న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం అభినందించారు. వారి కృషి మున్ముందు మన దేశం భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ సర్వీసుల కోసం పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన అభ్యర్థుల్లో కూడా స్ఫూర్తి నింపేందుకు ప్రధాని మోడీ ‘ఎక్స్’ పోస్ట్‌లో ప్రయత్నించారు. మున్ముందు విజయం సాధించేందుకు వారికి అవకాశాలు ఉన్నాయని ఆయన సూచించారు.
వారి ప్రతిభా విశేషాలు ప్రజ్వరిల్లే అవకాశాలు భారత్‌లో నిండుగా ఉన్నాయని మోడీ తెలిపారు. ‘సివిల్ సర్వీసుల పరీక్ష 2023లో ఉత్తీర్ణులైనవారిని అందరినీ అభినందిస్తున్నా. వారి కఠిన శ్రమ, పట్టుదల, దీక్షఫలించాయి. ప్రభుత్వ సర్వీసులో అద్భుతమైన కెరీర్ ప్రారంభం కాబోతున్నది. వారి కృషి మున్ముందు మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. వారికి నా శుభాకాంక్షలు’ అని మోడీ తన పోస్ట్‌లో తెలిపారు. ‘సివిల్ సర్వీసుల పరీక్షలో ఆశించిన విజయం దక్కనివారికి నేను చెప్పదలిచేది ఏమిటంటే ఎదురుదెబ్బలు కఠినంగా ఉండవచ్చు.
కాని ఇది మీ ప్రస్థానం ముగింపు కాదని గుర్తుంచుకోండి. పరీక్షల్లో నెగ్గేందుకు మున్ముందు అవకాశాలు ఉంటాయి. అయితే, దానికి మించి మీ ప్రతిభ నిజంగా వెలిగేందుకు భారత్‌లో మెండుగా అవకాశాలు ఉన్నాయి. కఠిన శ్రమ కొనసాగించండి. ముందు ఉన్న విస్తార అవకాశాలను అన్వేషించండి. మీకు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా’ అని మోడీ తెలిపారు. సివిల్ సర్వీసుల పరీక్షల్లో 664 మంది పురుషులు, 352 మంది మహిళలు వెరసి 1016 మంది ఉత్తీర్ణులయ్యారు. వివిధ సర్వీసుల్లో నియామకానికి వారిని యుపిఎస్‌సి సిఫార్సు చేసింది.