Tuesday, November 5, 2024

ప్రతిపక్షాల ఏకైక మంత్రం “అంతా కుటుంబం కోసమే”: మోడీ ధ్వజం

- Advertisement -
- Advertisement -

పోర్ట్‌బ్లెయిర్ : ప్రజాస్వామ్యం అంటే “ప్రజల యొక్క, ప్రజల ద్వారా, ప్రజల కోసం ”అని అర్ధం ఉండగా , బెంగళూరులో సమావేశమౌతున్న వంశపారంపర్య పార్టీలకు “ కుటుంబం యొక్క, కుటుంబం ద్వారా, కుటుంబం కోసం ” అన్నదే ఏకైక మంత్రం అని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్టుబ్లెయిర్‌లో వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోడీ మంగళవారం వీడియో కాన్ఫరెన్సింగ్ విధానం లో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ దుఃఖానికి బాధ్యులైన వారు ఇప్పుడు తమ దుకాణాలను తెరిచారని, ఈ దుకాణాల్లో కులతత్వవిషం, విపరీతమైన అవినీతి గ్యారంటీగా దొరుకుతాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ పార్టీలు బెంగళూరులో ఒకే వేదికపైకి వచ్చాయన్నారు. బెంగళూరులో జరుగుతున్నది స్వచ్ఛమైన అవినీతి ( భ్రష్టాచార) సమావేశమని ప్రజలు చెబుతున్నారని ఆరోపించారు. ఈ పార్టీలకు అభివృద్ధిపై దృష్టి లేదని, కొన్ని పార్టీలు తమ వంశపారంపర్య వారసత్వ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నాయని, దేశ ప్రయోజనాలు, సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ప్రజాస్వామిక వ్యవస్థలో వారసత్వ రాజకీయాలకు ప్రతిపక్ష పార్టీలు గుడ్డిగా మద్దతు ఇస్తున్నాయని తెలిపారు.

రూ. 20 లక్షల కోట్ల అవినీతి గ్యారంటీతో ప్రతిపక్షాలు ఏకమయ్యాయని దుయ్యబట్టారు. తమిళనాడులో డిఎంకె నేతలు అవినీతి కేసుల్లో ఉన్నా విపక్షనేతలు క్లీన్‌చిట్ ఇస్తున్నారని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత జరిగిన హింసాకాండను ప్రస్తావిస్తూ వామపక్ష, కాంగ్రెస్ నేతలు తమను కాపాడాలని వేడుకున్నా వారి నేతలు మాత్రం స్వార్థపూరిత రాజకీయాల కోసం వారిని దయనీయ పరిస్థితుల్లో వదిలేశారని ఆరోపించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి , ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ , కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలను పరోక్షంగా ప్రస్తావిస్తూ “ ఇది కట్టర్ అవినీతి సమ్మేళనమని ప్రజలు అంటున్నారని పేర్కొన్నారు. కోట్లాది రూపాయల అవినీతి కేసులో బెయిల్ మీద బయట ఉన్న వారిని ఎంతో గౌరవిస్తున్నారని, మొత్తం కుటుంబ సభ్యులంతా బెయిలుపై ఉంటే మరింత ఎక్కువగా గౌరవిస్తున్నారని అదే ఈ సమావేశానికి గల ప్రత్యేకతగా వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం తిరిగి 2024లో అధికారం లోకి వచ్చేలా ప్రజలు తమ మనస్సును తయారు చేసుకోవాలని మోడీ అభ్యర్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News