ఎన్నెన్నో ఎగుడుదిగుడులు, ఒడుదుడుకుల తర్వాత పరస్పర బంధాన్ని పటిష్ఠపరచుకోడానికి భారత్, బంగ్లా ప్రధానులు చూపిన చొరవ మెచ్చుకోదగినది. మన ఇరుగుపొరుగు దేశాలన్నింటితోనూ సత్సంబంధాలను పెంచుకోడంపై చైనా చూపిస్తున్న ఆసక్తిని గమనిస్తే ఇందులో ఇప్పటికీ మనం వెనుకబడి ఉన్నామని అంగీకరించక తప్పదు. అప్పటి మన ప్రధాని ఇందిరా గాంధీ ఇచ్చిన సంపూర్ణ మద్దతుతో తూర్పు పాకిస్థాన్ బంగ్లాదేశ్‌గా అవతరించిన చరిత్రాత్మక ఘట్టానికి 50 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బేగం ఆహ్వానాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఢాకాలో జరిపిన రెండు రోజుల పర్యటన ఉభయ దేశాలను ముందు ముందు మరింత చేరువచేయగలదనే ఆశలకు అంకురార్పణ చేసింది. మన ఐదు రాష్ట్రాలతో 4,096 కి.మీ. పొడవైన అంతర్జాతీయ సరిహద్దు గల బంగ్లాదేశ్ ఎంత ముఖ్యమైన పొరుగు దేశమో వివరించి చెప్పనక్కర లేదు. ఇచ్చిపుచ్చుకునే సంబంధాలను పెంచుకోడం ద్వారా రెండు దేశాలూ పరస్పర ప్రయోజనాలను మరెంతగానో సాధించుకోగలుగుతాయి.
రెండు దేశాల మధ్య వాణిజ్యం అసాధారణ వేగంతో పెరగడానికి బదులు ఎక్కడ ఉన్న గొంగళి అక్కడే అన్నట్టు అఘోరించడం బాధాకరం. మన కంటే చాలా చిన్నదైన బంగ్లాదేశ్ విదేశీ వాణిజ్య ప్రగతిలో ఆదర్శప్రాయంగా నిలిచిందని ఈ ఏడాది మన ఆర్థిక సర్వే నివేదికే నొక్కి పలికింది. 2011లో ప్రపంచ ఎగుమతుల్లో 0.1 శాతంగా ఉన్న బంగ్లా వాటా 2019 నాటికి 0.3 శాతానికి ఎగబాకింది. తనకు చేవ చేతనైనతనం ఉన్న రంగాలలో ఎగుమతుల మీద దృష్టిని కేంద్రీకరించి, వెనుకబడిన దేశంగా తనకు అందివచ్చిన రాయితీలను ఉపయోగించుకొని విదేశీ వాణిజ్యంలో విశేషమైన మిగులును సాధించుకొన్న బంగ్లాదేశ్ నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలెన్నో ఉన్నాయని కూడా మన ఆర్థిక సర్వే గుర్తు చేసింది. ప్రధాని మోడీ తాజా ఢాకా పర్యటన భారత్, బంగ్లా గత సంబంధాలలోని మాధుర్యాన్ని గుర్తు చేసింది. అయితే మన పాలక పక్షం పాటిస్తున్న మతతత్వ ఎజెండా కారణంగానూ, అటు నుంచి గతంలో మనను తరచూ ఇబ్బంది పెడుతూ వచ్చిన శరణార్థుల సమస్య, సీమాంతర ఉగ్రవాదం వల్లనూ రెండు దేశాల మధ్య ఎడం బాగా పెరిగింది.
విపత్తుల నిర్వహణ, వాణిజ్య సమస్యల పరిష్కారం వంటి ఐదు రంగాలలో కుదిరిన ఒప్పందాలు ఉభయ తారక సంబంధాలలో మంచి భవిష్యత్తు వైపు ఒక మాదిరి ఆశాకిరణాలని చెప్పవచ్చు. భారత దేశం నుంచి 190 అంబులెన్సు వాహనాలను అందజేసిన ప్రధాని మోడీ 1.2 మిలియన్ల కొవిడ్ టీకా డోసులు సరఫరా చేయనున్నట్టు తెలపడం మంచి పరిణామం. ఈ మేలు మలుపును సాధించడంతోపాటు ప్రధాని మోడీ ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తన పార్టీకి తోడ్పడగల ఒక ఘట్టాన్ని కూడా చాకచక్యంగా నెరవేర్చుకొని వచ్చారు. బెంగాల్‌లో అధికారాన్ని కైవసం చేసుకొని తీరాలన్న పట్టుదలతో అక్కడి పాలక పక్షం తృణమూల్ కాంగ్రెస్‌తో భారతీయ జనతా పార్టీ హోరాహోరీ పోరు సాగిస్తున్నది. బంగ్లాదేశ సమయంలోనూ ఆ తర్వాత అక్కడి నుంచి వెల్లువెత్తి వచ్చిన మతువా తెగ హిందూ శరణార్థుల ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకంగా ఉన్నాయి. బెంగాల్‌లోని నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో వీరి ఓట్లు కేంద్రీకృతమయ్యాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ నుంచి వచ్చి స్థిరపడిన ముస్లిమేతరులకు శాశ్వత భారత పౌరసత్వాన్ని కలిగించే ఉద్దేశంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ఈ ఓటర్లలో ఆశలు పెంచి కమలం పార్టీకి చేరువ చేసింది.
పర్యవసానంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో వీరి ఓట్లతో బెంగాల్‌లో బిజెపి 18 లోక్‌సభ స్థానాలు, 40 శాతం పైగా ఓట్లు సాధించుకొని విశేష ప్రయోజనం పొందింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో వీరి ఓట్లను మరింతగా ఆకట్టుకునే వ్యూహంలో భాగంగా ప్రధాని మోడీ తన బంగ్లా పర్యటనలో ఢాకా నగరానికి 190 కి.మీ దూరంలో ఉన్న ఒరకండి అనే చోట గల మతువా తెగ వ్యవస్థాపకుడు హరిచంద్ ఠాకూర్ స్మారక ప్రదేశాన్ని సందర్శించి నివాళులర్పించారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఆధారపడినంతగా ఇప్పటి అసెంబ్లీ సమరంలో బిజెపి సిఎఎను గురించి చెప్పుకోడం లేదని అంటున్నారు. మతువాలలో కూడా దానిపై ఆశలు సన్నగిల్లాయనే అభిప్రాయం వినవస్తోంది. ఈ విధంగా ప్రధాని మోడీ బంగ్లా పర్యటన కొంచెం దేశ ప్రయోజనాలను, మరి కొంచెం పార్టీ మేలును దృష్టిలో పెట్టుకొని సాగినప్పటికీ తీస్తా నది జలాల్లో ఎక్కువ వాటా కోరుతున్న ఢాకా అభీష్టాన్ని నెరవేర్చే వైపు గట్టి అడుగులు పడనంత వరకు రెండు దేశాల మధ్య సంబంధాలు విశేషంగా మెరుగుపడబోవనే నైరాశ్యం ఖడ్గంలా వేలాడుతూనే ఉంటుంది. మోడీ పర్యటనపై బంగ్లాలోని మత ఛాందస వర్గాల నిరసనలు శ్రుతిమించి కాల్పుల్లో పలువురు మరణించడం బాధాకరం.