Saturday, November 23, 2024

బెంగాల్‌లో హింసపై ప్రధాని ఆందోళన

- Advertisement -
- Advertisement -

PM Modi PM Modi Concern on Bengal Post Poll Violation

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్టరంలో చెలరేగిన హింస చర్చకు దారి తీసింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రప్రభుత్వాన్ని నివేదిక కోరారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ రాష్ట్ర గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌కు మంగళవారం ఫోన్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆరా తీశారు. ధన్‌కర్ మంగళవారం ట్విట్టర్ ద్వారా వివరాలు తెలియజేశారు. ప్రధాని మోడీ తనకు ఫోన్ చేశారని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని గవర్నర్ తెలిపారు. రాష్ట్రంలో విధ్వంసం, లూటీలు, హత్యలు కొనసాగుతున్నాయని తాను ప్రధానమంత్రికి తెలియజేశానని తెలిపారు. ఈ హింసలో కనీసం 12 మంది చనిపోయారని, ఇది గత నె రోజుల ఎన్నికలలో మరణించిన వారికన్నా ఎక్కువగానే ఉండవచ్చని అంటూ దీనిపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ తనను నివేదిక కోరిందని గవర్నర్ తెలిపారు. బుర్దాన్ జిల్లాలో ఆది, సోమవారాల్లో బిజెపి, టిఎంసి కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు చనిపోయారని అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో ముగ్గురు తమ మద్దతుదారులని టిఎంసి అంటోంది.
సుప్రీంకోర్టులో బిజెపి పిటిషన్
ఇదిలా ఉండగా రాష్ట్రలో ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో, తర్వాత పెద్ద ఎత్తున హింసాకాండ, హత్యలు, ఆత్యాచారాలు చోటు చేసుకున్నాయని, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే ఈ హింసకు పాల్పడ్డారని బిజెపి ఆరోపిస్తోంది. ఈ హింసాకాండపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ సీనియర్ అడ్వకేట్ కూడా అయిన బిజెపి నేత గౌరవ్ భాటియా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ తోసిపుచ్చింది. రాష్ట్రంలో వరసగా మూడోసారి గెలిచిన ముఖ్యమంత్రి తమ నేత మమతా బెనర్జీ అని, బెంగాల్ శాంతికాముక ప్రదేశమని పేర్కొంది. అసలు బిజెపినే హింసకు పాల్పడిందని, సిఎపిఎఫ్‌ను ప్రయోగించిందని మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
నందిగ్రామ్ రిటర్నింగ్ అధికారికి భద్రత
ఇదిలా ఉండగా నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి భద్రత కల్పించినట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు తెలియజేసింది. నందిగ్రామ్‌లో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, బిజెపి నేత సువేందు అధికారి మధ్య నువ్వా, నేనా అన్నట్లుగా పోటీ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మమతపై సువేందు అధికారి 1956 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాగా నందిగ్రామ్‌లో రీ కౌంటింగ్ జరిపించాలని తాను కోరినప్పటికీ రిటర్నింగ్ అధికారి ఆదేశించలేదని మమతా బెనర్జీ ఆరోపిస్తుండగా,, తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ రిటర్నింగ్ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రిటర్నింగ్ అధికారికి తగిన భద్రత కల్పించాల్సిందిగా ఇసి రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇసి ఆదేశాల మేరకు రిటరింగ్ అధికారికి వ్యక్తిగత భద్రతతో పాటుగా, ఆయన ఇంటివద్ద కూడా భద్రత కల్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా రిటర్నింగ్ అధికారికి కల్పించిన భద్రతను ఎప్పటికప్పుడు గమనిస్తూ పర్యవేక్షిస్తూ ఉండాలని ఇసి మంగళవారం రాష్ట్రప్రభుత్వానికి మరో లేఖ రాసింది. అలాగే ఆయనకు తగిన వైద్య సదుపాయాన్ని కల్పించాలని కూడా ఇసి రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది.

PM Modi Concern on Bengal Post Poll Violation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News