ఢిల్లీ : చెన్నై నగర వరదల నిర్వాహణ పనుల ప్రాజెక్టుకు సంబంధించి రూ 561.29 కోట్ల ప్రణాళికకు ప్రధాని నరేంద్ర మోడీ అనుమతిని ఇచ్చారు. చెన్నై బేసిన్ ప్రాజెక్టు పరిధిలో సంబంధిత పనులు జరుగుతాయని హోం మంత్రి అమిత్ షా గురువారం తెలిపారు. ప్రస్తుత మిచౌంగ్ తుపాన్‌తో చెన్నై భారీ స్థాయిలో వరదలతో అతలాకుతలం అయిపోతున్న దశలో ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన వెలువరించింది. ఇంతకు ముందు కూడా భారీ వర్షాలు వరదలతో చెన్నైలో వరదలు తలెత్తాయి. ఎక్కువగా తుపాన్ల తాకిడి ప్రాంతంగా ఉంటూ వస్తున్న ఈ నగరానికి సరైన శాశ్వత పరిష్కారానికి ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందని భావిస్తున్నారు. దేశంలో పలు మెట్రోపాలిటన్ నగరాలలో ఇటీవలి కాలంలో భారీ వర్షాలు వరదల పరిస్థితి ఏర్పడుతోంది.
గడిచిన ఎనిమిదేళ్లలో చెన్నై ఇప్పటికీ మూడు సార్లు భారీ స్థాయి ఉధృత వరదల స్థితిని ఎదుర్కొందని కేంద్ర హోం మంత్రి తమ ప్రకటనలో తెలిపారు. ఆకస్మిక వరదలతో పలు నగరాలలో పరిస్థితి దిగజారుతోందని , ఇది జనజీవితాలను దెబ్బతీస్తోందని , పరిస్థితిని గట్టెక్కించేందుకు ఇక తిరుగులేని ప్రణాళికలు రూపొందించుకోవల్సి ఉందని మంత్రి తెలిపారు. ప్రధాని మోడీ నిర్మాణాత్మక ఆలోచనల క్రమంలో ఇప్పుడు చెన్నై నగరానికి తొలిసారిగా ఈ ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫ్లడ్ మేనేజ్‌మెంట్ కార్యకలాపాల పనులకు నిధులు మంజూరు అయ్యాయని చెప్పారు. దీని మేరకు చెన్నై పరిసరాలల్లోని వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని చక్కదిద్దేందుకు కార్యక్రమాలు చేపడుతారు.