జాన్సన్, ఐరాసనేతల స్వాగతం
120 మంది నేతల వేదిక
జేమ్స్‌బాండ్‌లు కావాలన్న బోరిస్
గ్లాస్గో : స్కాట్లాండ్‌లో ఆరంభమైన ఐరాస వాతావరణ మార్పుల సదస్సు (కాప్ 26)కు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం హాజరయ్యారు. ఆయనకు ఇక్కడ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సాదర స్వాగతం పలికారు. కొద్ది సేపు మాట్లాడి ఆయనను వేదిక వద్దకు తీసుకువెళ్లారు. ప్రధాని మోడీ ఈ సదస్సులో వాతావరణ పరిరక్షణకు సంబంధించి భారతదేశ దృక్పథాన్ని తెలిపే జాతీయ ప్రకటన వెలువరిస్తారు. జి 20 సదస్సులో పాల్గొని ప్రధాని మోడీ ఇక్కడికి వచ్చారు. ఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రెస్ ప్రధానికి ఎదురేగి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, జాన్సన్‌లతో ఆయన మాట్లాడారు. ఆ తరువాత బ్రిటన్ ప్రధాని జాన్సన్ ఈ వాతావరణ సదస్సును ఆరంభించారు. ప్రపంచ స్థాయిలో ఉష్ణోగ్రతల పెరగుదలను కట్టడి చేయాల్సి ఉందని మరో రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే ప్రపంచవ్యాప్తంగా ఆహార సరఫరాలు దెబ్బతింటాయి. మూడు డిగ్రీలు పెరిగితే మరిన్ని కార్చిచ్చులు, తుపాన్లు తలెత్తుతాయని, నాలుగు డిగ్రీల స్థాయిని దాటితే ఇక మనం అన్ని నగరాల ఉనికిని మరిచిపోవల్సి ఉంటుందన్నారు.
ఈ విధంగా ప్రపంచం అంతా ఇప్పుడు జేమ్స్‌బాండ్ సినిమాలలో మాదిరిగా బాంబు బెల్ట్‌లు అమర్చినట్లుగా మారిందని, ఇప్పుడు మనం ఈ సదస్సు ద్వారా స్పందించాల్సి ఉంటుంది. ఈ భూగోళాన్ని జేమ్స్‌బాండ్ యాక్షన్ తరహాలో ముప్పు నుంచి తప్పించాల్సి ఉందన్నారు. ఇక్కడ చేరిన ప్రపంచ నేతలంతా జేమ్స్‌బాండ్లు అని, వారు టైమ్ బాంబులను తొలిగించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. గ్లాస్గో రెండు వారాల సదస్సుకు ప్రధాని మోడీతో పాటు దాదాపు 120 మంది ప్రపంచ స్థాయి నేతలు హాజరయ్యారు. 2015లో పారిస్ వాతావరణ సదస్సులో వెలువడ్డ తీర్మానాన్ని అమలుపర్చేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి ఈ సదస్సులో సమీక్షిస్తారు. కార్బన్ వాయువుల కట్టడిపై నిర్థిష్ట చర్యల అమలు దిశలో ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తారు. ప్రత్యేకించి అమెరికా , చైనా వంటి సంపన్న పారిశ్రామిక పటిష్ట దేశాల నుంచి ఈ దిశలో మరింత కార్యాచరణ అవసరం అని పిలుపు నిచ్చే అవకాశం ఉంది.