Wednesday, January 22, 2025

మోడీ ప్రజాకర్షణకు పరిమితులు గుర్తిస్తున్న బిజెపి

- Advertisement -
- Advertisement -

కేవలం ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం చేస్తే చాలు బిజెపి దేశంలో ఎక్కడైనా, ఏ ఎన్నికల్లోనైనా విజయాన్ని పొందగలదనే భరోసా క్రమం గా ఆ పార్టీ నేతలలో సడలుతోందా? మోడీ ప్రజాకర్షణకు పరిమితులను అర్థం చేసుకొని దిద్దుబాటు చర్యలకు పాల్పడుతుందా? తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఇద్దరు గవర్నర్ల నియామకం ఈ అంశాన్ని వెల్లడి చేస్తున్నది. రాజస్థాన్, తెలంగాణలలో ఎన్నికల ప్రచార సభలలో తన ప్రభుత్వ పని తీరును చూపి కాకుండా ‘మోడీ గ్యారంటీ’ అంటూ నేరుగా తన బొమ్మ చూసి ఓటు వేయమని ప్రధాని చెప్పడం ప్రారంభించినా కేవలం ఆయన ప్రచారం చేసినంత మాత్రం చేత పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందనే నమ్మకం ఇప్పుడు ఆ పార్టీ కీలక నేతలలోనే కనబడటం లేదు. తాజాగా గత పదేళ్లుగా మరెక్కడా చేయనంత విస్తృతంగా ప్రధాని మోడీ ప్రచారం చేసిన కర్నాటకలో ఎదురైనా పరాజయం ఆ పార్టీ నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. అంతకు ముందు ఆయన విస్తృతంగా ప్రచారం చేసిన పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో సహితం చెప్పుకోదగిన ప్రయోజనం బిజెపి పొందలేకపోయింది.

అందుకనే క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని, ప్రజలకు చేరువయ్యే విధంగా వ్యూహాలను మార్చుకొనే ప్రయత్నాలలోనే భాగంగా తాజాగా ఇద్దరు గవర్నర్ల నియామకం జరిగినట్లు కనిపిస్తున్నది. ముఖ్యంగా ఒడిశా గవర్నర్‌గా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ నియామకం ఆ పార్టీ శ్రేణులకు అనేక సంకేతాలను ఇస్తున్నది. 2014లో లోక్‌సభ ఎన్నికలలో నరేంద్ర మోడీ భారీ సాధించిన విజయం తర్వాత, కొన్ని నెలల తర్వాత ఎన్నికలు జరిగిన మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ వంటి రాష్ట్రాలను కూడా బిజెపి గెలుచుకుంది. అమిత్ షా నేతృత్వంలోని పార్టీ ఆయా రాష్ట్రాల్లో రాజకీయంగా ఆధిపత్యం వహించని సామాజిక వర్గాల నుండి ముఖ్యమంత్రులను ఎంచుకొని సరికొత్త ప్రయోగానికి తెర లేపింది. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ (బ్రాహ్మణ), హర్యానాలో మనోహర్ లాల్ ఖట్టర్ (పంజాబీ) జార్ఖండ్‌లో రఘుబర్ దాస్ (గిరిజనేతరుడు)లను ముఖ్యమంత్రులుగా ఎంపిక చేయడం ద్వారా సాంప్రదాయ రాజకీయాలకు తిలోదకాలిచ్చే ప్రయత్నం చేసింది. ఈ ఎంపికల ద్వారా రాష్ట్రాలలో బలమైన నాయకులు అవసరం లేదు, ఎక్కడైనా మోడీ ప్రజాకర్షణతో విజయాలు సాధిస్తామనే భరోసా ఆ పార్టీ నేతలలో కనిపించింది.

అదే విధంగా సుదీర్ఘకాలం బలమైన, తిరుగులేని నేతలుగా ఎదిగిన శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), వసుంధర రాజే (రాజస్థాన్)లను కూడా ముఖ్యమంత్రి పదవుల నుండి మార్చాలనే ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు.ఈ రాష్ట్రాల్లోని ఆధిపత్యేతర కులాల మద్దతును సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో బిజెపి రాజకీయంగా భారీ మూల్యం చెల్లించిందని చెప్పవచ్చు. కర్నాటకలో విశేషమైన ప్రజాకర్షణ గల బిఎస్ యెడ్యూరప్పను పదవి నుండి తప్పించడం ఎన్నికల్లో పరాజయానికి ప్రధాన కారణంగా గ్రహించారు.జార్ఖండ్‌లో సాంప్రదాయకంగా గిరిజనులలో గల మద్దతు కోల్పోవలసి వచ్చింది. హర్యానాలో సొంతంగా తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. మహారాష్ట్రాలో అధికార పార్టీలలో చీలికలు తీసుకొచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసినా తిరిగి ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా చేసే సాహసం చేయలేకపోయారు. రఘుబర్ దాస్‌ను ఒడిశా గవర్నర్‌గా నియమించడం ద్వారా వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో బిజెపి ఆయనను ముఖ్యమంత్రి పోటీ నుండి తప్పించినట్లయింది.

2020లో పార్టీలోకి తిరిగి వచ్చిన గిరిజన నాయకుడు బాబులాల్ మరాండీని రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం ద్వారా ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపి తిరిగి గిరిజనుల మద్దతు కూడదీసుకుని ప్రయత్నాలు ప్రారభించినట్లయింది. 2024లో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ ప్రచారంపై నాయకత్వం మరాండీ వహిస్తారని స్పష్టం చేసినట్లయింది. గిరిజనులను పార్టీకి దూరం చేసిన రఘుబర్ (68)ని గవర్నర్‌గా పంపడం ద్వారా రాష్ట్ర రాజకీయాలలో ఆయన ప్రమేయం లేకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో సహితం నూతన నాయకత్వాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రోత్సహించే ప్రయత్నాలు ప్రారంభించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో ఇప్పటికే పలువురు ఎంపిలకు పార్టీ టిక్కెట్లు ఇవ్వడంతో ఇది స్పష్టమవుతోంది. ఇప్పుడు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసేవారిని కాకుండా క్షేత్రస్థాయిలో బలం నిరూపించుకునే వారినే ప్రోత్సహించక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే, ప్రధాని మోడీ మాత్రం బిజెపి ఎన్నికల వ్యూహాలు అన్ని తన పట్ల గల ప్రజాకర్షణ చుట్టూ కేంద్రీకృతం కావాలని కోరుకుంటున్నట్లు తాజాగా ‘నమో రైలు’ను ప్రారంభించడం ద్వారా స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు ఏ ప్రధాన మంత్రి కూడా తన పేరుతో ఓ రైలును ప్రారంభించిన దాఖలాలు లేవు. బిజెపి ‘బ్రాండ్ అంబాసిడర్’ గా తాను మాత్రమే ఉండాలనే పట్టుదల ఆయనలో కనిపిస్తున్నది. అందుకనే ‘సొంత ఇమేజ్’ తో నాయకుడిగా ఎదిగిన ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ను మార్చాలని గతంలో విఫలయత్నం చేశారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో వసుంధరరాజే, మధ్యప్రదేశ్‌లో చౌహాన్‌లను పక్కకు నెట్టి కొత్తతరం నేతలను రంగంలోకి దింపి మోడీ కేంద్రంగా బిజెపి ప్రచారం కొనసాగేటట్లు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బయోపిక్ సినిమా ఈ నెల 27న మరాఠీలో విడుదల కావడం బిజెపిలో అంతర్గతంగా కలకలం రేపుతోంది.ఇప్పటి వరకు ప్రధాని మోడీ తప్ప మరెవ్వరూ వ్యక్తిగతంగా ప్రచారం చేసుకునే సాహసం చేయడం లేదు.గడ్కరీని సమర్ధవంతమైన పరిపాలకుడిగానే కాకుండా ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండేనేతగా చూపే ప్రయత్నం సహజంగానే బిజెపిలో ప్రత్యామ్నాయ నాయకత్వం వైపు ఆలోచనలను వెల్లడి చేస్తున్నాయి. గడ్కరీ బయోపిక్‌తో బిజెపికి సంబంధం లేకపోయినా ఆయన రాజకీయ జీవనం గురించే కాకుండా వ్యక్తిత్వం గురించి కూడా అందులో ప్రధానంగా చూపుతున్నారని చెబుతున్నా ఇటీవల నాగపూర్‌లో ఈ బయోపిక్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో గడ్కరీ మినహా నాగపూర్ ప్రాంతపు బిజెపి నేతలంతా పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నుండి అందరూ గడ్కరీని పొగడ్తలతో ముంచెత్తారు.

పైగా, గత నెల ఒక సభలో మాట్లాడుతూ మూడోసారి లోక్‌సభకు ఎన్నికయ్యేందుకు నాగపూర్ నుండి తాను తిరిగి పోటీ చేస్తున్నట్లు గడ్కరీ ప్రకటించారు. అంతేకాదు ఈసారి పోస్టర్లు, బ్యానర్లు, కార్యకర్తలకు తేనీరు వంటివి ఏమీ లేకుండానే పోటీ చేస్తా అంటూ వెల్లడించారు. తాను చేసిన పనులు నచ్చితే జనం ఓటేస్తారని, లేకపోతే లేదని అంటూ పార్టీలకు అతీతంగా తనకు మద్దతు ఉందనే సంకేతం ఇచ్చారు. ఇక తెలంగాణ నుండి సీనియర్ నేత ఎన్ ఇంద్రసేనా రెడ్డిని ఎవ్వరూ ఊహించని విధంగా, ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న సమయంలో గవర్నర్‌గా పంపడం కూడా బిజెపి వ్యూహాత్మకంగా వేసిన అడుగుగా స్పష్టం అవుతుంది. వారెంతకాలం పార్టీలో కొనసాగుతారో? వారి ద్వారా ఎన్ని ఓట్లు వస్తాయో? తెలియకపోయినా ఇతర పార్టీల నుండి వస్తున్న నేతలకు ప్రాధాన్యత ఇస్తూ ఉండటం తెలుగు రాష్ట్రాలలో బిజెపి శ్రేణులలో తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది. జెపి నడ్డా కార్యవర్గంలో తెలంగాణ నుండి ఎనిమిది మందిని తీసుకుంటే, వారిలో ఒక్కరు కూడా తొలి నుండి బిజెపిలో ఉన్నవారు లేకపోవడంతో పెద్ద ఎత్తున కలకలం రేగింది.

దానితో ఇంద్రసేనా రెడ్డిని ఆ తర్వాత జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. పార్టీలో వర్గాలతో సంబంధం లేకుండా, పార్టీ ప్రయోజనాల కోసం దశాబ్దాల పాటు నిజాయితీతో నిలబడుతూ వస్తున్న ఇంద్రసేనా రెడ్డిని గవర్నర్‌గా చేయడం ద్వారా పార్టీ శ్రేణులలో నైతిక స్థైర్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. ఒక వంక ప్రజల సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకుంటూ, మరోవంక పార్టీ శ్రేణుల విశ్వాసం చూరగొనే విధంగా వ్యవహరించనిదే 2024 ఎన్నికలలో గట్టెక్కలేమని నిర్ధారణకు బిజెపి జాతీయ నాయకత్వం వచ్చినట్లు ఈ ఇద్దరినీ గవర్నర్లుగా నియమించడం వెల్లడి చేస్తుంది. బిజెపి నాయకత్వం ఆలోచనలలో వస్తున్న మార్పులకు ఈ నియామకాలు అద్దం పడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News