Sunday, December 22, 2024

మా వాళ్లు తప్పు చేసినట్లు వివరాలిస్తే విచారణ జరుపుతాం:పిఎం మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అమెరికా గడ్డమీద ఖలిస్తానీ వేర్పాటువాది గుర్‌పట్వంత్ సింగ్ పన్నున్‌ను అంతమొందించడానికి ఒక భారతీయ అధికారి, ఒక భారత జాతీయుడు కుట్ర పన్నినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి స్పందించారు. ఒక భారతీయ పౌరుడు ఏదైనా మంచి లేదా చెడు చేస్తే దాన్ని పరిశీలించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ ప్రకటించారు. లండన్‌కు చెందిన ది ఫైనాన్షియల్ టైమ్స్‌కు ప్రధాని మోడీ ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఎవరైనా తమకు ఏదైనా సమాచారం అందచేస్తే దాన్ని తప్పకుండా విచారిస్తామని ఆయన తెలిపారు. తమ దేశ పౌరుడు ఏదైనా మంచి లేదా చెడు చేస్తే దాన్ని పరిశీలించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, చట్టానికి తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు.

ఖలిస్తానీ వేర్పాటువాది పన్నున్ హత్యకు జరిగిన కుట్రలో భారత జాతీయుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెలుగుచూసిన తర్వాత ప్రధాని మోడీ స్పందించడం ఇదే మొదటిసారి. అంతేగాక ఈ ఘటన అమెరికాతో భారత సంబంధాలపై ఏమాత్రం ప్రభావం చూపబోదని కూడా ఆయన స్పష్టం చేశారు. కొన్ని ఘటనలను దౌత్య సంబంధాలతో ముడిపెట్టడం సబబు కాదన్నది తన అభిప్రాయమని ఆయన అన్నారు. అయితే విదేశాలలో స్థావరాలు ఏర్పర్చుకున్న కొన్ని తీవ్రవాద గ్రూపులు సాగిస్తున్న కార్యకలాపాలపై భారత్ తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరిట ఈ శక్తులు వేధింపులకు పాల్పడుతూ హింసను ప్రేరేపిస్తున్నాయని ఆయన అన్నారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలను వీటి ప్రభావం గురించి స్పందిస్తూ ద్వైపాక్షిక సంబంధాల పెంపుదలపై రెండు వైపుల నుంచి బలమైన మద్దతు ఉందని మోడీ అన్నారు. ఇది తమ మధ్య పరిపక్వతతో కూడిన స్థిరమైన భాగస్వామ్యాన్ని సూచిస్తుందని ఆయన తెలిపారు. రెండు దేశాల భాగస్వామ్యానికి భద్రత, ఉగ్రవాద వ్యతిరేకతపై సహకారం ప్రధాన అంశాలని ఆయన అన్నారు.

ఏవో కొన్ని సంఘటననలను రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలకు ముడిపెట్టడం తగదని తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. మనం బహుపాక్షిక సమాజంలో జీవిస్తున్నామన్న వాస్తవాన్ని మనం అంగీకరించక తప్పదని ఆయన అన్నారు. ఈ ప్రపంచం పరస్పర సంబంధాలు ఏర్పర్చుకోవడమేగాక ఒకరిపై ఒకరు ఆధారపడి ఉందని, ఈవాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటే అన్ని అంశాలలో కచ్ఛితమైన ఒప్పందాలు కుదుర్చుకోవడం అసాధ్యమని ఆయన అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా వైఖరికి భిన్నంగా భారత్ వైఖరి ఉండడం, ఇండో—పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుపై అమెరికా వ్యవహార శైలిని దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవాలకు హాజరుకావడం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గతవారం తెలియచేశారు. అదే సమయంలో జరగాల్సిన ఖ్వాద్ సదస్సు వాయిదా పడింది.

ఖలిస్తానీ నాయకుడు పన్నున్ హత్యకు జరిగిన కుట్ర కుసును అమెరికా దర్యాప్తు చేస్తున్న సమయంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కుట్రలో భారతీయ అధికారి ఒకరికి ప్రమేయం ఉన్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన సమాచారాన్ని భారత ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. అమెరికా, కెనడా ద్విపౌరసత్వాన్ని కలిగిన పన్నున్ హత్యకు జరిగిన కుట్రపై గత ఏడాది నవంబర్‌లో అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అభిశంసన దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News