Wednesday, January 22, 2025

రాజ్యాంగంపై ప్రజలకు ఎనలేని విశ్వాసం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

ప్రజాస్వామిక ప్రక్రియపై కూడా అచంచల నమ్మకం
‘ప్రపంచంలో అతిపెద్ద’ ఎన్నికలలో 65 కోట్ల మంది వోటు వేశారు
ప్రజలకు అభినందనలు
‘మన్ కీ బాత్’లో ప్రధాని మోడీ
మూడవ విడత బాధ్యతల స్వీకారం తరువాత తొలి ‘మన్ కీ బాత్’

న్యూఢిల్లీ: ‘ప్రపంచంలోనే అతిపెద్ద’ ఎన్నికలలో పాల్గొనడం ద్వారా ప్రజలు దేశ రాజ్యాంగం, ప్రజాస్వామిక ప్రక్రియ పట్ల తమ అచంచల విశ్వాసాన్ని వ్యక్తం చేశారని, ఎన్నికల్లో 65 కోట్ల మందికి పైగా వోటు వేశారని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో వెల్లడించారు. మూడవ విడత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మోడీ తన తొలి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల కమిషన్‌ను, ఎన్నికల ప్రక్రియతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి ప్రధాని మోడీ అభినందించారు.

సుమారు 30 నిమిషాల సేపు సాగిన రేడియో ప్రసంగంలో ప్రధాని మోడీ అనేక అంశాలు ప్రస్తావించారు. ఎన్నికలు సమీపిస్తున్న దృష్టా ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ఫిబ్రవరిలో నిలిపివేశారు. వచ్చే నెల ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే భారతీయ అథ్లెట్లకు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి ప్రేరణ ఇవ్వడానికి ‘చీర్4భారత్’ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించవలసిందిగా ప్రజలకు మోడీ విజ్ఞప్తి చేశారు. గత టోక్యో ఒలింపిక్స్‌లో భారతీయ క్రీడాకారుల ప్రదర్శన ప్రతి పౌరుని మనస్సులు గెలుచుకుందని, పారిస్ ఒలింపిక్స్ కోసం సన్నాహకాల్లో అథ్లెట్లు హృదయపూర్వకంగా పాల్గొంటున్నారని మోడీ చెప్పారు.

‘మనం క్రీడాకారులు అందరినీ కలుపుకుంటే వారందరూ సుమారు 900 అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు, అది నిజంగా భారీ సంఖ్య’ అని ఆయన పేర్కొన్నారు, భారతీయులు మొదటిసారి కొన్ని విషయాలు చూడబోతున్నారని మోడీ సూచించారు. ‘షూటింగ్‌లో మన క్రీడాకారుల ప్రతిభ వెల్లడవుతోంది. టేబుల్‌టెన్నిస్‌లో పురుషులు, మహిళల జట్లు అర్హత సాధించాయి. మన షూటర్ తనయలు భారతీయ షాట్‌గన్ బృందంలో భాగం. ఈ పర్యాయం మన బృందం సభ్యులు కుస్తీ, గుర్రపు స్వారీ కేటగరీలు అన్నిటిలో పాల్గొంటారు. ఆ కేటగరీల్లో వారు ఇంతకుముందు ఎన్నడూ పాల్గొనలేదు’ అని ప్రధాని చెప్పారు. ఈ సారి కీడల్లో భిన్న స్థాయి ఉత్సుకత చూడబోతున్నామని మోడీ చెప్పారు. భారతీయ బృందం ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిందని ఆయన తెలిపారు.

‘మన క్రీడాకారులు చదరంగం, బ్యాడ్మింటన్‌లో కూడా అద్భుత విజయాలు సాధించారు. ఇప్పుడు మొత్తం దేశం ఒలింపిక్స్‌లో కూడా మన క్రీడాకారులు చక్కటి ప్రదర్శన ఇస్తారని, పతకాలు గెలుస్తారని, దేశ ప్రజల హృదయాలు గెలుచుకుంటారని ఆశిస్తోంది. రానున్న రోజుల్లో భారత బృందాన్ని కలుసుకునే అవకాశం నాకు కూడా లభిస్తుంది. మీ తరఫున వారిని ప్రోత్సహిస్తాను’ అని ప్రధాని మోడీ చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ఏక్ పేడ్ మా కె నామ్’ పేరిట ప్రారంభించిన అడవుల పెంపకం కార్యక్రమం గురించి కూడా ప్రధాని రేడియో ప్రసంగంలో ప్రస్తావించారు. తన మాతృమూర్తి స్మారకార్థం తాను కూడా ఒక మొక్క నాటినట్లు మోడీ తెలియజేశారు.

‘తల్లి స్మారకార్థం లేదాఆమె గౌరవార్థం మొక్కలు నాటే ప్రచారోద్యమం శీఘ్రగతిని పురోగమిస్తుండడం చూసి ఎంతో ఆనందిస్తున్నాను. ప్రజలు తమ తల్లులతో కలసి మొక్కలు నాటుతున్న చిత్రాలు లేదా వారి ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు’ అని మోడీ తెలిపారు. ఈ ప్రచారోద్యమం ‘భూ మాత’ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని ఆయన అన్నారు, 1857లో తొలి స్వాతంత్య్ర పోరుకు చాలా ముందుగానే 1855లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సంతాల్ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఆదివాసీ సమర యోధులు వీర్ సిధు, కన్హులకు ప్రధాని ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివాసీ జనాభా జూన్ 30ని ‘హూల్ దివస్’గా పాటిస్తారని, విదేశీ పాలకుల అత్యాచారాలను దీటుగా ప్రతిఘటించిన వీర్ సిధు, కన్హుల సాటిలేని సాహసంతో ఈ రోజు ముడిపడి ఉందని మోడీ తెలిపారు.

వర్షాకాలం ముంచుకు వస్తుండడంతో మోడీ కేరళ అట్టప్పడిలో ఆదివాసీ మహిళలు రూపొందించిన ‘కర్తుంభి’ గొడుగుల గురించి మాట్లాడారు. ‘కర్తుంభి గొడుగుల ప్రస్థానం కేరళలోని ఒక చిన్న గ్రామం నుంచి బహుళ జాతీయ సంస్థల వరకు సాగింది. స్థానికత గురించి గొప్పగా చెప్పుకోవడానికి దీనికి మించిన ఉదాహరణ ఏమి ఉంటుంది’ అని ఆయన అన్నారు. సంస్కృత వార్తల కార్యక్రమం 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంపై ఆకాశవాణిని మోడీ తన ప్రసంగంలో శ్లాఘించారు. ఆ ప్రాచీన భాష భారతీయ పరిజ్థానం, విజ్ఞాన శాస్త్రం పురోగతిలో విశేష పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు, ‘మనం సంస్కృతాన్ని గౌరవించాలని, మన దైనందిన జీవితంలో దానితో అనుసంధానం కావాలని ఇప్పటి రోజుల్లో డిమాండ్ ఉన్నది’ అని ఆయన చెప్పారు. బెంగళూరులోని ఒక పార్కులో స్థానికులు సంస్కృతం మాట్లాడేందుకు ప్రతి ఆదివారం సమీకృతం అవుతారని మోడీ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News