Saturday, December 21, 2024

దేశ పరిస్థితిపై ప్రధాని మోడీ సమీక్ష

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అమెరికా, ఈజిప్టు దేశాల్లో ఆరు రోజుల పాటు అధికారిక పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రధాని మోడీ తన మంత్రి వర్గ సహచరులతో సోమవారం సమావేశమై దేశం లోని ప్రస్తుత పరిస్థితిని, ముఖ్యంగా మణిపూర్ పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పురి, సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి ముందు అమిత్‌షా నేరుగా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితిని ప్రధానికి అమిత్‌షా వివరించినట్టు సమాచారం. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ ఆదివారం నాడు ఢిల్లీలో అమిత్‌షాను కలుసుకున్న నేపథ్యంలో మోడీతో అమిత్‌షా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఏం జరుగుతోంది ?
విదేశాల పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ ఆదివారం అర్ధరాత్రి తర్వాత భారత్ చేరుకున్నారు. ఢిల్లీలో విమానం దిగిన వెంటనే పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ట్వీట్‌కు మోడీ సమాధానం ఇచ్చారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ నేతలు హర్షవర్ధన్, గౌతం గంభీర్ తదితరులు విమానాశ్రయంలో మోడీకి స్వాగతం పలికారు. వారిని చూడగానే దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని మోడీ అడిగి తెలుసుకున్నారు.

మమ్మల్ని చూడగానే దేశం గురించి అడిగారు. పనులు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు.” అని పార్టీ నేత ఒకరు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలన పురస్కరించుకుని మోడీ చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రత్యేక ప్రచార కార్యక్రమం పై నడ్డాను మోడీ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారని నడ్డాజీ వెల్లడించారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మీడియాకు వెల్లడించారు.
బైడెన్ ట్వీట్‌కు మోడీ సమాధానం…
భారత్, అమెరికా బంధం గతంలో కంటే అత్యంత కీలకంగా , బలంగా , మరింత దగ్గరగా, ఉందంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రధాని మోడీకి ట్వీట్ చేశారు. దీనికి మోడీ బదులిస్తూ బైడెన్ అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని బదులిచ్చారు. ఉభయ దేశాల మధ్య స్నేహం, ప్రపంచానికి మేలు చేసే ఒక శక్తిగా ఉంది. ఇది ఈ భూ మండలాన్ని మరింత సుస్థిరంగా మారుస్తుంది. నా తాజా పర్యటన మన బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ” అని మోడీ ట్వీట్ చేశారు. అమెరికా, ఈజిప్టు దేశాల్లో పర్యటించిన ప్రధాని మోడీ, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి రెండు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News