Wednesday, January 22, 2025

ఉమ్మడి కార్యాచరణతో ఆసియా శకం

- Advertisement -
- Advertisement -

జకార్తా : ప్రస్తుత కాలాన్ని ఆసియా శకంగా మార్చాల్సి ఉందని, ఈ దిశలో ఆసియాన్ ఇండియా సదస్సు నిర్ణాయాత్మక పాత్ర పోషించాల్సి ఉందని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. ఇండోనేసియా రాజధాని జకార్తాలో గురువారం ప్రధాని మోడీ 20వ ఆసియాన్ ఇండియా సదస్సులో పాల్గొని ప్రసంగించారు. పలు రంగాలలో విస్తృత సహకారం దిశలో ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ 12 అంశాల ప్రతిపాదనల సమాహారాన్ని సభ ముందుంచారు. సమకాలీన తీవ్ర సమస్యలుగా మారిన ఉగ్రవాదం నిర్మూలనకు వ్యూహాత్మక సమగ్ర సహకారం విస్తరింపచేసుకోవల్సి ఉందన్నారు ఈ దిశలో సభ్య దేశాల నడుమ డిజిటల్ మార్పిడి, వ్యాపార వాణిజ్యం, ఆర్థిక విషయాలలో అనుసంధాన ప్రక్రియ అవసరం అని తెలిపారు. సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోడీ ఆసియాన్ భాగస్వామ్య దేశాల నేతలతో విస్తృత సంప్రదింపులు జరిపారు. ఈ దశలో ఆసియాన్ ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పెంచుకునే వారితో మాట్లాడారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆసియాన్ కేంద్రీకృత ప్రాధాన్యత వహించాలని పిలుపు నిచ్చారు.

ఇండో పసిఫిక్ ఓషియన్ ఇన్షియేటివ్ (ఒపిఒఐ), ఇండో పసిఫిక్‌లో ఆసియాన్ ప్రాధాన్యత (ఎఒఐపి) మధ్య మరింత సమన్వయం అవసరం అన్నారు. ఆసియాన్ దేశాలు ఇండియా మధ్య ఇకపై నిర్ణీత వ్యవధిలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఐటిఐజిఎ)ను సమీక్షించుకోవల్సి ఉందని తెలిపారు. ప్రధాని మోడీ ప్రతిపాదించిన 12 సూత్రాలలో భాగంగా ఇండియా ఆసియాన్ మధ్య అనుసంధాన ప్రక్రియ , డిజిటల్ లావాదేవీలు, వాణిజ్య వ్యాపార రంగాలలో సహకారం ఇనుమడించాల్సి ఉందన్నారు. ప్రత్యేకించి సౌత్ ఈస్ట్ ఆసియా ఇండియా వెస్ట్ ఆసియా యూరప్ అనుసంధానం చేసే ఎకనామిక్ కారిడార్, బహుళ స్థాయి అనుసంధాన యంత్రాంగం నెలకొనాల్సి ఉందన్నారు. ఇందుకోసం భారతదేశం తన డిజిటల్ పరిజ్ఞానాన్ని ఆసియా భాగస్వామ్య దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఆసియాన్ ఇండియా ఫండ్ ఏర్పాటును ప్రకటించిన ప్రధాని దీని ద్వారా సభ్య దేశాల నడుమతగు విధంగా డిజిటల్ పరివర్తన ఆర్థిక అనుసంధాన దిశల్లో తోడ్పాటుకు వీలేర్పడుతుందని తెలిపారు. ఉగ్రవాదం, టెర్రర్ ఫైనాన్సింగ్, సైబర్ అవలక్షణాలపై మరింత సంయుక్త పోరు ప్రతిపాదన కూడా చేశారు.

బహుళ స్థాయి వేదికల నుంచి ఎప్పటికప్పుడు గ్లోబల్ సౌత్ సమస్యలను ప్రస్తావించేందుకు సమిష్టిగా గళమెత్తాల్సి ఉందన్నారు. ఇప్పుడు ప్రాచీన వైద్యం అవసరం పెరిగిందని, దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గుర్తించిందని ఈ దిశలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తరఫున సాంప్రదాయక వైద్యంపై గ్లోబల్ సెంటర్‌ను ఏర్పాటు అయిందని వివరించారు. మిషన్ లైఫ్ , వాతావరణ పరిరక్షణల దిశలో భారతదేశం చేపట్టిన ప్రపంచ స్థాయి జనబాహుళ్య ఉద్యమంలో పాలుపంచుకోవాలన్నారు. ఇప్పుడు భారతదేశంలో అత్యంత ప్రామాణికమైన ఔషధాలను జన్ ఔషధ్ కేంద్రాల ద్వారా ప్రజలకు అందిస్తున్నారని, ఈ ప్రక్రియ విజయవంతం అయిందని తెలిపిన ప్రధాని ఈ విషయంలో ఇతర దేశాలకు భారతదేశం తగు విధంగా తన సాయం చేస్తుందని, అనుభవాన్ని పంచుకుంటుందని వివరించారు. ఆసియాన్ ఇండియా సదస్సులో రెండు కీలక సంయుక్త తీర్మానాలు ఆమోదించారు.

సముద్ర జలాల వివాదాల పరిష్కారంలో సహకారం, ఆహార భద్రతలపై వేర్వేరుగా సంయుక్త ప్రకటనలు వెలువడ్డాయని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటన వెలువరించింది. ప్రధాని మోడీ తూర్పు ఆసియా సదస్సులో కూడా పాల్గొన్నారు. సముద్ర చట్టాలు ఐరాస కన్వెన్షన్‌కు (యుఎన్‌సిఎల్‌ఒఎస్)కి అనుగుణంగా అన్నిదేశాలకు వర్తింపచేయాలని ఆయన ఈ సందర్భంగా చైనా ప్రాబల్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News