రాహుల్ ఆరోపణ
దాహోద్(గుజరాత్): ప్రధాని నరేంద్ర మోడీ రెండు భారతదేశాలను సృష్టించారని, ఒకటి సంపన్నుల కోసం.. మరొకటి నిరుపేదల కోసం అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలోని వనరులను కొద్దిమంది ధనవంతులకు ప్రధాని ధారాదత్తం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని గిరిజన ప్రాబల్య దాహోద్ జిల్లాలో ఆదివాసి సత్యాగ్రహ ర్యాలీ పేరిట కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి రాహుల్ మంగళవారం నాడిక్కడ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రాహుల్ ప్రసంగిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2014లో నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని అయ్యారని, అంతకుముందు ఆయన గుజరాత్‌కు ముఖ్యమంత్రని రాహుల్ అన్నారు.
గుజరాత్‌లో మొదలుపెట్టిన పనిని ఆయన దేశమంతటా చేస్తున్నారని, దాన్నే గుజరాత్ మోడల్ అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నేడు దేశంలో రెండు భారత్‌లు ఉన్నాయని ఒకటి దేశంలో ఎంపిక చేసిన కొద్దిమంది అధికార బలం, ధన బలం ఉన్న కోటీశ్వరులు, అధికారుల కోసం ఏర్పాటు చేసిన సంపన్న భారతదేశమని, మరొకటి సామాన్య ప్రజల కోసమని రాహుల్ వ్యాఖ్యానించారు. రెండు భారత్‌లకు కాంగ్రెస్ వ్యతిరేకమని, ప్రతిఒక్కరికి సమన్యాయం కావాలన్నదే కాంగ్రెస్ అభిమతమని ఆయన అన్నారు.