Thursday, January 23, 2025

యువతతోనే దేశానికి విశ్వఖ్యాతి: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విద్యారంగంలో గత కొద్ది సంవత్సరాలుగా గణనీయ సత్ఫలితాలు కనబడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇటీవలి కాలంలో చేపట్టిన భవిష్యదార్శనిక విధానాలు, తీసుకున్న నిర్ణయాలతో భారతీయ విశ్వవిద్యాలయాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కిందని చెప్పారు. శుక్రవారం ప్రధాని మోడీ ఇక్కడి ఢిల్లీ యూనివర్శిటీ శతజయంతి ఉత్సవాల ముగింపు దశలో జరిగిన స్నాతకోత్సవంలో ప్రసంగించారు. విద్యారంగంలో ఘననీయ మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. తాజా క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్‌లలో 45 భారతీయ వర్శిటీలు చోటుచేసుకున్నాయని, 2014లో ఈ సంఖ్య 12గా ఉండేదని తెలిపారు. అదే విధంగా ఐఐటిలు, ఐఎంఎస్‌లు, ఐఐఐఎంఎస్‌ల ,ఎన్‌ఐటిల సంఖ్య కూడా దేశవ్యాప్తంగా పెరిగిందన్నారు. నవ భారత నిర్మాణ దిశలో ఇటువంటి విద్యాసంస్థల ఏర్పాటు ఇతోధికంగా పెరగడం మంచి పరిణామం అవుతుందని తెలిపారు.

తాను ఇటీవల అమెరికాకు వెళ్లినప్పుడు ప్రపంచస్థాయిలో భారతదేశం పట్ల గౌరవం ఇనుమడించిందని గ్రహించినట్లు, దీనికి కారణం ఇక్కడి మన యువత సమర్థత, ప్రతిభలకు విశ్వస్థాయిలో విశ్వాసం పెరగడమే అన్నారు. ఇదంతా కూడా యువతరం ప్రతిభ ప్రాతిపదికన తలెత్తిన పరిణామం అన్నారు. విద్యా, సాంకేతిక, శాస్త్ర రంగాలలో ఎప్పుడూ భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుని విధానాలను రూపొందించుకోవాలి. కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. దీనిని తాము ఆచరించడం వల్ల సరైన రీతిలో ఇక్కడి విద్యాసంస్థలకు ప్రాధాన్యత పెరిగిందని, ఇది మన యువతకు, తద్వారా నవభారత నిర్మాణ క్రమానికి ఊతం అందిస్తుందన్నారు. తమ అమెరికా పర్యటనలో కుదిరిన పలు ఒప్పందాలతో ఇక్కడి యువతకు మరింత మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడి యువతరానికి బోలెడు సరికొత్త అవకాశాలు దక్కుతాయి.

ఇటు భూమి మొదలుకుని అటు అంతరిక్షం వరకూ వివిధ రంగాలలో బహుముఖ స్థాయిలో యువ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. దీనితో వారికి సరైన భవిత మల్చుకునే రీతిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయని ప్రధాని తెలిపారు. సెమి కండక్టర్లు, కృత్రిమ మేధ (ఎఐ) వంటి క్షేత్రాలలో కూడా ప్రతిభగల వారిని సముచిత అవకాశాలు వరిస్తాయని తెలిపారు. మైక్రాన్ , గూగుల్ వంటి ఐటి దిగ్గజ సంస్థలు దేశంలో భారీ పెట్టుబడులకు ముందుకు రావడం కీలక విషయం అన్నారు. అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతీయ యువత తన ప్రతిభను చాటుకుంటూ ఆయా దేశాల జనజీవన స్రవంతిలో కీలక భాగం కావడం గణనీయ పరిణామం అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఢిల్లీ యూనివర్శిటీ వివిధ జీవన అంశాల దిశలో సరైన సేవలను అందించి విశిష్ట సంస్థగా నిలిచిందని ప్రశంసించారు.

ఈ వర్శిటీ కేవలం విద్యాసంస్థనే కాకుండా ఓ ఉద్యమంగా చైతన్యవేదికగా నిలిచిందని తెలిపారు. ఢిల్లీ వర్శిటీ స్నాతకోత్సవానికి వెళ్లే దశలో ప్రధాని మోడీ కొద్ది సేపు మెట్రోరైలులో వెళ్లారు.ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News