ప్రధాని వివరణకు సిపిఐ డిమాండ్
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుపై జరుగుతున్న తాజా పరిణామాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు వివరించాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా డిమాండు చేశారు. లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మిస్తున్నట్లు వెలువడిన వార్తలపై మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి రక్షణ, మంత్రివర్గ స్థాయిలో రెండు దేశాలు చర్చలు కొనసాగిస్తున్నాయని, ఈ పరిస్థితులలో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉభయ దేశాలు చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు.
భారతదేశంలోని అంగుళం భూమిని కూడా చైనా ఆక్రమించలేదని ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గతంలో గాల్వన్ లోయ ఘర్షణ అనంతరం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు. కాని..ప్రస్తుత పరిణామాలపై ప్రధాని మోడీ పెదవి విప్పడం లేదని, తాజా పరిణామాల గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఆయనపై ఉందని రాజా అన్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, రాజకీయ పరిస్థితి, ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లు తదితర అంశాలను ఈ నెల 26 నుంచి తమిళనాడు కోయంబత్తూరులో జరిగే మూడు రోజుల సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చిస్తామని ఆయన చెప్పారు.