ఇండో ఆసియాన్ సదస్సులో మోడీ
న్యూఢిల్లీ : ఆసియాన్ ఐక్యత, కేంద్రీకృత భారత్‌కు అత్యంత కీలకమైన అంశాలని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భారత్ ఆసియాన్ భాగస్వామ్యం 30వ వార్షికోత్సవ నేపథ్యంలో వచ్చే 2022 సంవత్సరాన్ని ఆసియాన్ ఇండియా ఫ్రెండ్‌షిప్ ఇయర్‌గా నిర్వహించుకుంటామని ప్రధాని గురువారం తెలిపారు. ఇండియా ఆసియాన్ సమ్మిట్‌ను ఉద్ధేశించి ప్రధాని మోడీ వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారం , ఉమ్మడి దృక్పథం దిశలో కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ ప్రాంతపు సమగ్రతకు ఇండో పసిఫిక్ ఒషియన్స్ ఇన్షియేటివ్ (ఐపిఒఐ) ప్రధాన సూత్రీకరణగా ఉంటుందన్నారు. ప్రపంచంతో పాటు ఈ ప్రాంతం అంతా కూడా కొవిడ్ మహమ్మారితో తలెత్తిన సవాళ్లను ఎదుర్కొంటోంది. సవాళ్లను స్నేహ పటిష్టతకు కాలపరీక్షగా ఎంచుకోవడం అత్యంత ప్రధానమైన విషయం అని ప్రధాని తెలిపారు. కొవిడ్ దశలో ఈ స్నేహం పటిష్టం అయిందని, పరస్పర సహకారం, ఉమ్మడి సృహద్భావం, సానుభూతి ఇక ముందు కూడా కొనసాగుతుంది. ఈ నిరంతర స్నేహభావనతోనే భవిష్యత్తులో ఆసియాన్ పసిఫిక్ పటిష్టతకు వీలేర్పడుతుందని తెలిపారు.