కొత్త కరోనా ఒమిక్రాన్‌పై అధికారులకు ప్రధాని సూచన
న్యూఢిల్లీ : దక్షిణాప్రికా తదితర దేశాల్లో స్వైరవిహారం చేస్తున్న కొత్తరకం ఒమిక్రాన్ వ్యాప్తి పైన, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పైన ప్రధాని నరేంద్రమోడీ శనివారం ఉదయం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఒమిక్రాన్ గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కొత్త వేరియంట్‌ను దేశం లోకి రాకుండా కట్టడి చేసే విషయంలో చాలాసేపు చర్చించారు. అధికారులకు కొన్ని సూచనలు చేశారు. ఈ కొత్త వేరియంట్ ను కట్టడి చేయడానికి అన్ని రాష్ట్రాల్లోను . జిల్లాస్థాయిలోను అవగాహన కల్పించాలన్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు నిబంధనలు పాటించేలా తీవ్రమైన నిరోధం, నిరంతర నిఘాను కొనసాగించాలని ప్రధాని ఆదేశించారు.
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు నిబంధనలు మేరకు పరీక్షలు చేయించుకున్నారా లేదా అనే విషయంలో గట్టి పర్యవేక్షణ అవసరమని సూచించారు. కరోనా తీవ్రంగా వ్యాపించిన దేశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. కొత్త వేరియంట్ కలకలం రేపుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలను సులభతరం చేయడానికి సంబంధించి రూపొందించిన ప్రణాళికలపై పునరాలోచన చేయాలని ప్రధాని ఆదేశించారు. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, ప్రధాని ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.