Wednesday, January 22, 2025

కేరళలో ప్రధాని మోడీ సందడి

- Advertisement -
- Advertisement -

త్రిసూర్ : ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం గురువాయూర్‌కు వెళ్లారు. అక్కడ మలయాళ నటుడు, రాజకీయనేత సురేష్ గోపి కూతురు వివాహానికి హాజరయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. అంతకు ముందు ప్రధాని మోడీ కొచ్చిలో జరిగిన భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ వివాహ ఘట్టానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తరలిరావడంతో కేరళలో సందడి నెలకొంది. మలయాళ సూపర్‌స్టార్లు మమ్ముట్టి, మోహన్‌లాల్, జయరాం, దిలీప్ , కుష్బూ వంటి వారు రావడంతో వేదిక అంతా ఆకర్షణీయం అయింది. అంతకు ముందు ప్రధాని గురువాయ్యూర్‌లోని ప్రఖ్యాత శ్రీకృష్ణ ఆలయం సందర్శించుకున్నారు. పూర్తిగా సాంప్రదాయకమైన ధోవతి పైన తెల్లటి పట్టు శాలువాతో ఆలయంలో పూజలు నిర్వహించారు. సంబంధిత ఫోటోలు సామాజిక మాధ్యమంలో వెలువరించారు.

గురువాయూర్ ఆలయం పరమ పవిత్రం అని, ఇక్కడ అపార దైవిక శక్తి ఉందని, తాను ప్రార్థనలు నిర్వహించానని తెలిపారు. ప్రతి ఒక్క భారతీయుడు సుఖసంతోషాలతో , సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని ప్రధాని పేర్కొన్నారు. ఆ తరువాత ఆయన సురేష్ గోపీ కూతురు పెళ్లి వేదికకు తరలివెళ్లారు. వధూవరులను దీవించారు. జంటకు ముందుగా వరమాలలు అందించి పరస్పరం మార్చుకునేలా చేశారు. ప్రధాని మోడీ పాదాలకు నమస్కరించడం, వారిని ఆప్యాయంగా దీవించడం వంటి ఫోటోలు వైరల్ అయ్యాయి. దండలు మార్చుకున్న జంటకు స్వీట్లు అందించారు. గురువాయూర్‌కు ప్రధాని మోడీ ఉదయం 7.35 గంటలకు వచ్చారు. తెల్లవారుజాము, పూర్తిగా మంచు కమ్ముకుని ఉన్నప్పటికి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. బిజెపి కార్యకర్తలు జెండాలు ప్రదర్శిస్తూ , పార్టీ రంగు టోపీలతో సందడి చేశారు. ఆదరాభిమానాలతో తనకోసం తరలివచ్చిన వారిని చూసి తాను చలించినట్లు, ప్రజలకోసం మరింతగా పాటుపడేందుకు కృతనిశ్చయానికి వచ్చినట్లు సోషల్ మీడియాలో తెలిపారు.

హెలిపాడ్ నుంచి ఆయన నేరుగా శ్రీవల్సమ్ అతిధి గృహానికి వెళ్లారు. సాంప్రదాయక దుస్తులు వేసుకుని మందిరానికి తరలివెళ్లారు. ప్రధాని మోడీ తమ పర్యటనలో భాగంగా త్రిసూర్‌లోని త్రిప్రయార్ శ్రీరామ స్వామి దేవాలయానికి వెళ్లారు. పూజాదికాలు నిర్వహించారు. ప్రధాని మోడీ కేరళలో రెండు రోజుల పర్యటనకు మంగళవారమే వచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఈ దక్షిణాది కొన ప్రాంతపు రాష్ట్రంలో బిజెపి ప్రాబల్యం చాటుకునే సన్నాహక ప్రయత్నంగా ప్రధాని మోడీ కేరళ పర్యటనను బిజెపి ఆర్భాటం చేసిందని పరిశీలకులు విశ్లేషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News