Sunday, November 17, 2024

విపక్షాల ‘వాణి’కి చోటేది?

- Advertisement -
- Advertisement -

అందరి ఉమ్మడి కృషితో 17వ లోక్‌సభలో 97 శాతం పని జరిగిందని, ఇది స్వతహాగా సంతోషించదగ్గ విషయమని, ఏడు సెషన్లు 100% కంటే ఎక్కువ ఉత్పాదకతను కలిగి ఉన్నాయని, రాత్రంతా మేల్కొని కూర్చుని ప్రతి ఎంపి అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేశారని అంటూ 17వ లోక్‌సభ చివరి సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. పరోక్షంగా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ముందెన్నడూ లేని విధంగా ఫలదాయకంగా ఈ సమయంలో పార్లమెంట్ పని చేసిన్నట్లు ఘనతగా చాటుకున్నారు. అయితే, వాస్తవానికి పార్లమెంట్ పని తీరు నానాటికీ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ, కేవలం మొక్కుబడిగా బిల్లుల ఆమోదం జరుపుకునేందుకు అన్నట్లుగా మారుతున్నాయి. ప్రభుత్వం తమకు వ్యతిరేకమైన స్వరాలు వినేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా విముఖంగా వ్యవహరిస్తున్నది. ఈ ఐదేళ్ల కాలంలో డిప్యూటీ స్పీకర్ నియామకం లేకుండానే సభా కార్యకలాపాలు జరపడం గమనిస్తే ప్రతిపక్షాల పట్ల ఏర్పరచుకున్న అసహనాన్ని వెల్లడి చేస్తుంది.

1969 నుండి డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్ష నేతకు ఇవ్వడం ఓ సంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్నది. ఈ సంప్రదాయం పాటించడం ఇష్టం లేకనే స్వాతంత్య్రం తర్వాత మొదటిసారి ఆ పదవికి అసలు ఎన్నికనే జరపలేదు. లోక్‌సభ పని తీరుపై పౌర సమాజ బృందాలు విడుదల చేసిన ‘ఛార్జ్ షీట్’ ఈ సందర్భంగా విభ్రాంతి కలిగించే అంశాలను వెల్లడి చేసింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా, ప్రజాస్వామ్యానికి మాతృకగా చెప్పుకోవడమే గాని ఆచరణలో మన రాజకీయ పార్టీలు అత్యంత ‘అప్రజాస్వామికం’గా మారుతున్నట్లు వెల్లడి అవుతుంది. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చకు ఆస్కారం లేకుండా చేస్తూ, వారి ఆందోళనల నేపథ్యంలో సభా కార్యక్రమాలు జరిపే ప్రయత్నమే చేయకుండా, చివరి రెండు రోజులు హడావుడిగా చర్చలు లేకుండా, ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి బహిష్కరించి బిల్లులను ఆమోదింప చేసుకోవడం ఒక ఆనవాయితీగా మారింది. 97% పని జరిగిందని ప్రధాని ఏ విధంగా చెప్పారో గాని ఈ లోక్‌సభలో జరిగినన్ని తక్కువ సమావేశాలు ఇంతకు ముందెన్నడూ జరగలేదు.

17వ లోక్‌సభలో సుమారు 278 సెషన్స్ మాత్రమే జరిగాయి. వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో 1999 నుండి 2004 వరకు 13వ లోక్‌సభలో జరిగిన 423 సిట్టింగ్‌లతో పోలిస్తే ఇది దాదాపు 34% తక్కువ. 2020లో, కరోనా మహమ్మారి కారణంగా అనేక ఇతర దేశాలు చట్టసభల ఆన్‌లైన్ సమావేశాలను నిర్వహించాయి. కానీ ఆ సమయంలో మన దేశంలో కేవలం 33 సమావేశాలు మాత్రమే జరిగాయి. దాదాపు ప్రతి సెషన్ సమయంలో కూడా ప్రభుత్వం తన స్వంత ఎజెండాను పూర్తి కాగానే గడువుకన్నా ముందుగానే వాయిదా వేస్తూ వచ్చింది. 2020 నుండి 2022 మధ్య ఆ విధంగా వరుసగా ఏడు సెషన్‌లు షెడ్యూల్ కంటే ముందే ముగిశాయి. 2023లో జరిగిన చివరికి ప్రత్యేక సెషన్‌తో పాటు శీతాకాల సమావేశాలు కూడా షెడ్యూల్ కంటే ముందే ముగిశాయి. షెడ్యూల్ కంటే ముందే సెషన్ ముగిసినప్పుడు, మిగిలిన రోజుల వ్యవధి కోసం అడిగే ప్రశ్నలన్నీ ముగిసిపోతాయి. ఇక ఆర్డినెన్స్‌ల జారీలో సహితం రికార్డు సృష్టించారు. యుపిఎ II ప్రభుత్వంలో 2004 -14 మధ్య 61 ఆర్డినెన్స్‌లు జారీ చేయగా, 2014 నుండి 2021 మధ్య 76 ఆర్డినెన్స్‌లు జారీ అయ్యాయి.

ఇప్పటి వరకు 17వ లోక్‌సభలో (డిసెంబర్ 21, 2023 నాటికి), లోక్‌సభలో 86 బిల్లులు, రాజ్యసభలో 103 బిల్లులను 2 గంటల కన్నా తక్కువ చర్చతో ఆమోదింపచేశారు. 2023 వర్షాకాల సమావేశంలో రాజ్యసభ ఫార్మసీ (సవరణ) బిల్లును కేవలం 3 నిమిషాల్లోనే ఆమోదించడంతో కొత్త రికార్డు సృష్టించబడింది. మరుసటి రోజు, లోక్‌సభ రెండు బిల్లులను సెంట్రల్ జిఎస్‌టి సవరణ, ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టి సవరణ బిల్లు 3 నిమిషాల్లో ఆమోదించింది! గత పార్లమెంట్ సెషన్‌లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఎజెండాలో కేవలం మూడు బిల్లులు మాత్రమే ఉన్నాయి.అయితే ఎజెండాలో అసలు చేర్చని మరో 3 కొత్త బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2009- 2014 మధ్య అన్ని బిల్లులలో 71% స్టాండింగ్ కమిటీలకు పంపగా, 2019 నుండి 16% బిల్లులు మాత్రమే స్టాండింగ్ కమిటీలకు పంపారు. 2014 నుండి 2021 మధ్య పార్లమెంటులో ప్రవేశపెట్టిన 301 బిల్లులలో 24.5% బిల్లులు మాత్రమే సంప్రదింపుల కోసం సర్క్యులేట్ చేశారు. అయితే, ఈ 74 బిల్లులలో కనీసం 40 బిల్లులను సభా సంప్రదాయాల ప్రకారం అందుకు కనీసంగా 30 రోజుల వ్యవధి ఇవ్వలేదు. కీలకమైన మూడు క్రిమినల్ బిల్లులను అధ్యయనం చేసిన బిజెపి ఎంపి అధ్యక్షతన హోం వ్యవహారాల కమిటీ ప్రజల నుండి అభిప్రాయాలను ఆహ్వానించలేదు.

ఈ బిల్లుల తయారీ ప్రక్రియలో కమిటీ హడావిడిగా వ్యవహరించిన తీరు, ఎంపిక చేసిన వ్యక్తులను మాత్రమే కమిటీ ముందు అభిప్రాయలు చెప్పేందుకు ఆహ్వానించడం పట్ల పలువురు ప్రతిపక్ష ఎంపిలు అసమ్మతిని వ్యక్తం చేశారు. 2014 నుంచి కేవలం ఐదు బిల్లులు మాత్రమే ఉమ్మడి పార్లమెంటరీ కమిటీలకు వెళ్లాయి. 2016 నుండి 2023 మధ్య, సగటున, బడ్జెట్‌లో 79% చర్చ లేకుండానే ఆమోదించారు. ప్రతి మంత్రిత్వ శాఖ పద్దులను వివరంగా పరిశీలించడానికి స్టాండింగ్ కమిటీలనుఅవకాశం కల్పించేందుకు బడ్జెట్ సెషన్‌కు మధ్యలో విరామం ఇస్తారు. 2016లో 40 రోజులుగా ఉన్న విరామాన్ని 2021లో 20 రోజులకు తగ్గించారు. ఈ వ్యవహారాలను చూస్తుంటే చట్టాలపై, బడ్జెట్ పద్దులపై సమగ్రమైన చర్చల పట్ల ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపలేదని, హడావుడిగా వాటి ఆమోదం పట్లనే శ్రద్ధ చూపిందని స్పష్టం అవుతుంది.అత్యాధునిక వసతులతో, ఛేదించే అవకాశం లేని భద్రతా ప్రమాణాలతో నిర్మించామని చెప్పుకున్న నూతన పార్లమెంట్ భవనం లో తొలి సమావేశంలోనే మొత్తం దేశం దిగ్భ్రాంతి చెందే విధంగా భద్రత ఉల్లంఘన బయటపడింది. దీనిపై చర్చ జరగాలని, ప్రధాని, హోంమంత్రి ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన 146 మంది ఎంపిలను సస్పెండ్ చేసి నూతన చరిత్ర సృష్టించారు.

ఏ ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా జరిగి ఉండదు. పార్లమెంట్ బయట, టివి ఇంటర్వ్యూలలో ఈ ఘటనపై యథేచ్ఛగా మాట్లాడారు గాని పార్లమెంట్‌లో నోరు విప్పకపోవడం సభపట్ల అమర్యాదగానే భావించాల్సి ఉంటుంది. ఎంపిల సస్పెన్షన్ తర్వాత, ప్రభుత్వం మూడు క్రిమినల్ బిల్లులు, టెలికమ్యూనికేషన్ బిల్లు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లు మొదలైన అనేక కీలకమైన బిల్లులను ఉభయ సభల ముందుకు తీసుకు రావడంతో సరైన చర్చ లేకుండా వాటిని ఆమోదింప చేసుకోవడం కోసమే ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించినట్లు అనుమానించాల్సి వస్తుంది. 2023 శీతాకాల సమావేశాల సమయంలో ప్రతిపక్ష ఎంపిలు అడిగే దాదాపు 290 ప్రశ్నలు సభ నుండి సస్పెండ్ కావడంతో తొలగించారు. సస్పెండ్ అయిన కారణంగా వారి ప్రశ్నలను తొలగించాలనే నియమాలు ఎక్కడా లేకపోయినా ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి రావడం పట్ల ప్రభుత్వంలో అసహనం వ్యక్తం అవుతుంది. మొత్తం మీద రాను రాను మన పార్లమెంట్ సమావేశాల ప్రమాణాలు దిగజారుతూ ఉండటం ఆందోళన కలిగిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News