Tuesday, April 8, 2025

రామాయణ గాథలు థాయ్ ప్రజల జీవితాల్లో భాగం : ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

బిమ్స్‌టెక్ సదస్సులో భాగంగా ప్రధాని మోడీ థాయ్‌లాండ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని పేటోంగ్‌టార్న్ షినవత్రాతో భేటీ అయ్యారు. థాయ్ ప్రజల జీవితాల్లో రామాయణ ఇతిహాసం లోని గాథలు భాగమని మోడీ అన్నారు. దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రాంతాలకు చెందిన 7 దేశాల సమాగమం అయిన బంగాళాఖాత ప్రాంత బహుళ రంగ, సాంకేతిక, ఆర్థిక సహకార (బిమ్‌స్టెక్) సదస్సు కోసం రెండు రోజుల పాటు గురువారం మోడీ థాయ్‌లాండ్‌కు వెళ్లారు. ప్రధానుల భేటీ తరువాత మోడీ మాట్లాడుతూ “ భారత్‌థాయ్‌లాండ్ మధ్య శతాబ్దాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయి. సాంస్కృతక, ఆధ్యాత్మిక సంబంధాలతో బలమైన బంధం ఏర్పడింది. బౌద్ధమతం వ్యాప్తి మన ప్రజలను అనుసంధానించింది. అయుతయ నుంచి నలంద వరకు మేధావులు రాకపోకలు సాగించారు. రామాయణ గాథలు థాయ్ ప్రజల జీవితాల్లో ఒక భాగమయ్యాయి. సంస్కృతం, పాళీ భాషల ప్రభావం నేటికీ ఇరువురి సంప్రదాయాల్లో ప్రతిబింబిస్తుంది.

నా పర్యటన సందర్భంగా 18 వ శతాబ్దపు రామాయణ కుడ్య చిత్రాల ఆధారంగా ఒక స్మారక స్టాంపును విడుదల చేసిన థాయ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ” అని హర్షం వ్యక్తం చేశారు. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ . ఇండోఫసిఫిక్ విజన్‌లో థాయ్‌లాండ్‌ది కీలక పాత్ర అని మోడీ అన్నారు. తమ రెండు దేశాలు అభివృద్ధి వాదాన్ని సమర్థిస్తాయని , విస్తరణ వాదాన్ని కాదని చైనాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఇటీవల సంభవించిన భూకంపంలో మృతి చెందిన వారికి భారత్ తరఫున సంతాపం తెలియజేశారు. ఈ సాయంత్రం ఆయన బిమ్‌స్టెక్ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో భారత్‌తోపాటు థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, భూటాన్ దేశాల అధినేతలు పాల్గొననున్నారు. బ్యాంకాక్ పర్యటనలో భాగంగా మోడీ పదవ ‘రామ’ గా కూడా ప్రసిద్ధుడైన థాయ్ రాజు మహా వజిరలాంగ్‌కోమ్‌ను కలుస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News