Thursday, December 19, 2024

ప్రధాని మోడీ అప్రకటిత ఎమెర్జెన్సీ!

- Advertisement -
- Advertisement -

ఆజాది కా అమృతోత్సవ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న భారత దేశం భావ ప్రకటనా స్వేచ్ఛకు పూర్తి స్థాయిలో భంగం కలుగుతున్నది. మోడీ ప్రధాని పదవిని చేపట్టిన ఈ ఎనిమిదేండ్లలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడింది. తాజాగా బిబిసి కార్యాలయాలపై వరుస ఐటి దాడులు చేయడం చేపట్టి మరోసారి బిజెపి సర్కారు తన కక్ష సాధింపు ధోరణిని బయటపెట్టుకున్నది. ఈ దేశంలో పరిశోధనాత్మక కథనాలు, ప్రసారాలు కేవలం ఈ మధ్య కాలంలోనే కొరవడుతున్నాయి. దీంతో ప్రభుత్వాల అవినీతిని, అసమర్థతను ఎత్తిచూపే నాలుగో స్తంభం నలిగిపోతున్నది. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం మీడియాకు సంకేళ్లు విధించిదన్నది జగమెరిగిన సత్యం. ఫలితంగానే అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్, బ్లూంబర్గ్ లాంటి పరిశోధనాత్మక సంస్థలు బ్లాస్టింగ్ న్యూస్‌ను వెలువరిస్తున్నాయి.

అదానీపైనో లేక కేంద్రంపైనో, మోడీ బిజెపిపైనో పరిశోధనాత్మక కథనాలు ప్రచురుణ, ప్రసారంలో చేయడంలో ఆయా సంస్థలు జంకిపోతున్నాయి. మీడియా సంస్థలపై దాడులు చేయడం, జర్నలిస్టులను కేసుల్లో ఇరికించి ఇబ్బంది పాలు చేయడం పట్ల మేధావులు, జర్నలిస్టులు, బుద్ధిజీవుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టంలో సమూల మార్పులు చేసి, సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధిస్తూ పిఐబి పరిధిలోనికి మీడియా పరిమితులను పార్లమెంట్ సాక్షిగా కేంద్రంగా చేర్చబోతోంది. అంటే బిజెపి సర్కారు చెప్పిందే వార్త… చేసేదే కార్యం.

180 దేశాలలో ‘వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారత్‌కు 142వ స్థానం దక్కింది. ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ అనే సంస్థ ప్రతియేటా విడుదల చేస్తోన్న భావప్రకటనా స్వేచ్ఛ గణాంకా లు పరిశీలిస్తే ఆరోగ్యకరమైన మీడియా ఇండియాలో లేదని స్పష్టమవుతున్నది. ఇది ప్రగతిశీల దేశానికి, రాష్ట్రాలకు ఏ మాత్రం ఆరోగ్యకరం కాదు. ఇవాళ దేశం ఆర్థిక అరాచకాలపై, అదానీ మోసాలపై హిండెన్‌బర్గ్ లాంటి ఓ అమెరికా సంస్థ ప్రపంచానికి విడుదల చేసిన పరిశోధనాత్మక కథనంపై చర్చ జరుగుతున్నది. మేధావులు, బుద్ధిజీవులందరూ నాటి పరిశోధనాత్మక కథనాలిప్పుడెందుకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పటి ఇన్‌వెస్టిగేటివ్ జర్నలిజం ఇప్పుడెందుకు లేదనే సందేహాలు బోలెడు. భావప్రకటనా స్వేచ్ఛకు భరోసా ఇవ్వలేనప్పుడు ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు’ అని 2014లో తాను ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోనే ప్రధాని నరేంద్ర మోడీ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.

కాని ఇవాళ అదే మోడీ పరిశోధనాత్మక సంస్థల్ని వేటాడి వెంటాడి చంపుతున్నారన్నది నిజం. ఏళ్ళ తరబడి గౌతమ్ అదానీ తన అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మాణంపై తీవ్రమైన ప్రశ్నలు, ఆరోపణలొచ్చాయి. జనం దాచుకున్న సొమ్మును అదానీకి దోచి పెడుతున్నారని విపక్షాలూ ప్రశ్నిస్తున్నాయి. మోడీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడల్లా ఆ దేశంలోని వాణిజ్య ఒప్పందాలు, వ్యాపారాలపై కథనాలూ వచ్చాయి.బొగ్గు దిగుమతులకు అధిక మొత్తాలు చెల్లించినట్లు చూపించడం, తన కంపెనీలకు విదేశాల్లో నిధులు అందడంపై పారదర్శకత పాటించకపోవడం, పర్యావరణ నిబంధనలను ఘోరంగా ఉల్లంఘించడం, నియమ నిబంధనలను తనకు అనుకూలంగా మలచుకుంటూ ప్రాజెక్టులను పొందిన తీరుపై మీడియాలో వాణిజ్య విశ్లేషకులు ప్రశ్నలు లేవనెత్తుతూనే వచ్చారు. కానీ, వీటిల్లో ఏ అంశంపైనా సెబి కానీ, ఆర్‌బిఐ కానీ, ఇడి వంటి ప్రభుత్వ నియంత్రణా సంస్థ లు కానీ స్పందించిన దాఖలాలు లేవు. పెట్టుబడులు గుల్లవుతున్నా ఏ సంస్థా నోరు మెదపనూ లేదు. ఈ క్రమంలోనే పుట్టుకొచ్చిన పరిశోధనాత్మక జర్నలిజాన్ని అదిరించో బెదిరించో పురిట్లోనే చంపేసాయి.

కరోనా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై అనేక వార్తా కథనాలు ప్రచురించిన ప్రముఖ మీడియా సంస్థలు దైనిక్ భాస్కర్, భారత్ సమాచార్ టివిపై పలు నగరాల్లో 2021 జులైలో ఇదే ఐటి శాఖ దాడులు నిర్వహించింది. కేంద్రంలోని బిజెపి సర్కారుకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేస్తున్న ఎన్‌డిటివి, క్వింటీలియన్‌ని బెదిరించి కేసుల పాలు చేసి ప్రధాని మోడీ ఆప్తమిత్రుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ ప్రమోటర్ల అనుమతి లేకుండానే కిందటేడాది కొనుగోలు చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రచురితం చేస్తున్న వైర్ సంస్థపై దర్యాప్తు సంస్థలతో కేంద్రం దాడులకు దిగింది. ది హిందూకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ వ్యతిరేక వార్తలను పోస్ట్ చేస్తున్న లక్షిత ఖాతాలు బ్లాక్ చేయాలంటూ ట్విట్టర్‌పై కేంద్ర ప్రభుత్వం 2021లో ఒత్తిడి తీసుకొచ్చింది. 2021 జూలై- డిసెంబర్ మధ్య ఏకంగా 114 లీగల్ డిమాండ్లను జారీ చేసింది. ఫేస్‌బుక్ మీదా ఇలాంటి ఒత్తిడినే కేంద్రం తీసుకొచ్చింది.

ముఖ్యంగా అదానీ అవినీతి, అక్రమ సామ్రాజ్యంపై కథనాలు సందించిన ది వైర్ జర్నలిస్ట్‌లు కేసుల్లోనే ఉన్నారు. అదానీ ఎల్‌ఎన్‌జి టెర్మినల్‌లో ఇండియన్ ఆయిల్ కంపెనీ, గెయిల్ ఇండియాలు పెట్టుబడులు ఎందుకు పెట్టాయని ప్రశ్నిస్తూ ఒక వార్తా కథనాన్ని ప్రచురించినందుకు 2017 నవంబరులో ‘ది వైర్’ పత్రికపై రూ. వంద కోట్లకు పరువు నష్టం దావా వేశారు. అదానీ గ్రూప్ ఉదంతంపై ప్రముఖ జర్నలిస్ట్ పరాంజయ్ గుహా (ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ)పై 8 కేసులు నమోదు చేసి ముప్పుతిప్పలు పెట్టారు. కశ్మీరీ జర్నలిస్టు ఆకాష్ హస్సన్‌ను శ్రీలంకకు కవరేజ్ కోసం వెళ్లకుండా అడ్డుకోవడం, అదానీ పరువు నష్టం కేసులో జర్నలిస్టు రవి నాయర్‌పై అరెస్టు వారెంట్ జారీ చేయడంపై అప్పట్లో జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. 2017లో ఆరోపణలొచ్చినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇవాళ ఎల్‌ఐసి, ఎస్‌బిఐ వంటి ప్రభుత్వ రంగం సంస్థలు అదానీ గొడుగు కిందకు వచ్చేవి కావు.

ఇక భారత దేశంలో మీడియాను చెప్పుచేతల్లో పెట్టుకుని అదిరించి బెదిరిస్తున్న దాఖలాలే ఎక్కువ. నల్ల చట్టాలపై రైతుల ఆందోళనలో భాగంగా జరిగిన హింస తర్వాత మీడియా స్వేచ్ఛకు మరింత ప్రమాదం ఏర్పడింది. ఆ ఘటనలపై పలువురి మీద పోలీసులు దేశద్రోహంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇందులో 8 మంది జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఇలా సోషల్ మీడియాలో ఈ వార్తను పోస్ట్ చేసిన వారిలో ఆరుగురు జర్నలిస్టులతో పాటు, ఒక కాంగ్రెస్ ఎంపి కూడా ఉన్నారు. వీరంతా ఇప్పుడు బిజెపి పాలిత రాష్ట్రాల నుంచి కేసులు ఎదుర్కొంటున్నారు. అదే ఘటనలో చనిపోయిన ఓ వ్యక్తి ఒక మృతుడి కుటుంబ సభ్యులు పోస్ట్‌మార్టం రిపోర్టుపై అనుమానాలు వ్యక్తం చేయగా, దాని రిపోర్ట్ చేయడం నేరం అవుతుందా’ అని ‘ది వైర్’ ఎడిటర్ ఇన్- చీఫ్ సిద్ధార్ధ వరదరాజన్ ప్రశ్నించారు. ‘ది వైర్’తో పాటు అందులో పని చేసే జర్నలిస్టు పైనా కేసు నమోదైంది.
దేశంలో ప్రభుత్వానికి, ముఖ్యంగా బిజెపికి వ్యతిరేక వార్తలు కేసులు ఎదుర్కొవాల్సిందే.

ఈతరహా కేసులు ఎదుర్కొంటున్న వారి జాబితాలో ‘కారవాన్’ న్యూస్ మేగజైన్ తరచూ కనిపిస్తోంది. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తుందని ఈ పత్రికకు పేరుంది. నిరసనకారుల్లో ఒక వ్యక్తి మరణించాడన్న వార్త విషయంలో ఈ మేగజైన్‌కు చెందిన ముగ్గురు సీనియర్ జర్నలిస్టులపై ఐదు రాష్ట్రాలలో కేసులు నమోదయ్యా యి. ఇదే మేగజైన్‌కు సంబంధించిన ఓ ఫ్రీలాన్స్ జర్నలిస్టును పోలీసులు ఆందోళనలు జరుగుతున్న ప్రాంతంలో అరెస్టు చేసి, రెండు రోజుల తర్వాత విడుదల చేశారు. ప్రభుత్వం ఇచ్చిన లీగల్ నోటీసుతో ఈ మేగజైన్‌కు చెందిన ట్విటర్ ఎకౌంట్‌ను కొన్ని గంటల పాటు సస్పెన్షన్‌లో పెట్టారు. గత ఏడాది ఢిల్లీ నగరంలో ఒక యువతి అత్యాచారం, హత్య కేసుకు సంబంధించిన నిరసన ప్రదర్శనల సమయంలో ‘కారవాన్’ మేగజైన్‌కు చెందిన నలుగురు జర్నలిస్టులపై దాడులు జరిగాయి.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిన వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ఇదేదో చిన్న తప్పిదం కాదు. ఒక భయంకరమైన విధ్వంసానికి కారణమయ్యే తప్పుడు ప్రచారం. ఆ జర్నలిస్టు గతంలో కూడా ఇలాంటి తప్పుడు సమాచార వ్యాప్తికి ప్రయత్నించారు. బాధితులు కోర్టు వెళ్లడంతో క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి’ అయితే వలస పాలకుల కాలం నాటి దేశద్రోహం చట్టాలను ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారి మీద ప్రయోగించడంపై కొందరికి ఆశ్చర్యం కలిగిస్తున్నది. గత దశాబ్ద కాలంగా నమోదైన 405 దేశద్రోహం కేసుల్లో మెజారిటీ కేసులు 2014 తర్వాతవే. ప్రతిపక్ష నేతలు, విద్యార్ధులు, జర్నలిస్టులు, రచయితలు, మేధావులు ఈ చట్టానికి బాధితులుగా మారారు. అలాగే దేశ వ్యాప్తంగా పాత్రికేయులపై పెట్టిన కేసులు వారిని వేధించడానికి తప్ప మరొకటి కాదని ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ చెబుతూనే ఉన్నది.

ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. అయితే భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షించడం తమ విధి కాదని ప్రభుత్వం భావిస్తోంది’ అని ‘ఫ్రీడమ్ హౌస్’ విడుదల చేసిన ఓ రిపోర్ట్ పేర్కొంది. ఈ దేశంలో జర్నలిస్టులు ఏ మాత్రం స్వేచ్ఛగా లేరు. ఒక్క 2020 సంవత్సరంలో 67 మంది జర్నలిస్టులు అరెస్టయ్యారు. 200 మందిపై దాడులు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో ఓ యువతిపై అత్యాచారం వార్తను కవర్ చేసిన జర్నలిస్టు 5 నెలల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వాన్ని విమర్శించే మహిళా జర్నలిస్టులను ఆన్‌లైన్‌లో అసభ్యకరమైన భాషలో ట్రోలింగ్ చేయడం, బెదిరించడం సర్వసాధరణమైంది. భావప్రకటనా స్వేచ్ఛను రక్షించే బలమైన చట్టాలు భారత్‌లో లేవని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పేర్కొంది.

తొలి సవరణ నాటి నుంచి భారత ప్రభుత్వం పౌరుల హక్కుల గురించి చెప్పడం వేరు, వాటిని రక్షించడం వేరు అన్న భావనలోకి వెళ్లింది’ అని ‘సిక్స్‌టీన్ స్టార్మీ డేస్’ అన్న పుస్తకంలో త్రిపుర్‌దమన్ సింగ్ వ్యాఖ్యానించారు. పౌర హక్కులను రక్షించడాన్ని ఒక బాధ్యతగా కన్నా ఒక అడ్డంకిగా ప్రభుత్వాలు చూస్తున్నాయి’ అని ఖేతాన్ అన్నారు. మిగతా ప్రజాస్వామ్య దేశాలతో పోలిస్తే ప్రజల హక్కులను రక్షించడంలో సుప్రీంకోర్టు ట్రాక్ రికార్డు కూడా దారుణంగా ఉందని ఖేతాన్ అభిప్రాయపడ్డారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమెర్జెన్సీ విధించడంతో 21 నెలల పాటు పత్రికా స్వేచ్ఛ అనేక నిర్బంధాలను ఎదుర్కొంది. ఇప్పుడు పరిస్థితులను చూస్తుంటే ఎమెర్జెన్సీ లాంటి నిర్బంధాలు లేకపోయినా, హక్కులను బహిరంగంగానే హరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది ఎక్కడా అధికారికంగా అణచివేత కనిపించదు. కానీ అంతర్లీనంగా సాగిపోతూ ఉంటుంది. ఒక రకంగా మనం అప్రకటిత ఎమెర్జెన్సీలో ఉన్నాం’ అని అనిపిస్తున్నది. అందుకే అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ అన్నింటిని ఛేదించి నిజాలను నిర్భయంగా చెప్పడం, ఆ నివేదికపై ఇవాళ దేశమంతా ఆ సంస్థ ధైర్యాన్ని కొనియాడుతుండడం ముదావహం. ఇలాంటి సంస్థలు అన్నింటికి తెగించి అరాచకాలు, అన్యాయాలపై గళం విప్పాల్సిందే. పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు జర్నలిస్ట్ సంఘాలు దన్నుగా నిలువాల్సిందే.

వెంకట్, గుంటిపల్లి
9494941001

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News