Monday, December 23, 2024

డిఎంకెవి ప్రమాదరకర రాజకీయాలు: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

వేలూరు(తమిళనాడు): తమిళనాడులోని అధికార డిఎంకె సారథ్యంలోని కూటమిపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అధికార డిఎంకె పార్టీ దశాబ్దాలుగా సాగిస్తున్న ప్రమాదకర రాజకీయాలను తాను బయటపెడుతూనే ఉంటానని ఆయన ప్రకటించారు. మతం, కులం పేరిట ప్రజల మధ్య డిఎంకె ఘర్షణలను రాజేస్తోందని వేలూరులో ఒక ఎన్నికల సభనుద్దేశించి ప్రసంగిస్తూ మోడీ ఆరోపించారు. విభజించి పాలించు అనే డిఎంకె రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకున్న నాడు ఆ పార్టీకి రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా దక్కదని ఆయన అన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ వెనుక డిఎంకె ఉందని ఆయన ఆరోపించారు.

ఈ డ్రగ్ మాఫియాలకు ఎవరు రక్షణ కల్పిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్‌సిబి అరెస్టు చేసిన డ్రగ్ మాఫియా ఎవరి కుటుంబానికి చెందనదని ఆయన అన్నారు. కచ్చతీవు అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్, డిఎంకెపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ విషయమై అనేక ఏళ్లు ఆ రెండు పార్టీలు ప్రజలకు నిజాలు దాచాయని మోడీ ఆరోపించారు. కచ్చతీవు ద్వీపం సమీపానికి వెళ్లిన భారత మత్సకారులను శ్రీలంక అరెస్టు చేయడంపై ఈ రెండు పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నపుడు కచ్చతీవును శ్రీలంకకు అప్పగించేసిందని, ఈ నిర్ణయాన్ని ఏ క్యాబినెట్ తీసుకుందో, దీని వల్ల ఎవరు ప్రయోజనం పొందారో కాంగ్రెస్ పెదవి విప్పలేదని ఆయన అన్నారు.

గతకొన్నేళ్లలో అనేక మంది భారత మత్సకారులు అరెస్టయ్యాయని, దీనిపై కాంగ్రెస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తుంటారని ఆయన ఆరోపించారు. శ్రీలంకలో అరెస్టయిన భారత మత్సకారులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రంలోని తమ ప్రభుత్వం ఎన్నోసార్లు చొరవచూపిందని ఆయన తెలిపారు. ఈ మత్సకారులను వాపసు తీసుకురావడానికి కేంద్రంలోని ఎన్‌డిఎ నిరంతరం శ్రమిస్తోందని ఆయన చెప్పారు. 1974లో కచ్చతీవు ద్వీపాన్ని కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా శ్రీలంకకు ధారాదత్తం చేసినట్లు తాజాగా బయటపడిందని మోడీ చెప్పారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నపుడు భారత్, శ్రీలంక మధ్య 1974లో కుదిరిన ఒప్పందంపై తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై ఆర్‌టిఐ కింద అడిగిన ప్రశ్నకు వచ్చిన జవాబుతో అసలు వాస్తవాలు వెలుగుచూశాయని ఆయన చెప్పారు.

జయలలితను అవమానించారు
దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె జయలలితని గుర్తు చేస్తూ డిఎంకెపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. మహిళలను అగౌరవపరిచే డిఎంకె రాష్ట్ర ప్రజలను ప్రాచీన భావాలతో బంధించిందని ఆయన ఆరోపించారు. జయలలిత పట్ల ఎలా వ్యవహరించారో, ఆమెపై ఎలాంటి నీచమైన వ్యాఖ్యలు చేశారో తనకు తెలుసునని ఆయన డిఎంకెను ఉద్దేశించి మండిపడ్డారు. మహిళలను తమిళనాడు గౌరవిస్తుందని, కాని ఇండియా కూటలో భాగస్వామి అయిన డిఎంకె గౌరవించదని ఆయన ఆరోపించారు. శక్తిని నాశనం చేస్తానని రాహుల్ గాంధీ చెప్పారని, సనాతన ధర్మాన్ని అంతం చేస్తానని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు(ఉదయనిధి స్టాలిన్) ప్రకటించారని ప్రధాని గుర్తు చేశారు. తమిళనాడును పాత ఆలోచనలతో, పాత రాజకీయాలతో ఉంచాలన్నదే డిఎంకె ధ్యేయమని, డిఎంకె కూడా ఒక కుటుంబ కంపెనీయేనంటూ ఆయన ఎద్దేవా చేశారు. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకే దశలో పోలింగ్ జరగనున్నది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

ద్వీపంలో ఎవరైనా నివిసిస్తారా: దిగ్విజయ సింగ్
కచ్చతీవు అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం తమిళనాడులోని వేలూరు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మళ్లీ ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై ఆరోపణలు చేయడంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ స్పందించారు. ద్వీపంలో ఎవరైనా మనుషులు నివసిస్తారా అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. మానవ ఆవాసయోగ్యం కాని ఆ ద్వీపంలో ఎవరైనా నివసిస్తారా అని తాను తెలుసుకోదలచినట్లు దిగ్విజయ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News