Monday, December 23, 2024

కర్ణాటకలో మతతత్వ పూనకం!

- Advertisement -
- Advertisement -

సర్వ మతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ అన్ని విశ్వాసాలకు అభయ హస్తం చాచాలని చెబుతున్న లౌకిక (సెక్యులర్) రాజ్యాంగాన్ని నిర్విఘాతంగా అమలు చేయవలసిన బాధ్యత గల దేశాధినేత పదవిలో వుండి ప్రధాని మోడీ కర్ణాటక ఎన్నికల్లో హిందూత్వ ప్రచారాన్ని పరాకాష్ఠకు తీసుకుపోతున్నారు. ఆ రాష్ట్రంలో బిజెపిని విజయ లక్షాన్ని చేర్చే కర్తవ్యాన్ని మొత్తంగా తన మీదనే వేసుకొని విశేష స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. జనవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు కర్ణాటకలో తొమ్మిది సార్లు ఆయన పర్యటించారు. ఒక్కొక్క పర్యటనలో కనీసం ఆరు సభల్లో మాట్లాడారు. తనను ప్రధానిని చేసిన తన పార్టీని గెలిపించుకోడానికి ఆయన కృషి చేయడాన్ని తప్పుపట్టలేము. కాని ఆ క్రమంలో రాజ్యాంగ విహిత విధి విధానాలను మరిచిపోయి హిందుత్వ పూనకంతో ప్రసంగాలు చేయడం హర్షించదగినది కాదు.

తాము కేంద్రం లో అధికారంలో వున్నాము కాబట్టి ఇక్కడ కూడా తిరిగి అధికారం అప్పగిస్తే డబుల్ ఇంజిన్ అభివృద్ధిని సాధించి చూపిస్తామని చెప్పుకోడం వేరు. ఇది కూడా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను ఎండగడతామని హెచ్చరించడం కిందికే వస్తుంది. బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో కర్ణాటక అభివృద్ధికి సంబంధించి ఎన్నో వాగ్దానాలు చేసింది. ప్రతి జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వంటి వాటిని హామీ ఇచ్చింది. ఇలాంటివి ఇంకెన్నో చెప్పింది. అవి ఆహ్వానించదగ్గవే. కాని తాము అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ చేసిన వాగ్దానంపై ప్రధాని మోడీ సహా బిజెపి ప్రచార కర్తలందరూ ఊగిపోడం, దానిని దన్నుగా చేసుకొని హిందుత్వ ఓటును పెంచుకోదలచడం ఆందోళనకరమైన పరిణామం.

పాలక బిజెపి పార్లమెంటు ద్వారా రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసి హిందుత్వను ప్రభుత్వ విధానంగా చేసుకుంటే మెజారిటీ మత రాజ్యాన్ని స్థాపించుకోవచ్చు. కాని ఇప్పుడే మైనారిటీలపైకి ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా దుర్వినియోగం చేసే పోకడలను పరాకాష్ఠకు తీసుకు వెళ్ళడం సమంజసం కాదు. ఇప్పటికే కర్ణాటకలో ముస్లింలకు ఇస్తూ వచ్చిన 4% రిజర్వేషన్లను రద్దు చేసి వాటిని ఒక్కళిగలకు, వీరశైవ లింగాయతులకు చెరి సగం పంచి పెట్టగా సుప్రీంకోర్టు ఈ నిర్ణయం అమలును మే 9 వరకు వాయిదా వేసింది. ఈ మొట్టికాయ చాలదని బిజెపి కర్నాటకలో హిందుత్వ మట్టాన్ని గరిష్ఠ స్థాయికి పెంచుకోవాలని బరి తెగించింది. స్వయంగా మోడీయే ప్రతి ఒక్కరూ తమకు ఓటు వేసి బజరంగ్ దళ్ అని నినదించాలని కోరడం సమంజసమేనా? బజరంగ్ దళ్ నిషేధం వాగ్దానంపై ఆ సంస్థ కార్యకర్తలందరూ రంగంలోకి దిగి రాష్ట్రమంతటా దేవాలయాల వద్ద హనుమన్ చాలీసా పఠించాలని పిలుపిచ్చారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ కేవలం బజరంగ్ దళ్‌ను మాత్రమే నిషేధిస్తామనలేదు.

దేశంలో మతోన్మత్త శక్తులను అదుపు చేయడానికి బజరంగ్ దళ్‌ను, ముస్లిం తీవ్రవాద సంస్థ పిఎఫ్‌ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) ను సైతం నిషేధిస్తానని వాగ్దానం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ విజయనగర జిల్లాలోని హోస్‌పేట ప్రచార సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హనుమంతుడినే జైల్లో తోయాలని చూస్తున్నదని అన్నారు. బజరంగ్ దళ్‌ను హనుమంతునితో పోల్చారు. బజరంగ్ దళ్ సభ్యులు రెచ్చిపోడంతో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి వీరప్ప మొయిలీ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ఆ సంస్థను నిషేధించే ప్రతిపాదనేదీ లేదన్నారు. దీనితో కాంగ్రెస్ ఒక అడుగు వెనకకు వేసిందని భావించవచ్చు. బజరంగ్ దళ్ నిషేధం వాగ్దానం ముస్లిం ఓట్లను ఆకట్టుకోడానికేనని అర్థమవుతున్నది. కర్ణాటకలో ముస్లింలు అక్కడి జనాభాలో 13% వరకు వుంటారు. వారి ఓట్లు కాంగ్రెస్, జెడి(ఎస్) మధ్య చీలిపోయే అవకాశాలున్నాయి. అయితే రాజ్యాంగ విహిత పాలన కావాలని, మతోన్మాద బిజెపిని అధికారం నుంచి దించాలని కోరుకొంటున్న ఆధునికులు, యువత ఓట్లు తమకు పడతాయని కాంగ్రెస్ ఆశిస్తున్నది.

కాని సంప్రదాయ హిందూ ఓటు ఈ దెబ్బతో తిరిగి బిజెపి వైపు వెళితే అది నష్టపోతుంది. కోస్తా కర్నాటకలో చిక్‌మగళూరు, హుబ్లీధార్వాడ్ ప్రాంతంలోని కొంత భాగంలో హిందుత్వ ఓటు బ్యాంకు దట్టంగా వుంది. ఇది దగ్గర దగ్గర పాతిక స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తుంది. ఈ స్థానాలను బిజెపి గెలుచుకొనే అవకాశాలున్నప్పటికీ అక్కడున్న ఆ పార్టీకి చెందిన ప్రస్తుత ఎంఎల్‌ఎలపై వ్యతిరేకత, 40 శాతం కమీషన్ అవినీతి నేపథ్యం దానిని తీవ్రంగా దెబ్బ తీస్తుందని భావిస్తున్నారు. బజ్‌రంగ్ దళ్‌పై పూనకం ఈ ఓట్లను తిరిగి బిజెపి ఒడిలోకి నెట్టవచ్చు. బజరంగ్ దళ్‌ను, పిఎఫ్‌ఐని ఒకే గాటను కడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయడం సాహసమే. గతంలో 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత బజరంగ్ దళ్‌పై నిషేధం విధించగా ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఆ తర్వాత దానిని రద్దు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News