ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఆప్‌ను ఢిల్లీకి ‘ఆపద’గా దుయ్యబట్టారు. ఈ ‘ఆపద’ గడచిన పది సంవత్సరాలుగా దేశ రాజధానిని తన గుప్పిటిలోకి తీసుకున్నదని మోడీ ఆరోపించారు. దేశ రాజధానిలో గృహవసతి, విద్యా రంగాల్లోని ప్రాజెక్టులు సహా పలు లిక వసతుల ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ ఆప్ సారథ్యంలోని నగర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ పార్టీ పాలన కనుక కొనసాగినట్లయితే దేశ రాజధానిలో పరిస్థితి అధ్వానంగా మారుతుందని ఆయన అన్నారు. కేంద్రం ఒక వైపు ఎంతో కృషి చేస్తోందని, మరొక వైపు కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం నిర్లజ్జగా అబడ్ధాలు వల్లె వేస్తోందని మోడీ పేర్కొంటూ, పాఠశాల విద్య నుంచి కాలుష్య నివారణ, మద్యం వ్యాపారం వరకు పలు రంగాల్లో అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. వచ్చే నెల నగరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఢిల్లీ ఈ ‘ఆపద’పై పోరు ప్రారంభించిందని, దీని నుంచి విముక్తి పొందాలని నిశ్చయించిందని చెప్పారు.
ఆప్ పరాజయానికి మోడీ పిలుపు ఇస్తూ, ‘ఆపదను సహించబోం, దానిని తొలగిస్తాం’ అని నినాదం చేశారు. ‘ఈ ఏడాది జాతి నిర్మాణం, జన సంక్షేమం అనే కొత్త రాజకీయాలను తీసుకువస్తుంది. అందువల్ల ఆపదను తొలగించి, బిజెపిని అధికారంలోకి తీసుకురావలసి ఉంటుంది’ అని అన్నారు. కేంద్రం ప్రధానంగా చేపట్టిన ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్. ఇతర కార్యక్రమాల అమలును నగర ప్రభుత్వం అనుమతించని కారణంగా తాను ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఇక్కడ నివసించే ప్రజలకు పూర్తిగా సాయంచేయలేకపోతున్నట్లు చెప్పారు. రాజధానిలో రహదారుల నిర్మాణం జరుగుతోందంటే, ఢిల్లీ అభివృద్ధి ప్రాధికార సంస్థ (డిడిఎ) నిరుపేదలకు ఇళ్లు సమకూర్చగలుగుతోందంటే, ఈ రంగాల్లో ‘ఆపద’కు అంతగా పాత్ర లేకపోవడమే కారణం అని ఆయన అన్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధిపతి అర్వింద్ కేజ్రీవాల్‌ను మోడీ తూర్పారపడుతూ, తాను తన కోసం ‘అద్దాల మేడ’ కట్టుకునేవాడినే అని, కానీ తన కల దేశంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు సమకూరాలనేదే అని తెలిపారు. ‘ఈ వ్యక్తులు అవినీతికి పాల్పడుతూ, దానిపై గప్పాలు కొడుతుంటారు’ అని మోడీ పేర్కొంటూ,
ఆప్‌ది సిగ్గులేనితనం అని, తప్పుడు వాగ్దానాలు చేస్తుంటుందని ఆరోపించారు,. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అధికార నివాసంపై భారీ మొత్తం వెచ్చించారని బిజెపి ఆరోపిస్తోంది. ఆయన పూర్వపు ఇంటిని ‘అద్దాల మేడ’గా బిజెపి అభివర్ణించింది. తాను తన కోసం ఎన్నడూ ఇల్లు నిర్మించుకోలేదని దేశానికి బాగా తెలుసు అని మోడీ చెప్పారు. ‘గడచిన పది సంవత్సరాల్లో నా ప్రభుత్వం పేదల కోసం నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించి, వారి కలలు నెరవేర్చింది. నేనూ ఒక అద్దాల మేడ నిర్మించుకుని ఉండేవాడినే. కానీ నా కల నా దేశవాసులకు పక్కా ఇల్లు సమకూర్చాలనేదే’ అని ఆయన చెప్పారు. మురికివాడల్లో నివసిస్తున్న వారికి కాంక్రీట్ ఇల్లు సమకూర్చడం తన లక్షమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. 2025 భారత్‌కు కొత్త అవకాశాలు పెక్కింటిని తీసుకువస్తుందని ఆయన సూచించారు. దేశం ప్రపంచంలో రాజకీయ, ఆర్థిక సుస్థిరతకు ప్రతీకగా మారిందని మోడీ స్పష్టం చేశారు. భారత్ కొత్త సంవత్సరంలో బడా ఉత్పత్తి కేంద్రంగా మారుతుందని, వ్యవసాయ రంగంలో కొత్త రికార్డులు నెలకొంటాయని,
మహిళల సారథ్యంలో అభివృద్ధి కూడా నమోదు అవుతుందని ఆయన సూచించారు. ప్రపంచంలో భారత్ స్థానం, ప్రతిష్ఠ కూడా 2025లో పటిష్ఠం అవుతాయని ప్రధాని ఉద్ఘాటించారు. మధ్య తరగతి ప్రజలకు సొంత ఇల్లు ఉండేలా చూసేందుకు ప్రభుత్వం ఇంటి రుణం వడ్డీ రేటులో భార రిబేట్ ఇస్తోందని ఆయన తెలియజేశారు. విద్యా రంగంలో మౌలిక వసతుల పెంపునకు కేంద్రం చేస్తున్న కృషి గురించి కూడా మోడీ ప్రధానంగా ప్రస్తావించారు. మోడీ పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.