న్యూఢిల్లీ: కేంద్రంలోని అధికారిక బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ నియమాక ప్రక్రియలో భారీ మార్పులు చేసిందని ప్రధాని మోడీ శుక్రవారం స్పష్టం చేశారు. పారదర్శకత పాటిస్తూ నిర్ణీత కాలవ్యవధిలో తమ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను పూర్తి చేస్తుందన్నారు. ప్రభుత్వంలోని వేర్వేరు విభాగాల్లో నియమితులైన 71,426 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను ప్రధాని అందజేశారు. రోజ్‌గార్ మేళాతో తమ ప్రభుత్వానికి ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు.
రోజ్‌గార్ మేళాను గతేడాది ప్రకటించిన మోడీ ఈ కార్యక్రమం ద్వారా లక్షలమందికి అందజేయనున్నట్లు తెలిపారు. బీజేపీతోపాటు ఎన్డీయే మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ రోజ్‌గార్ మేళా నిర్వహిస్తున్నారని త్వరలో మరిన్ని రాష్ట్రాల్లోనూ నిర్వహిస్తున్నామని ప్రధాని మోడీ శుక్రవారం తెలిపారు. వ్యాపారంలో అన్నివేళలా వినియోగదారుడే కరెక్టు అన్నట్లుగానే అధికార యంత్రాంగానికి పౌరసేవలో పౌరుడే యజమాని అనే సూత్రాన్ని పాటించాలని సూచించారు. అందుకే ప్రభుత్వ రంగంలో ఉపాధిని ప్రభుత్వ సర్వీస్ అంటారని ఉద్యోగాలు అనరని తెలిపారు.
30లక్షల 71వేలమందే నియామకం: ఖర్గే
ప్రధాని మోడీ 71వేల మందికి నియామక పత్రాలను అందజేయడంపై కాంగ్రెస్ స్పందించింది. ఎనిమిదేళ్ల కాలంలో 16కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన మోడీ ప్రభుత్వం కేవలం వేల సంఖ్యలోనే భర్తీ చేస్తుందని ఖర్గే అన్నారు. కేంద్రం హామీ ఇచ్చిన కోట్లాది ఉద్యోగాలు ఎక్కడని కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తామని ప్రధానమంత్రి ఇచ్చిన హామీని ఖర్గే ఈసందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లలో ఇంకా 30లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే లక్ష ఉద్యోగాలను కూడా మోడీ ప్రభుత్వం భర్తీ చేయలేదని కాంగ్రెస్ ఖర్గే ఆరోపించారు.