చెన్నై: లోక్‌సభ ఎన్నికలలో తాము తమిళనాడులో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయామంటూ ఇటీవల జరిగిన ఎన్‌డిఎ ఎంపీల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కన్నీటి పర్యంతమయ్యారని డిఎంకె సొంత పత్రిక మురసోలి సోమవారం తన సంపాదకీయంలో వెల్లడించింది. తాము ఎందుకు గెలవలేకపోయామో ఆయన చెప్పలేదు. అందుకు గల కారణాన్ని కూడా ఆయన గ్రహించినట్లులేదు.
ఒకవేళ ఆయన గ్రహించినప్పటికీ కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించరు. కారణాన్ని ఆయనచెప్పలేరు అని మురసోలి జూన్ 17 నాటి సంచికలోని సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. తమిళనాడులోని డిఎంకె సారథ్యంలోని ఇండియా కూటమి ఎన్నికల రాజీకయాల కోసమే కాక సిద్ధాంపరంగా కూడా బిజెపిని ఎండగడుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం మాత్రమే ఈ కూటమి ఏర్పడలేదు. గత ఐదు సంవత్సరాలుగా ఫాసిస్టు బిజెపిపై ప్రజాస్వామిక యుద్ధాన్ని కూటమి సాగిస్తోంది.
యావద్దేశానికి బిజెపి ప్రమాదకారి అని చెబుతూ గ్రామస్థాయి నుంచి సాగించిన ప్రచారంతో డిఎంకెకు, దాని మిత్రపక్షాలకు అఖండ విజయం లభించింది. బిజెపికి ఓటు వేస్తే తమిళ ప్రజలను అవమానించేనట్లేనని డిఎంకె అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ చేసిన వాదనను ప్రజలు అంగీకరించారు. తమిళనాడు, పుదుచ్చేరిలోని మొత్తం 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ప్రతిబింబించింది అని మురసోలి తెలిపింది. తమిళనాడులోని మొత్తం 39 నియోజకవర్గాలు, పుదుచ్చేరిలోని ఏకైక నియోజకవర్గంలో డిఎంకె, దాని మిత్రపక్షాలైన, కాంగ్రెస్, వామపక్షాలు ఘన విజయం సాధించాయి.