దుబాయ్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ వాతావరణ మార్పుల కాప్ 28 సదస్సు (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్)లో పాల్గొనేందుకు దుబాయ్ చేరుకున్నారు. ఆయన ఈ నేపథ్యంలో ఏడు ద్వైపాక్షిక భేటీలు జరుపుతారు. నాలుగు కీలక ప్రసంగాలు చేస్తారు. ప్రధాని మోడీ దుబాయ్‌లో ఉండే 21 గంటల వ్యవధిలో ఆయన కార్యక్రమాల వివరాలను భారతీయ అధికారులు శుక్రవారం వెల్లడించారు. వాతావరణ తీవ్రస్థాయి మార్పుల కట్టడి దిశలో తీసుకునే రెండు ప్రత్యేక చర్యలకు సంబంధించి ప్రధాని మోడీ కీలక ప్రసంగాలు ఉంటాయి.
సదస్సుకు పలువురు ప్రముఖ నేతలు హాజరవుతున్నందున వారితో ఇష్టాగోష్టి సమావేశాలకు కూడా వీలుంటుంది. అనుబంధంగా కొన్ని ఇతర కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో దుబాయ్‌లో కాప్ సదస్సు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకూ జరుగుతుంది. ఇందులో ప్రధానమైనది వరల్డ్ క్లైమెట్ యాక్షన్ సమ్మిట్. ఇప్పటికే పలు దేశాధినేతలు ఇతర కీలక ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనేందుకు దుబాయ్‌కు చేరారు.