న్యూఢిల్లీ: డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్‌పై ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. 107వ మన్‌కీ బాత్ ద్వారా ఆదివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో దేశంలో జరిగే పెళ్లిళ్లు, దానికి సంబంధించిన వ్యయాలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్రను గుర్తు చేస్తూ భారతీయులు విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకునే ట్రెండ్ ఇటీవలి కాలంలో పెరుగుతోందని, ఇది అవసరమా? అని మోడీ ప్రశ్నించారు.
“ఈ పెళ్లిళ్ల సీజన్‌లో దేశ వ్యాప్తంగా రూ.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. పెళ్లి షాపింగ్‌లో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలకు నా విజ్ఞప్తి. చాలా కాలంగా వివాహం కోసం ఇతర దేశాలకు వెళ్లడం నన్ను కలవరపెడుతోంది.
దీని గురించి నా కుటుంబ సభ్యులతో (దేశ ప్రజలు) కాకపోతే ఇంకెవరితో చెప్తాను. విదేశాల్లో పెళ్లి చేసుకోవడం అవసరమా? విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకునే ఉన్నత కుటుంబాల వారు దీని గురించి ఆలోచించాలని నా విజ్ఞప్తి. మీరు భారత్‌లో వివాహాలు చేసుకోవడం వల్ల లోకల్ ఫర్ వోకల్ కు ఎంతో మద్దతు ఇచ్చినట్టు అవుతుంది. స్వదేశంలోనే పెళ్లి చేసుకుంటే ఆ డబ్బంతా దేశంలోనే ఉంటుందని, తద్వారా మీరు మీ దేశానికి, దేశంలోని పేదవారికి కూడా సేవ చేసిన అవకాశం పొందుతారు’ అని ప్రధాని తెలిపారు.