Monday, December 23, 2024

సికింద్రాబాద్- విశాఖ మధ్య రెండో వందే భారత్ రైలు

- Advertisement -
- Advertisement -

రైలును వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ
సికింద్రాబాద్ స్టేషన్‌లో పచ్చ జెండా ఊపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇది మూడో వందే భారత్ రైలు

మన తెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్ – విశాఖ మధ్య రెండో వందేభారత్ రైలును ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. ప్రధాని మోదీ వర్చువల్ గా రైలును ప్రారంభించగా సికింద్రాబాద్ ప్లాట్ ఫామ్ నెంబర్ 10పై వందే భారత్ రైలుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పచ్చ జెండా ఊపారు. ఈ నెల 12న ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వారానికి ఆరు రోజుల పాటు ఈ రైలు రెండు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనుంది. గురువారం ఈ రైలు నడవదు. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది. మొత్తం 530 మంది ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణించవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న మూడో వందేభారత్ రైలు ఇది. సికింద్రాబాద్ – వైజాగ్ మధ్య రెండో రైలు కాగా మరొకటి సికింద్రాబాద్- తిరుపతి మధ్య తిరుగుతోంది.
దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్-విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా నేటి నుంచి మరొకటి అందుబాటు లోకి వచ్చింది. దీంతో పాటు ద.మ. రైల్వే పరిధి లోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి- బెంగళూరు మార్గంలో కొత్త ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రధాని మోడీ పచ్చ జెండా ఊపారు. వీటితో పాటు మొత్తం 10 వందే భారత్‌లను ప్రధాని నరేంద్ర మోదీ నేడు వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో, దేశంలో మొత్తం ఈ రైళ్ల సంఖ్య 50 దాటడం విశేషం. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ. 85 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపనలు చేశారు. వీరిలో కొన్నింటిని జాతికి అంకితం చేశారు.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూడ్స్ షెడ్లు, రెండు జన ఔషధి కేంద్రాలు, 3 రైల్వే కోచ్ రెస్టారంట్లను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కొళ్లం-తిరుపతి మెయిల్ ఎక్స్‌ప్రెస్, పలు మార్గాల్లో రెండో లైను, మూడో లైను, గేజు మార్పిడి, బైపాస్ లైన్లను ప్రారంభించారు.

51కి చేరిన వందే భారత్‌లు…
సికింద్రాబాద్- విశాఖ, కలబురగి- బెంగళూరుతో పాటు లఖ్‌నవూ డేహ్రాడున్, పాట్నా-లఖ్‌నవూ, న్యూ జల్‌పాయ్‌గుడి-పట్నా, పూరి-విశాఖపట్నం, రాంచీ-వారణాసి, ఖజురహో-దిల్లీ, అహ్మదాబాద్-ముంబయి, మైసూరు-చెన్నై మార్గాల్లో మొత్తం 10 రైళ్లను ప్రారంభించారు. దీంతో, దేశంలో మొత్తం వందే భారత్‌ల సంఖ్య 51కి చేరింది. ఇవి 45 మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి. అత్యధికంగా దిల్లీ గమ్యస్థానానికి దేశం లోని పలు ప్రాంతాల నుంచి పది వందే భారత్‌లు అందుబాటులో ఉన్నాయి.

Modi Flags off

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News