెల 31లోగా సిబ్బంది వ్యవహారాల శాఖకు పంపించాలని ఆదేశించింది. బందోపాధ్యాయ పదవీ కాలాన్ని మమత సర్కార్ నాలుగు రోజుల క్రితమే మూడు నెలలు పొడిగించింది.

మొత్తం వెయ్యి కోట్లలో సగం ఒడిశాకు
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించిన వేయి కోట్ల సాయంలో రూ 500 కోట్లు ఒడిషాకు, మిగిలిన సగం పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లకు దక్కుతుంది. బెంగాల్, జార్ఖండ్‌లలో ఏరాష్ట్రానికి ఎంత అనేది అక్కడ జరిగిన నష్టం అంచనాల తరువాత నిర్ణయిస్తారు. ఆయా రాష్ట్రాలకు మంత్రుల స్థాయి బృందాలను కేంద్రం పంపిస్తుంది. పరిస్థితిని వారు క్షేత్రస్థాయిలో అంచనావేసుకున్న తరువాత తదుపరి సాయం గురించి ప్రకటన వెలువరిస్తారు.

రాజ్యాంగ విలువలను ఖూనీ చేశారు

మమతపై బిజెపి నేత నడ్డా విమర్శ
రాజ్యాంగపరమైన రివాజును పశ్చిమబెంగాల్ సిఎం మమత బెనర్జీ పూర్తిగా నాశనం చేశారని బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా విమర్శించారు. యాస్ తుపాన్ నష్టం అంచనాకు వచ్చిన ప్రధాని జరిపిన సమావేశాన్ని మమత బహిష్కరించడంపై నడ్డా స్పందించారు. ప్రధాని సమీక్షకు సిఎం రాకపోవడం ఏమిటని నిలదీశారు. రాజ్యాంగ విలువలు, సహకార సమాఖ్య సంస్కృతిని ఆమె ఖూనీ చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి మమత ఈ విధంగా వ్యవహరించడం ఫెడరిలిజపు విలువలు దెబ్బతినేందుకు దారితీస్తాయని తెలిపారు.

ప్రధాని మోడీ ఇటువంటి విపత్కర పరిస్థితులలో ఎప్పటికప్పుడు పార్టీలు రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాల సిఎంలతో మాట్లాడుతుంటారు. పరిస్థితిని తెలుసుకుంటారు. ప్రజలు కష్టాల నుంచి బయటపడటమే కీలకమని భావిస్తారు. అయితే మమత బెనర్జీ ఇప్పుడు కూడా తన సంకుచిత రాజకీయాలను వీడకపోవడం విస్మయకరమేమీ కాదని, ఊహించినదే అన్నారు. మరోసారి ఆమె బెంగాలీల ను వెంటాడుతున్నట్లుగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. ఓ వైపు ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ రివ్యూ మీటింగ్‌కు హాజరయ్యారు. మరి మమత దీనికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

PM Modi announced 1000 Cr To Cyclone Yaas Hit States

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News