Monday, December 23, 2024

గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్ ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్ ఏర్పాటు
జి20 శాటిలైట్ మిషన్ కూడా ప్రారంభం
ప్రకటించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: బయో ఫ్యూయల్ అలయెన్స్‌ను ప్రారంభిస్తున్నట్లు భారత్ శనివారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని 20 శాతానికి తీసుకు వెళ్లాలనే ప్రతిపాదనతో ఏర్పాటయిన గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయెన్స్‌లో చేరాలని జి20 దేశాలను కోరింది. జి20 సదస్సులో తొలి సెషన్ అయిన ‘ఒన్ ఎర్త్’ సెషన్‌లో ప్రధాని మోడీ మాట్లాడుతూ పర్యావరణ, వాతావరణ పరిశీలన కోసం జి20 శాటిలైట్ మిషన్‌ను కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ‘అన్ని దేశాలు ఫ్యౌయల్ బ్లెండింగ్ రంగంలో కలిసి సని చేయాల్సిన సమయం ఇది. పెట్రోల్‌లో ఇథనాల్‌ను 20 శాతం దాకా కలపడాన్ని అంతర్జాతీయ స్థాయిలో చేపట్టాలనేది మా ప్రతిపాదన.

లేదా ప్రపంచానికి మేలు చేసే మరో ప్రత్యామ్నాయం కోసం మనం కృషి చేయవచ్చు’ అని మోడీ చెప్పారు. వాతావరణ మార్పు సవాలును దృష్టిలో పెట్టుకుని 21వ శతాబ్దంలో ఇంధన మార్పిడి అనేది అత్యవసరమని ఆయన అన్నారు. అయితే ఈ మార్పిడికి లక్షల కోట్ల డాలర్లు అవసరమని ఆయన అంటూ అభివృద్ధి చెందిన దేశాలు ఈ విషయంలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్పారు. ఈ ఏడాది ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు సానుకూల చొరవ తీసుకున్నందుకు భారత్‌తో పాటుగా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ సంతోషిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశాల కూటమి అయిన గ్లోబల్ బయోఫ్యూయల్ అలయెన్స్‌ను ఏర్పాటు చేయాలని భారత్ గత కొంత కాలంగా ప్రయత్నిస్తూనే ఉంది. 2015లో పారిస్‌లో జరిగిన ప్రపంచ వాతావరణ సదస్సులో శుద్ధమైన, చౌక అయిన సౌర విద్యుత్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకు రావాలని ప్రతిపాదించారు.

జి20 సదస్సులో ఈ గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయెన్స్ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదన చేయనున్నట్లు ఇటీవల పిటిఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో కూడా ప్రధాని మోడీ చెప్పారు. 2025 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిళితం చేయాలన్న లక్షాన్ని చేరుకోవాలని లక్షంగా పెట్టుకున్న భారత్ ఈ దిశగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా డజన్ల సంఖ్యలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది కూడా. రవాణా సహా వివిధ రంగాల్లో నిలకడగా బయో ఇంధనాలను ఉపయోగించే విషయంలో సహకారాన్ని పెంపొందించడంతో పాటుగా ఈ కృషిని మరింత తీవ్రం చేయడం లక్షంగా ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయెన్స్‌ను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News