Monday, December 23, 2024

11మంది సిఎంలు దూరం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం దేశ విధాన నిర్ణాయక సంస్థ నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. 11 రాష్ట్రాల ముఖ్యమంత్రుల గైర్హాజరీ నడుమనే ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మితమైన కన్వెన్షన్ హాల్‌లో ఈ భేటీ సాగింది. వికసిత్ భారత్ ః రోల్ ఆఫ్ టీం ఇండియా ప్రధాన అంశంతో నీతిఆయోగ్ పాలక మండలిలో సమీక్ష నిర్వహించారు. భారత్‌ను 2047 నాటికి ప్రపంచ స్థాయిలో సంపన్న దేశంగా మల్చుకోవల్సి ఉంటుంది. దీనిని పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలు, జిల్లాలు దీర్ఘకాలిక ప్రణాళికలు, కార్యక్రమాలను రూపొందించుకుని ముందుకు సాగాల్సి ఉందని ప్రధాని సందేశం వెలువరించారు. భారతదేశం టీం ఇండియాగా బాగా ముందుకు వెళ్లగల్గుతుందని , రాష్ట్రాలు , కేంద్రం ఓ టీంగా కలిసికట్టుగా నడిచినప్పుడే ప్రగతి సాధ్యం అవుతుందన్నారు.

ఇప్పుడు ఇక్కడ జరిగింది నీతి ఆయోగ్ 8వ పాలకమండలి భేటీ. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనతో ఇతర కారణాలతో 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కీలక భేటీకి రాలేదు. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతాయి. ఈ శతకం దశలో భారత్ సంపన్న దేశంగా నిలవాల్సి ఉంటుందని ప్రధాని కోరారు. ఇది విడివిడిగా గిరీగీసుకుని సాగించే పాలనా క్రమంలో సాధ్యం కాదని, రాష్ట్రాలు జిల్లాలు కనబర్చే విజన్ జాతీయ స్థాయి దృక్పథంతో మిళితం చేసుకుని వెళ్లితేనే ప్రగతి సాధ్యం అవుతుందని వివరించారు. కేవలం జాతీయ స్థాయిలోతీసుకునే నిర్ణయాల వల్లనే ప్రగతి సాధ్యంకాదని ప్రధాని తెలిపారు. సమావేశానంతరం వివరాలను నీతి ఆయోగ్ సిఇఒ బివిఆర్ సుబ్రహ్మణ్యం విలేకరులకు తెలిపారు.
రాష్ట్రాల సాధకబాధకాలపై దృష్టి
రాష్ట్రాలు ఎప్పటికప్పుడు ఆర్థిక వెసులుబాట్లతో కూడిన నిర్ణయాలు తీసుకోవల్సిందే. ఇవన్నీ కూడా ఆశ్రితులైన ప్రజల అవసరాలను తీర్చేవిగా ఉండాల్సిందే అన్నారు. సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుని పథకాలను రూపొందించుకుంటేనే నిర్ణీత లక్షాలను నెరవేర్చుకోవచ్చు అన్నారు. రాష్ట్రాలు వ్యక్తపరిచే ఆందోళనను , వారిసాధకబాధకాలను కేంద్రం పరిశీలిస్తుందని ప్రధాని చెప్పారు. ఏ రాష్ట్రంలో అయినా సరైన విధంగా సాగే పథకాలు కార్యక్రమాలు ఉంటే వీటిని ఇతర రాష్ట్రాలలోకూడా అమలు చేయించడం ద్వారా ప్రగతి సాధన దిశలో మార్గం సుగమం అవుతుందని తెలిపారు. నీతి ఆయోగ్‌లో ఇప్పుడు వికసిత్ భారత్ ఇతివృత్తాన్ని ఎంచుకోవడం చాలా కీలకమైనదని ప్రధాని చెప్పారు.
ఎదిగే దశలో అనుక్షణ జాగ్రత్తలు
భారతదేశం పలువిధాలుగా ఇప్పుడు నిర్ణయాత్మక స్థితికి చేరుకుంది. ఇది మరింత ఎదిగే దశ. జనాభాపరంగా అతిపెద్ద దేశం అయింది. ఇంతేకాకుండా ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఐదో అతి పెద్ద ఆర్థిక శక్తి గా ఉన్న దేశం త్వరలో మూడో స్థానానికి చేరుకోనుందని ప్రధాని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వృద్ధితోనే దేశం పురోగమనం, దేశంలోని రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి చెందడంలోనే దేశ ప్రగతి ఇమిడి ఉంటుందని మోడీ తెలిపారు. ఇప్పటి నుంచి మనం అంతా కూడా 2047 ను దృష్టిలో పెట్టుకుని తీరాల్సిందే. ఇందుకు అనుగుణంగానే కార్యాచరణకు దిగాల్సి ఉంటుందని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష ఛేదనకు ఉమ్మడి వ్యూహం సమిష్టి ఆలోచనా విధానం అత్యవసరం అని ప్రధాని పిలుపు నిచ్చారు.

ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, మౌలిక సాధనాసంపత్తి పటిష్టత వంటి కీలక విషయాలపై నీతి ఆయోగ్‌లో సమీక్షించారు. ఇవన్నీ కూడా వికసిత్ భారత్ లక్ష సాధన దిశలో ఉండేవే అని ప్రధాని తెలిపారు. ప్రధాని మోడీ సారధ్యంలో జరిగిన ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ , స్మృతీ ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, నారాయణ్ రాణే , 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల లెప్టినెంట్‌గవర్నర్లు ఈ భేటీకి హాజరయ్యారు.
సదవకాశాన్ని చేజార్చుకున్న సిఎంలు ః సిఇఒ
ఇప్పటి నీతి ఆయోగ్ పాలకమండలి కీలకమైన భేటీ అని, దీనికి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాకపోవడం శోచనీయం అని ఆయోగ్ సిఇఒ బివిఆర్ తెలిపారు. రాష్ట్రాల స్థాయిలో తీసుకునే నిర్ణయాలు, ఎదురవుతున్న సమస్యలను తెలియచేసుకునే అవకాశం ఆయా రాష్ట్రాలు చేజేతులా చేజార్చుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సిఎంల బాధ్యతారాహిత్యం
బిజెపి నేత రవిశంకర్ ప్రసాద్
సిఎంలు దీనికి రాకపోవడంబాధ్యతారాహిత్యం , ప్రజా వ్యతిరేకం అని బిజెపి విమర్శించింది. రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాపై విస్తృత స్థాయి చర్చలు జరిగే ఈ సమావేశాన్ని బహిష్కరించడం ద్వారా సిఎంలు ఏం చెప్పదల్చుకున్నారు? ఏం సాధిస్తారని బిజెపి తరఫున పార్టీ సీనియర్ నేత , కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలో వ్యూహరచనలకు రంగం సిద్ధం చేసుకోవడం కోసం ఉద్ధేశించిన సమావేశాన్ని బహిష్కరించడం వల్ల ప్రయోజనం ఎవరికి అని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. దాదాపుగా చిన్నాపెద్ద వరకూ 100 విషయాలు ప్రస్తావనకు వచ్చిన భేటీకి రాకపోవడం రాష్ట్రాల బాగోగులను ధ్వంసం చేసుకోవడమే అవుతుందన్నారు. రాష్ట్రాలకు పలు సమస్యలు ఉన్నాయని ముఖ్యమంత్రులు చెపుతున్నప్పుడు , వివిధ వేదికల నుంచి నిరసనలకు దిగుతున్నప్పుడు , రాష్ట్రాల అంశాల ప్రస్తావనకు వచ్చే ప్రధాన సమావేశానికి రాకుండా సిఎంలు వేరే ఏ కార్యక్రమాల్లో ఉన్నట్లు, రాష్ట్రాల సమస్యల కన్నా వీరికి ఇతరత్రా ప్రాధాన్యతలు ఏముంటాయని బిజెపి నేత ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News