Thursday, January 16, 2025

జాకీర్ హుస్సేన్ ఎంతోమందికి స్ఫూర్తి: ప్రధాని సంతాపం

- Advertisement -
- Advertisement -

తబలా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి , సంతాపం తెలియజేశారు. జాకీర్ హుస్సేన్ మరణం చాలా బాధాకరమని పేర్కొన్నారు. శాస్త్రీయ సంగీత ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చిన నిజమైన మేధావి అని కొనియాడారు. ‘తన అసమాన ప్రతిభతో లక్షలాది మందిని ఆకర్షించారు. తబలాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. భారతీయ శాస్త్రీయ సంప్రదాయాలను ప్రపంచ సంగీతంతో మిళితం చేసి సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా మారారు. ఆయన ప్రదర్శనలు ఎన్నో తరాల సంగీత విద్వాంసులతోపాటు ఎంతోమంది సంగీత ప్రియుల్లో కూడా స్ఫూర్తి నింపాయి. జాకీర్ హుస్సేన్ కుటుంబంతోపాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు నా సానుభూతి” అని మోడీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

భారత, పాశ్చాత్య సంగీత వారధి జాకీర్ హుస్సేన్ : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
భారత, పాశ్చాత్య దేశాల సంగీత సంప్రదాయాలకు జాకీర్ హుస్సేన్ ఒక వారధి వంటి వారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయనకు తన చేతుల మీదుగా పద్మవిభూషణ్ బిరుదు ప్రదానం చేయడం తనకెంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు అశేష అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని రాష్ట్రపతి తన సందేశంలో వివరించారు.
ప్రపంచ దేశాల సాంస్కృతిక వారధి : ఖర్గే
ప్రపంచ దేశాల హద్దులకు సంగీత సాంస్కృతిక వారధిగా జాకీర్ హుస్సేన్ ఖ్యాతి గడించారని, ఆయన తబలా వాయిద్య లయ తరంగాలు తరతరాలకు మంత్రముగ్ధులను చేస్తుంటాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

మమతాబెనర్జీ
ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన మరణం దేశానికి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అభిమానులకు తీరని నష్టం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సంతాపం ప్రకటించారు.
యోగి ఆదిత్యనాథ్
‘పద్మవిభూషణ్ జాకీర్ హుస్సేన్ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి ఈ లోటును తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపాన్ని ప్రకటించారు.

శక్తి సంస్థ ప్రతినిధి జాన్‌మెక్ లాగ్లిన్
జాకీర్ హుస్సేన్ సంగీత కళా ప్రపంచానికి రారాజు. ఆయన తబలా లయవిన్యాసాలతో మ్యాజిక్ చేస్తారు. మనల్ని విడిచివెళ్లి పోయారు మేం మళ్లీ కలుసుకుంటాం అని భావోద్వేగంతో శక్తి సంస్థ స్ధాపకలు జాన్‌మెక్‌లాగ్లిన్ సంతాపాన్నివెలిబుచ్చారు.
ఇది తీరని నష్టం : ప్రముఖ గాయకుడు శంకరమహదేవన్
జాకీర్ హుస్సేన్ మరణం సంగీత ప్రపంచానికి తీరని నష్టమని ప్రముఖ గాయకుడు శంకర్‌మహదేవన్ సంతాపం వెలిబుచ్చారు. ఆ స్థాయి తబలా కళాకారులు మరెవరూ లేరని, రారని, ఆయన తబలా వంటి లయవిన్యాసం మరెక్కడా వినలేమని శంకర్‌మహదేవన్ పేర్కొన్నారు. ఇతర సంగీతకళాకారులు ఎఆర్ రెహ్మాన్, శ్రేయఘోషల్, కమల్ సబ్రి, అంజాద్ అలీఖాన్, సినీ నిర్మాత హన్సాల్ మెహతా తదితరులు జాకీర్ హుస్సేన్ నిజమైన లెజెండ్ అని అభివర్ణించారు.
నిజమైన లెజెండ్ : మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ సిఇఒ సత్యనాదెండ్ల
జాకీర్‌హుస్సేన్ తబలా వాయిద్య సంగీతంలో నిజమైన లెజెండ్ అని మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ సత్య నాదెండ్ అభివర్ణించారు. తన తబలా శబ్ద తరంగాలతో బ్రహ్మానందం అందించారని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News