Sunday, December 22, 2024

బీహార్‌ను భ్రష్టు పట్టించిన లాలూ

- Advertisement -
- Advertisement -

బెట్టియా(బీహార్): ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబం బీహార్ పాలిట మహాపరాధులుగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. లాలూ ప్రసాద్ సాగించిన దశాబ్ద కాల పాలనలో బీహార్ ఆటవిక రాజ్యంగా మారిందని మోడీ ఆరోపించారు. పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియాలో బుధవారం ఆయన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆర్‌జెడి-కాంగ్రెస్ దుష్పరిపాలనలో బీహార్‌కు చెందిన యువజనులు పెద్దసంఖ్యలో వలసలు పోవలసి వచ్చిందని ఆయన చెప్పారు. ఎన్‌డిఎ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడడం మొదలైందని ఆయన చెప్పారు.

వారి దుష్పరిపాలనతో ఒక తరం మొత్తం నష్టపోయిందని, పెద్ద సంఖ్యలో యువజనులు వలసలు పోయారని, కాని ఒకే ఒక్క కుటుంబం వృద్ధి చెందిందని మోడీ ఆరోపించారు. కుటుంబం లేనందు వల్లనే మోడీ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటూ లాలూ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, బాబాసాహెబ్ అంబేద్కర్, కర్పూరీ ఠాకూర్ వంటి మహానేతలుఇప్పుడు జీవించి ఉంటే సొంత కుటుంబాలను ప్రోత్సహించనందుకు వారిపైన కూడా ఇలాంటి వ్యక్తులు(లాలూ) దాడి చేసి ఉండేవారని మోడీ వ్యాఖ్యానించారు. తనకు కుటుంబం లేకపోవడమే వారికి అక్కసుగా ఉన్నట్లుందని, తనకు మాత్రం యావద్దేశం తన కుటుంబమేనని మోడీ అన్నారు.

ఈరోజు దేశమంతా మోడీ కా పరివార్‌గా భావిస్తోందని ఆయన చెప్పారు. తమిళనాడుకు చెందిన డిఎంకె ఎంపి ఎ రాజా వివాదాస్పద వ్యఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ&వాల్మీకి మహర్షి నడయాడిన పవిత్ర భూమి ఈ చంపారన్. ఈ గడ్డపైనే సీతమ్మవారు ఆశ్రయం పొంది లవకుశులకు జన్మనిచ్చారు. ఇండియా కూటమి పార్టీలు శ్రీరాముడికి చేస్తున్న అవమానాలను ఇక్కడి ప్రజలు క్షమించరు. మ సంస్కృతి సంప్రదాయాలపై జరుగుతున్న దాడులను ఎవరు ప్రోత్సహిస్తున్నారో కూడా ప్రజలు గమనిస్తున్నారు అని మోడీ తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలో బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ కూటమికి 400కు పైగా స్థానాలు దక్కుతాయని ఆయన పునరుద్ఘాటించారు. భారత్‌ను ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా తయారుచేసేందుకు, ప్రజలను పేదరికం నుంచి బయటకు తెచ్చేందుకు ప్రజలు తమ కూటమిని గెలిపించాల్సిన అవసరం ఉందని మోడీ పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News