Wednesday, January 22, 2025

‘మోదానీ’లను పెంచిన మోడీ!

- Advertisement -
- Advertisement -

మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలననుపూర్తి చేసుకున్న సందర్భాన్ని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణులు ఘనాతిఘనంగా, ఒక పెద్ద ఉత్సవ సందర్భంగా చెప్పుకుంటున్నారు. మోడీ ప్రభుత్వ పాలనలో ఒక్క మంచి పని కూడా కనిపించదని నిస్సందేహంగా, నిర్భ యంగా చెప్పవచ్చు. గత ఎనిమిది సంవత్సరాల కాలంగా, మోడీ ప్రభుత్వం దేశంలో కార్పొరేట్ రంగానికి ఏకపక్షంగా అంకితమై సేవలందిస్తున్నది. పెట్టుబడి దారుల కోసం ఇంత నిస్సిగ్గుగా పని చేసిన ప్రభుత్వాన్ని బ్రిటిష్ వలస పాలకుల నుంచి అధికార బదిలీ జరిగిన తర్వాత మనమెన్నడూ చూడలేదు. మోడీ విధానాలతో ఆర్థిక వ్యవస్థ చరిత్ర లో చూడనంత వేగంగా పతనావస్థకు చేరుకొన్నది. జిడిపి వృద్ధిరేటు అధఃపాతాళానికి పడిపోయింది. విదేశీ మారక నిల్వలు కరిగి పోతున్నాయి. ద్రవ్యోల్బణం ఎనిమిదేండ్ల గరిష్టానికి చేరింది.

పారిశ్రామి కాభివృద్ధి చెందలేదు. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. నిరుద్యోగం 45 ఏండ్ల గరిష్టానికి చేరింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటు తున్నాయి. కరోనా మహమ్మారి, ఆర్థిక సంక్షోభం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల భారత దేశ ప్రజానీకం ఈ ఏడాది ఎన్ని బాధలు పడుతున్నా మోడీ ప్రభుత్వ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం దేశం లోని ధనవంతులకు మాత్రం బంగారు పంట పండిస్తోందని సాక్షాత్తు ఫోర్బ్స్ పత్రిక తెలిపింది. మోడీ అధికారంలో వచ్చిన తరువాత కోట్లకు పడగలెత్తిన ఆయన కార్పొరేట్ మిత్రుడు గౌతవ్‌ు అదానీ ఆస్తులు ఈ ఏడాది ఎంతగా పెరిగాయంటే ఆయన ఈ భూమి మీద అత్యధిక ధనవంతుల్లో రెండో స్థానం ఆక్రమించారు.అంతేకాదు బిజెపి ప్రభుత్వ హయాంలో 2022లో దేశంలోని 100 మంది అత్యంత ధనికులు మరింత ధనవంతుల య్యారని ఫోర్బ్స్ పత్రిక వివరాలతో సహా నవంబర్ సంచికలో వివరాలు ఇచ్చింది.

భారత దేశంలోని అత్యంత ధనికుల ఆస్తులలో 30 శాతం గౌతవ్‌ు అదానీ, ముఖేష్ అంబానీల వద్ద పోగుపడ్డాయని పత్రిక తెలిపింది. అధిక 100 మంది ధనికుల ఆస్తి 2022లో 2 లక్షల కోట్ల రూపాయలు పెరిగి మొత్తం 65 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నది. దేశంలోని టాప్ 10 మంది ధనికుల ఆస్తి రూ. 31.70 లక్షల కోట్లకు చేరుకుంది. 2021లో గౌతవ్‌ు అదానీ ఆస్తి మూడు రెట్లు పెరిగి క్రమంగా ఆయన దేశంలో అత్యధిక ధనవంతుడయ్యాడు. 2022లో ఆయన ఆస్తి రెట్టింపై రూ. 12.3 లక్షల కోట్లకు చేరింది. దేశంలో రెండవ అతిపెద్ద ధనవంతులైన ముఖేశ్ అంబానీ ఆస్తి విలువ రూ. 7.21 లక్షల కోట్లు. గతేడాదికన్నా ఈయన ఆస్తి విలువ 5% తగ్గింది. డీమార్ట్ సూపర్ మార్కెట్ చైన్ యజమాని రాధాకష్ణ దాల్మియా రూ. 1.76 లక్షల కోట్లతో ధనవంతుల లిస్టులో మూడో స్థానం లోనూ, జిందాల్ గ్రూప్ ఛైర్ పర్సన్ సావిత్రి జిందాల్ రూ. 1.34 లక్షల కోట్లతో నాలుగో స్థానంలోనూ ఉన్నారు.బజాజ్ కుటుంబం ఈ జాబితాలో 10 స్థానంలో ఉంది.

ఈ ఎనిమిదేళ్లలో మోడీ ప్రభుత్వం రూ. వంద లక్షల కోట్ల అప్పు చేసింది. దేశాన్ని ఇంతగా అప్పుల ఊబిలో దించిన ఆయన పాలన ప్రజలకు ఏమి చేసిందంటే నిజానికి గుండుసున్నాయే కళ్ల ముందు ప్రత్యక్షమ వుతుంది. 2016లో అమలు చేసిన పెద్దనోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థలో, సామాన్య జనజీవనంలో ఎంతటి బీభత్సాన్ని సృష్టిం చిందో తెలియనిది కాదు. అక్రమ సంపదను వెలికి తీయడానికే పెద్దనోట్ల రద్దును చేపట్టామని మోడీ చెప్పుకున్న గొప్పల బూటకం నగ్నంగా కళ్లకు కట్టింది. నిజానికి పెద్దనోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. జిఎస్‌టి అమలు చేస్తున్న తీరు నేటికీ విమర్శలకు గురవుతున్నది. కరోనా సమయంలో అమలు చేసిన లాక్‌డౌన్ పేదల ఉసురుతీసింది. రైతుల నోటికాడ మట్టి కొట్టడాని కి, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికి ఉద్దేశించి తెచ్చిన మూడు సాగు చట్టాలు, కార్మికుల హక్కులను హరించే నాలుగు కార్మిక చట్టాలు, వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) అమలు వలన ప్రజలకు మేలు కన్నా నష్టమే ఎక్కువ జరిగింది.

మోడీ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల 84% ప్రజల రాబడి తగ్గిపోయింది. ధనికులు మాత్రం కోట్లల్లో లాభాలు గడించారు. 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 60 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, దుకాణాలు మూతపడ్డాయి.కోవిడ్ విపత్తుతో ప్రజలు నానాబాధలు పడుతున్నప్పుడు దేశంలో అదానీ, అంబానీ ల సంపద రోజుకు రూ. 1000 కోట్లు పెరిగింది. అధిక ధరలతో, ఉపాధులు లేక కొనుగోలు శక్తి కోల్పోయి ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే దేశంలో కుబేరుల సంఖ్య పెరిగింది. 2016లో భారత దేశంలో 100 మంది బిలియనీర్లు ఉండగా, ఆ సంఖ్య నేటికి 170కి చేరింది. మోడీ అసమర్థతను, ప్రజా వ్యతిరేక విధానాలను కప్పి పుచ్చుకోవడానికి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చురేపి, అందులో వారు మాడి మసిఅయిపోతుంటే బిజెపి పాలకులు ఫాసిస్టు పాలనను కొనసాగిస్తున్నారు. దళితులు, మైనారిటీలపై కక్ష కట్టి సంఘ్ పరివార్ అకతాయి మూకలు సాగిస్తున్న దుర్మార్గాన్ని ఆపకుండా మోడీ ప్రభుత్వం మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తోంది.

మరోవైపు, దేశంలో బహుళత్వం స్ఫూర్తికి బిజెపి విఘాతం కలిగి స్తున్నది. ప్రజల మధ్య కుల, మత వైషమ్యాలను రెచ్చ గొడుతూ దేశాన్ని ఆర్థిక పరాధీన దిశకు తీసుకువెళ్తున్నది. తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి ప్రజల దృష్టిని భావోద్వేగ, యుద్ధ కాంక్షల వైపు మళ్లిస్తున్నది. ప్రజలను మతోన్మాద మత్తులోకి నెట్టి, ప్రజా ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు చవకగా కట్టబెట్టే పనిని చాకచక్యంగా జరిపి వేస్తున్న ఘనత మోడీ ప్రభుత్వానిదే.

ప్రజలను కొల్లగొట్టి పండగ చేసుకోవడమంటే ఇదే. సర్వసమాన హక్కులు అనుభవి స్తున్న ముస్లింలను రెండవ తరగతి పౌరులుగా చేయడానికి మోడీ పాలనలో కరడుగట్టిన హిందూత్వవాదులు చేయని ప్రయత్నమం టూ లేదు. రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని బిజెపి ప్రభుత్వం, సంఘ్ పరివారం తమ వ్యతిరేక గళాలను, కలాలను అణచి వేయడానికి, తమకు నచ్చని వారిని కష్టాల పాలు చేయడానికి ఎన్ని కుయుక్తులు పన్నుతారో, చట్టాలను ఎలా తుంగలో తొక్కుతున్నారో చెప్పడానికి కేంద్రంలో మోడీ ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల్లో బిజెపి నేతత్వంలోని ప్రభుత్వాలు అమలు చేస్తున్న బుల్డోజర్ రాజ్యమే నిదర్శనం. ఈ విద్వేష విషానికి ఎక్కువగా బలయ్యేది మైనారిటీలే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇలా ఎవరైనా సరే బుల్డోజర్లను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. బుల్డోజర్ అంటే ఇప్పుడు యంత్రం మాత్రమే కాదు. అది ఇప్పుడు విద్వేషానికి, విధ్వంసానికి చిహ్నం. హిందు మతోన్మాదుల చేతుల్లో ఆయుధం. ప్రజాస్వామ్యానికి, సమాన అవకాశాలకు, స్వేచ్ఛకు, లౌకికత్వానికి శత్రువు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నత దశే సామ్రాజ్యవాదం అనుకుంటే అది ఇంకా, ఇంకా బలపడినప్పుడు ఫైనాన్స్ మూల ధనం ఆధిపత్యం ఇప్పుడున్నట్టు పరాకాష్ఠ దశలో ఉంటుందని లెనిన్ 1916లోనే ‘ఇంపీరియలిజం ది హయ్యెస్ట్ స్టేజ్ ఆఫ్ కాపిటలిజం’ లో స్పష్టంగా చెప్పారు. సి.టి కురియన్ ప్రకారం 1990 నాటికే 90 శాతం ఫైనాన్షియల్ లావాదేవీలకు వస్తు సేవలతో సంబంధమే లేదు. అందువల్లనే 2021లో గ్లోబల్ ఫారెక్స్ మార్కెట్ విలువ 1920 కోట్ల లక్షల కోట్ల రూపాయలు.

మన దేశంలో, అసలు వర్ధమాన దేశాలలో ప్రజల జీవన విధ్వంసం, నిరుద్యోగిత, పేదరికం, ద్రవ్యోల్బణం, తగ్గుతున్న కరెన్సీ విలువ అన్నింటినీ నిర్ణయించేది లెవియథాన్ ఆకారంలో ఉన్న ఫైనాన్స్ క్యాపిటల్, కొనసాగుతున్న సామ్రాజ్యవాద దోపిడీ, అందుకు నయా ఉదారవాద విధానాల ద్వారా మన ప్రభుత్వం అందిస్తున్న బలమైన మద్దతు. ఈ కారణాలతో మెజారిటీ ప్రజల జీవితాలే అభావం అవుతున్నాయి. ధనవంతులు సంపన్నులు కావటానికి సహాయం చేస్తే తద్వారా పెరిగిన సంపదలో కొంత భాగం సాధ్యమైనంత త్వరగా జల్లెడ బొట్ల లాగా పేదలకు చేరుతుందని నయా ఉదారవాద సిద్ధాంతం బోధిస్తోంది. ఈ సిద్ధాంతం ముసుగులోనే కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వనరులు, ప్రభుత్వ వనరులను కారుచౌకగా కార్పొరేట్ కంపెనీల కు అప్పగిస్తోంది. నయా ఉదారవాద వ్యవస్థలో సంపన్నులు మహా సంపన్నులవు తారు. పేదలు నిరుపేదలవుతారు. ఎందుకంటే ఈ వ్యవస్థ పన్నిన వ్యూహమే అటువంటిది. కానీ గత రెండు దశాబ్దాల పాటు ఈ విధానాలు అమలు చేసిన తర్వాత పేదల పట్ల సంప న్నుల ఏహ్య భావం, అవమానాలు, చెరబాట్లు తప్ప ఏమీ కిందకు చేరటం లేదు.

కాబట్టి ఈ బోగస్ జల్లెడ బొట్ల సిద్ధాంతాన్ని తిరగదోడి దీన్ని వెనక్కు కొట్టాలంటే కార్పొరేట్ దోపిడీకి స్వస్తి చెప్పగలిగే ప్రభుత్వం భారత దేశానికి కావాలి. సంపన్నులపై పన్నులు విధించే శక్తి గల ప్రభుత్వం కావాలి. ఆర్థిక, సామాజిక అసమాన తలు తగ్గించి ప్రజలందరికీ సమ న్యాయం అందుబాటు లోకి తేగలిగిన ప్రభుత్వం కావాలి. ఉపాధి కల్పన లక్ష్యంగా అభివృద్ధి వ్యూహాలను రూపొందించే ప్రభుత్వం కావాలి. ప్రజా రోగ్యం, ప్రభుత్వ విద్య, ఆహార భద్రత, ప్రజోపయోగమైన మౌలిక వసతుల నిర్మాణం వంటి విధానాలు అమలు చేయగల ప్రభుత్వం కావాలి. తద్వారా ఆర్థికాభివృద్ధి, సమానత్వం రెండూ ఒకే విధాన లక్ష్యాలుగా మార్చగలిగిన ప్రభుత్వాన్ని సాకారం చేసుకోవాలి. సమానత్వం, సామాజిక న్యాయం గల భారత దేశాన్ని నిర్మించు కోవాలంటే లౌకిక, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకోవడమే నేడు దేశ ప్రజలు ముందున్న ప్రథమ కర్తవ్యం.

నాదెండ్ల శ్రీనివాస్, 9676407140

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News