Monday, December 23, 2024

రిపోర్టు కార్డు విజిటింగ్ కార్డు కాదు

- Advertisement -
- Advertisement -

తల్లిదండ్రులకు ప్రధాని మోడీ హితవు
విద్యార్థులు తమతోనే పోటీ పడాలి, ఇతరులపై కాదు
పిల్లలు ఒత్తిడిని అధిగమించడం కీలకం
వారి సవాళ్లను తల్లిదండ్రులు, టీచర్లు ఉమ్మడిగా తేల్చాలి
నేను అర నిమిషంలో నిద్రిస్తాను

న్యూఢిల్లీ : ఒత్తిడిని అధిగమించేలా పిల్లల్లో దృఢవిశ్వాసాన్ని పాదుకొల్పడం కీలకం అని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉద్ఘాటించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి తల్లిడండ్రులు, టీచర్లు ఉమ్మడిగా మార్గాలు అన్వేషించాలని ప్రధాని హితవు చెప్పారు. తన వార్షిక పరీక్ష పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లతో ప్రధాని మోడీ ముఖాముఖి సాగిస్తూ, తల్లిదండ్రులు తమ పిల్లల రిపోర్ట్ కార్డ్‌ను సొంత విజిటింగ్ కార్డ్‌గా పరిగణించరాదని సలహా ఇచ్చారు. విద్యార్థులు తమతోనే పోటీ పడాలి తప్ప ఇతరులతో కాదని మోడీ సూచించారు. ‘ఒత్తిడిని అధిగమించడంలో మన పిల్లల్లో దృఢవిశ్వాసం పాదుకొల్పడం కీలకం.

మనం స్విచాఫ్ చేయరాదు. ఒత్తిడి అంతం కావాలి. ఎటువంటి ఒత్తిడినైనా తట్టుకొనే సత్తా వారిలో ఉండాలి. ఒత్తిడి పెరుగుతూనే ఉంటుందని, దానిని ఎదుర్కొనేందుకు సంసిద్ధం కాగలమనే నమ్మకం వారిలో ఉండాలి’ అని మోడీ అన్నారు. విద్యార్థులు ‘తమ కన్నా మరింత తెలివైనవారితో ఎల్లప్పుడూ స్నేహం చేయాలి’ అని కూడా ప్రధాని సూచించారు. ‘అటువంటి మిత్రుల వల్ల మీరు స్ఫూర్తి పొందాలి. చదువులు, పరీక్షల ఒత్తిడి మిమ్మల్ని దెబ్బ తీయరాదు’ అని ఆయన అన్నారు. పోటీ, సవాళ్లు ప్రేరణలుగా ఉంటున్నా పోటీ తప్పనిసరిగా ఆరోగ్యదాయకంగా ఉండాలి అని మోడీ అన్నారు.

‘ఇతర పిల్లల గురించిన ఉదాహరణలను తల్లిదండ్రులు ఎంతో మండి తమ పిల్లలకు ఇస్తుంటారు. తల్లిదండ్రులు అటువంటి పనులకు స్వస్తి పలకాలి’ అని ప్రధాని అన్నారు. ‘తమ జీవితాలలో అంతగా విజయవంతం కాని తల్లిదండ్రులకు చెప్పేందుకు ఏమీ ఉండకపోవడం లేదా తమ విజయాల గురించి ప్రపంచానికి చెప్పాలనుకుంటుండడం, తమ పిల్లల రిపోర్ట్ కార్డ్‌ను వారి విజిటింగట కార్డ్‌గా పరిగణిస్తుండడం కూడా మనం గమసించాం. వారు ఎవరినైనా కలుసుకున్నప్పుడు తమ పిల్లల గురించి వారిక చెపుతుంటారు’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘పిల్లలను ఇతరులతో పోల్చి చూడకూడదు. అది వారి భవిష్యత్తుకు నష్టదాయకం అవుతుంది. కొందరు తల్లిదండ్రులె తమ పిల్లల రిపోర్ట్ కార్డ్‌ను వారి విజిటింగ్ కార్డ్‌గా పరిగణిస్తుంటారు.

అది మంచిది కాదు’ అని మోడీ అన్నారు. పరీక్షలకు ముందుగా విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం ఏడవ ఎపిసోడ్‌లో ప్రధాని మోడీ ఈ అభిప్రాయాలు వెలిబుచ్చారు. విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి మూడు రకాలుగా ఉంటుందని, వాటిలో ఒకటి స్నేహితుల ఒత్తిడి, రెండవది తల్లిదండ్రులు తీసుకువచ్చే ఒత్తిడి, మూడవది స్వయంగా సృష్టించుకున్నది’ అని మోడీ వివరించారు. విద్యార్థులను భారత్ భవిష్యత్తుకు రూపశిల్పులుగా మోడీ అభవర్ణిస్తూ, పరీక్ష పే చర్చ కార్యక్రమం తనకూ ఒక పరీక్ష వంటిదేనని చెప్పారు. విద్యార్థులు ఎప్పటి కన్నా మరింత సృజనాత్మకంగా మారాలని మోడీ సలహా ఇచ్చారు. ఈ సంవత్సరం కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో టౌన్ హాల్ పద్ధతిలో నిర్వహించారు.

స్క్రీన్ టైమ్ నిద్రకు ఇబ్బందికరం
ప్రధాని మోడీ ఇదే కార్యక్రమంలో ఇంకా మాట్లాడుతూ, తాను పక్క మీద వాలగానే అర నిమిషంలోనే నిద్ర పోతుంటానని చెప్పారు. స్క్రీన్ సమయం తగ్గించుకోవాలని విద్యార్థులకు ప్రధాని సలహా ఇస్తూ, దాని వల్ల నిద్రకు ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. స్క్రీన్ సమయం వల్ల నిద్ర సమయం తగ్గిపోతుందని ఆయన అన్నారు. ‘సమతుల్య జీవనశైలిని కొనసాగించేందుకు ఇతర విషయాల్లో అతికి పోవడాన్ని నివారించాలి. ఆరోగ్యకర శరీరం ఆరోగ్యకర మనస్సుకు కీలకం. దానికి కొన్ని మామూలు కార్యక్రమాలు కావాలి. పగటి వెలుతురులో ఎక్కువ సమయం గడపాలి. పూర్తి నిద్రకు అది దోహదం చేస్తుంది’ అని మోడీ సలహా ఇచ్చారు. ‘స్క్రీన్ సమయం వంటి అలవాట్లు మనకు కావలసిన నిద్ర సమయాన్ని కుదిస్తుంటాయి. ఆధునిక ఆరోగ్య శాస్త్రానికి అది ఎంతో ముఖ్యమైనది’ అని మోడీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News