మీరు ఏడ్వద్దు, దేశం మీ పట్ల చాలా గర్వంగా ఉంది
మహిళా హాకీ జట్టుకు ప్రధాని ఓదార్పు
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో చిరస్మరణీయ ప్రదర్శనతో కోట్లాది మంది అభిమానుల మనసులను గెలుచుకున్న భారత మహిళా హాకీ జట్టు కాంస్యం కోసం జరిగిన హోరాహోరీ పోరాటంలో ఓటమి పాలైంది. ఇక గెలుపు కోసం సర్వం ఒడ్డి తృటిలో పతకాన్ని గెలిచే అవకాశం చేజారడంతో మహిళా హాకీ జట్టు సభ్యుల గుండె పగిలినంత పనైంది. ఓటమి అనంతరం భారత హాకీ క్రీడాకారిణిలు హృదయం బద్దలయ్యేలా విలపించారు. ఈ పరిస్థితుల్లో మహిళా జట్టు సభ్యులను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. ఈ తరుణంలో వారిని ఓదార్చేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగారు. ఓటమి బాధలో ఉన్న మహిళా క్రీడాకారిణిలను ప్రధాని ఫోన్ చేసి ఓదార్చారు.
మీ మనసులో నిండిన బాధ నాకు వినిపిస్తోంది.. మీరు ఏ మాత్రం బాధపడొద్దు. మీ ప్రతిభను చూసి దేశం గర్వింస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఆట కోసం మీరు చిందించిన స్వేదం.. దేశంలో ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా కోచ్, క్రీడాకారిణులకు నా ప్రధాని అభినందించారు. ఇక ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ప్రదర్శనను ఎంత పొగిడినా తక్కువేనని అభిప్రాయపడ్డారు. కాగా, ప్రధాని నుంచి ఫోన్ రావడంతో మహిళా క్రీడాకారిణిలు ఊరట పొందారు. ఆ సమయంలో ఫోన్ చుట్టూ ఉన్న వారి ముఖాలు గంభీరంగా మారిపోయారు. ఈ క్రమంలో కొందరు క్రీడాకారిణిలు కన్నీరును ఆపుకోలేక పోయారు. ఈ విషయాన్ని పసిగట్టిన ప్రధాని క్రీడాకారిణిలను తనదైన శైలీలో ఓదార్చారు.