Sunday, January 19, 2025

కాంగ్రెస్ ఎన్‌సి అక్రమ సంబధంతో పాకిస్థాన్ ఖుషీఖుషీ:ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికల బంధం అత్యంత ప్రమాదకరమైనదని ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఈ పొత్తు , వీరి ఎన్నికల ప్రణాళిక పట్ల ఇప్పుడు పాకిస్థాన్ పదేపదే హర్షం వ్యక్తం చేస్తోందని ప్రధాని మోడీ విమర్శించారు. పాకిస్థాన్‌లో ఇప్పుడు ఈ అక్రమ సంబంధం గురించి పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఆనందిస్తున్నారని , పైగా పాకిస్థాన్ అధికారికంగానే ఈ మేనిఫెస్టోకు మద్దతు ప్రకటించిందని మోడీ తెలిపారు. పాకిస్థాన్ ఇప్పటి పరిణామంతో బల్లే బల్లే అంటూ గంతులేస్తోందన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని కట్రాలో గురువారం ప్రధాని మోడీ ఎన్నికల సభలో ప్రసంగించారు, రియాసీ జిల్లాలోని ఈ ప్రాంతం వైష్ణవి దేవీ మందిరానికి వెళ్లే ప్రధాన రాదారి కేంద్రంగా ఉంది. ఇప్పుడు జనం వేసే ఓటు అత్యంత కీలకమైనది. జమ్మూ కశ్మీర్ భవిష్యత్తుకు ఆయువు పట్టు అవుతుందని తెలిపారు. ఓటర్లు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఓటు హక్కు వినియోగించుకోవల్సి ఉందని మోడీ పిలుపు నిచ్చారు.

రెండు పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో ఏముందనేది అందరికీ తెలిసిందే. ఇందులో ఆర్టికల్ 370 పునరుద్ధరణ వాగ్దానం చేశారు. రెండు పార్టీలూ ప్రధానంగా దీనికి వంత పాడాయి. ఇక దీనిపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్ స్పందన కూడా వెలువడింది. జమ్మూ కశ్మీర్ , ఆర్టికల్ 370 విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి, తమ దేశ వైఖరి ఒకేలా ఉన్నాయని కూడాఆసిఫ్ చెప్పారని మోడీ గుర్తించారు.ఈ విధంగా కాంగ్రెస్ మూలాలు ఏ మేరకు విస్తరించుకుని ఉన్నాయనేది అంతా గ్రహించాలన్నారు. పాకిస్థాన్ అజెండాను జమ్మూ కశ్మీర్‌లో పెద్ద ఎత్తున అమలు చేసేందుకు కాంగ్రెస్ , ఎన్‌సిలు సంకల్పించినట్లు ఉన్నాయి. ఈ ప్రాంతానికి తరాల తరబడి నిలువెల్లా గాయాలు మిగిల్చిన కాంగ్రెస్, పిడిపి, ఎన్‌సిల రాజకీయ అస్తమయానికి రంగం సిద్ధం చేసే శక్తి ప్రజల ఓట్లకు ఉందని తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లో బుధవారం మొదటి విడత పోలింగ్ ముగిసింది.24 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలలో రికార్డు స్థాయిలోనే 61 శాతం పైగా పోలింగ్ నమోదైంది.

మూడు కుటుంబాల పాలనతో అరాచకం
కాంగ్రెస్, ఎన్‌సి, పిడిపిలది వేర్వేరుగా చూస్తే మూడు కుటుంబాల పెత్తనపు రాజకీయ వ్యవహారం అని మోడీ మండిపడ్డారు. వీరి అధికారిక హయాంల్లో ఈ ప్రాంతానికి పెను నష్టం వాటిల్లింది. ఈ కుటుంబాలు తమ రాజకీయ లబ్థికోసం ఇక్కడి ఉగ్రవాదం పట్ల నిర్లక్ష ధోరణి వహించాయి.ఈ క్రమంలో సగటు జనం బాధలు పడుతూ ఉంటే ఈ కుటుంబ వారసత్వ నేతలు కశ్మీర్‌ను తమ విడిది రాజకీయాలకు వాడుకున్నారని మోడీ వ్యాఖ్యానించారు. బిజెపి కమలం గుర్తుపై నొక్కి వికాసం కోసం ముందుకు రావాల్సి ఉందని మోడీ ఓటర్లకు పిలుపు నిచ్చారు. దశాబ్దాలుగా సాగుతోన్న వివక్షతకు అంతం పలికింది బిజెపినే, ఇక్కడి వారి ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చింది తామేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయన అబ్ కీ బార్ , బిజెపి సర్కారు అని నినాదం చేశారు.

యువతపై శ్రీనగర్‌లో మోడీ మొగ్గు
మీకు మోడీ ఉన్నాడని పిలుపు
శ్రీనగర్‌లో జరిగిన ఎన్నికల సభలో మోడీ యువతను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. కేంద్రంలోని తమ ప్రభుత్వ పాలనతో ఇక్కడి యువత తమ సొంతకాళ్ల మీద నిలబడుతోందన్నారు. వారి సాధికారికతకు, సరికొత్త జీవితాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇచ్చిందని తెలిపారు. శ్రీనగర్‌లోని షేర్ ఏ కశ్మీర్ స్టేడియంలో బిజెపి అభ్యర్థుల మద్దతుకు ఏర్పాటు చేసిన ప్రచార సభలో మోడీ మాట్లాడారు. జమ్మూ కశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి దిశలో బిజెపి వాగ్దానం అమలు చేసి తీరుతామన్నారు. ఇక్కడి తమ జమ్మూ కశ్మీర్ యువత ఇంతకు ముందటి లాగా నిరాశ నిస్పృహల దశలో లేదు . ఇక్కడి యువతకు పెద్ద ఎత్తున నైపుణ్యాభివృద్ధి దిశలో శిక్షణ కల్పించాం. వారికి సరైన ఉపాధి అవకాశాలు చూపించామని మోడీ తెలిపారు. ఇంతకు ముందటికి ఇప్పటికీ తేడా ఎంతో ఉంది. అప్పట్లో ఇక్కడ రెండు మూడు కుటుంబాలే విలసిల్లుతూ ఉండేవి. వారికి ఈ ప్రాంతం స్వర్గంగా చేసుకునేందుకు , జనం పాలిటి నరకం చేశారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News