Friday, December 20, 2024

కాంగ్రెస్ కు వెన్నుల్లో భయం పట్టుకుంది: మోడీ

- Advertisement -
- Advertisement -

శివమొగ్గ : కర్నాటకలో కాంగ్రెస్‌కు వెన్నుల్లో భయం పట్టుకుందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచార దశలో ఈ పార్టీ వల్లించిన అసత్యాలు పని చేయకుండా పొయ్యాయి. దీనితో దిక్కుతోచని స్థితిలో పార్టీ ప్రముఖ నేత సోనియా గాంధీని ఒప్పించి ప్రచారానికి తీసుకువచ్చారని ఆయన తెలిపారు. కర్నాటకలోని శివమొగ్గలో ఆదివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. తాను ఇక్కడికి రావడానికి ముందు బెంగళూరులో జరిపిన రోడ్‌షోకు జనం నుంచి వ్యక్తం అయిన ఆదరణ తనను కదలించిందని తెలిపారు. కాంగ్రెస్ వారి అబద్ధాల గాలిబుడగలు పేలిపొయ్యాయి. వారి ప్రచారం పనికిరాకుండా పోయిందని తెలిపిన ప్రధాని ఈ దశలో ఈ పార్టీకి ఇప్పుడు పార్టీ ప్రముఖ నేత ప్రచార సభలే దిక్కయ్యాయని తెలిపారు.

Also Read: శాంతిస్తున్న మణిపూర్..

విచిత్ర రీతిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కనీసం ప్రచారానికి కూడా వెళ్లని అభ్యర్థులను ఎంపిక చేసుకుందని, వారితో పార్టీ ఏ విధంగా ముందుకు సాగుతున్నదో అర్థం చేసుకోవాలని మోడీ చెప్పారు. ఎన్నికల ప్రచార గడువు మరో రెండు రోజులలో ముగుస్తుందనగా కర్నాటకకు ఎన్నికల ప్రచార సభకోసం సోనియా గాంధీ హుబ్లీకి తరలివచ్చిన విషయాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర హేమాహేమీలైన కాంగ్రెస్ నేతల ప్రచారం పసలేనిదని తేలింది. దీనితో పార్టీ గందరగోళంలో పడిందని మోడీ తెలిపారు. అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ 2019 లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి ఎక్కడ కూడా ప్రచారానికి వెళ్లడం లేదు. కర్నాటకలో హుబ్లీ సభలో పాల్గొనడమే ఇటీవలి కాలంలో ఆమెకు తొలి బహిరంగ సభ అయింది. కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడే కాకుండా పలు చోట్ల పరస్పర కుమ్ములాటల పార్టీ అయి కూర్చుంది. పార్టీ నేతలు ఇక్కడ ఎగురేసిన గాలిపటాలు చతికిలపడిపోతున్నాయని ప్రధాని తెలిపారు. ఎన్నికల ఫలితాలు కూడా ఇదే విధంగా ఉంటాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News