Monday, January 20, 2025

విదేశీ పర్యటనల కోసం టికెట్లు బుక్ చేసుకున్నారు:మోడీ

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల తర్వాత విదేవీ పర్యటనల కోసం ఇద్దరు యువ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని తనకు తెలిసిందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీతోపాటు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫతేపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ప్రధాని మోదీ రాహుల్, అఖిలేష్ యాదవ్‌ల పేర్లను నేరుగా ప్రస్తావించకుండా మాట్లాడుతూ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీల కలలు చెదిరిపోయాయని, జూన్ 4 తర్వాత ఓటమి నిందను ఎవరిపై వేయాలని ఆ రెండు పార్టీలు ఆలోచిస్తున్నాయని అన్నారు. ఫలితాల తర్వాత విదేశీ ప్రయాణానికి వారిద్దరూ టికెట్లు బుక్ చేసుకున్నట్లు తనకు ఒకరు చెప్పారని కూడా ఆయన అన్నారు.

ఉత్తర్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ మనుగడే లేదని, అయినప్పటికీ ఒక కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు యావత్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ మధ్య పోలికలు బలంగా ఉన్నాయని, అందుకే ఆ పార్టీలకు చెందిన ఇద్దరు యువ నాయకులు ప్రతి ఎన్నికల ముందు పొత్తు పెట్టుకుంటుంటారని ఆయన అన్నారు. ఆ రెండు పార్టీలు కుటుంబాలకే పరిమితమై పోయాయని, ఆ ఇద్దరు నాయకులు అవినీతి చేసేందుకే రాజకీయాలు చేస్తారని, తమ ఓటు బ్యాంకును ఆకట్టుకునేందుకు ఎంతకైనా తెగిస్తారని, వారిద్దరూ నేరస్థులను, మాఫియాలను ప్రోత్సహిస్తారని, ఆ రెండు పార్టీలు తీవ్రవాదుల పట్ల సానుభూతిని ప్రదర్శిస్తుంటాయని ప్రధాని విరుచుకుపడ్డారు. ఐదవ దశలో మే 25న ఫతేపూర్‌లో పోలింగ్ జరగనున్నది. బిజెపి అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపి నిరంజన్ జ్యోతి పోటీ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News