బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మీడియాతో మాట్లాడారు. ఇది దేశాభివృద్ధికికీలక సమయమని అన్నారు. సమావేశాలకు ప్రతిపక్ష నేతలు సహకరించాలని కోరారు. “ బడ్జెట్ సమావేశాలకు ఎంపీలందరికీ స్వాగతం. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో … భారత్‌కు చాలా అవకాశాలు ఉన్నాయి. దేశాభివృద్ధికి ఇదే కీలక సమయం. దేశ పురోగతి, వ్యాక్సినేషన్ కార్యక్రమం, తదితర అంశాల్లో ప్రపంచానికి భారత్‌పై మరింత విశ్వాసం పెంపొందించేలా ఈ సమావేశాలు వేదిక కావాలి. ఇందుకు చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని విపక్షాలను కోరుతున్నా.
ఎన్నికలు ఎప్పుడూ జరుగుతుంటాయి. కానీ బడ్జెట్ సమావేశాలు చాలా కీలకం. చర్చల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని సమావేశాలను ఫలప్రదం చేయాలి. దేశాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లేందుకు అందరూ సహకరించాలి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటేనే ఆర్థిక పురోగతిలో ఉన్నత శిఖరాలను చేరుకోగలం. ” అని మోడీ పిలుపునిచ్చారు. పార్లమెంట్ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా ఉధ్ధృతి దృష్టా వేర్వేరు సమయాల్లో లోక్‌సభ, రాజ్యసభలను నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 1 న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఈ నేపథ్యం లోనే ఆర్థిక సర్వేను సోమవారం ప్రవేశ పెడుతున్నారు.