Thursday, January 23, 2025

ప్రజలకు బిజెపిపై నమ్మిక.. కాంగ్రెస్ పట్ల ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రజలు కాంగ్రెస్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వారికి బిజెపి అంటే అపారమైన సడలని నమ్మకం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. మధ్యప్రదేశ్ ఓటర్లు తిరిగి మరోసారి బిజెపి అధికారంలోకి వచ్చేలా స్పందించాల్సి ఉందని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 17వ తేదీన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరునున్న నేపథ్యంలో ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఓటర్లకు బుధవారం తమ సందేశం వెలువరించారు.కాంగ్రెస్ వంశపారంపర్య, ప్రతికూల రాజకీయాలతో ప్రజలు విసిగిపొయ్యారని తెలిపారు. అదే విధంగా ఛత్తీస్‌గఢ్ ఓటర్లకు బిజెపి ఇచ్చిన వాగ్దానాలన్నింటిని నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం తప్పదని స్పష్టం చేశారు. ప్రజలకు పూర్తిస్థాయిలో బిజెపి సుపరిపాలన పట్ల నమ్మకం ఉందని, కాంగ్రెస్ శుష్కవాగ్దానాలు పనికిరావని తెలిపారు.

ఆయన వేర్వేరుగా ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు ఎన్నికల నేపథ్యంలో ప్రకటన వెలువరించారు. మధ్యప్రదేశ్‌ను దేశంలో ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ నమ్మిక ప్రజలకు ఉందన్నారు. ఇప్పటివరకూ మధ్యప్రదేశ్ ప్రజలు డబుల్ ఇంజిన్ ప్రభుత్వ పాలన వల్లనే సత్ఫలితాలు లభిస్తాయని తెలుసుకున్నారు. తిరిగి బిజెపి సర్కారు అవసరం ఉందని వారు ఆశిస్తున్నారు. ఇదే నిజం జరుగుతుందని తెలిపారు. తాను పలు బహిరంగ సభలకు హాజరయ్యానని, ఈ సందర్భంగా ప్రజలకు కాంగ్రెస్ పట్ల ఉన్న అసంతృప్తిని గమనించానని తెలిపారు. రాష్ట్ర ప్రగతికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సరైన రోడ్‌మ్యాప్ లేదని, దిక్కులేని పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో ప్రచార ఘట్టం చివరి రోజు బుధవారం ప్రధాని మోడీ బిజెపి తరఫున తమ విన్నపం వెలువరించారు.

ఛత్తీస్‌గఢ్ ఎన్నికల చివరి రెండో విడత ఎన్నికల ప్రచారానికి కూడా ఇదే రోజు తుది గడువుగా ఉంది. ఈ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్, బిజెపి మధ్య హోరాహోరీ పోటీ ఉంది. మధ్యప్రదేశ్‌లో బిజెపి అధికారంలో ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారం ఉంది. అయితే ఈ రెండు రాష్ట్రాలలోనూ తాను కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతను గమనించినట్లు ప్రధాని తెలిపారు. బిజెపి హామీలకు మోడీ గ్యారంటీ అని ఈ రెండు రాష్ట్రాల ఓటర్లకు పిలుపు ఇస్తూ మోడీ తమ పార్టీ ప్రచారానికి ముగింపు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News