Thursday, November 21, 2024

ఐదు రాష్ట్రాల్లో వికసిత్ భారత్ యాత్ర ఆరంభం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రారంభించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలలో ఈ సంకల్ప్ యాత్రను ఏకకాలంలో ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించారు. నిజానికి ఈ రాష్ట్రాలలో ఈ సంకల్ప్ యాత్ర ముందుగానే జరగాల్సి ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలుతో దీనిని వాయిదా వేశారు. ఇప్పుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ పలువురు లబ్ధిదారులతో ముచ్చటించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందుతున్న వారిని ఎంచుకుని వారి స్పందనను తెలుసుకున్నారు. దేశంలో ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ కార్యక్రమం వల్ల దేశంలోని మహిళలు తమను తాము నిలబెట్టుకున్నారని, అంతేకాకుండా ఇతరులకు కూడా తగు విధంగా ఉపాది కల్పిస్తున్నారని చెప్పారు. ఆత్మనిర్భర్ పథకం లబ్ధిదారుతో ఆయన ముచ్చటించారు. కష్టపడి పనిచేసేవారికి, అంకితభావపు వ్యక్తులకు తమ ప్రభుత్వం పలు విధాలుగా చేయూత అందిస్తుందని వివరించారు.

ఈ దేశాన్ని 2047 నాటికి సంపన్న దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్షం అని మోడీ తెలిపారు. ఈ వీడియో అనుసంధాన కార్యక్రమంలో ఐదు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది లబ్ధిదారులు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక పథకాలను గురించి వివరించడమే ఈ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రధాన ఉద్ధేశం. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజలతో మరింతగా మమేకం కావడానికి బిజెపి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఎంచుకుందనే విమర్శలు తలెత్తుతున్నాయి. నిర్ణీత వర్గాలందరికి ప్రభుత్వం తరఫున ప్రయోజనాలు అందుతాయని ఈ దశలో మోడీ భరోసా కల్పించారు. ఇది సమయానుగుణంగా తగు రీతిలో జరిగే ప్రక్రియ అవుతుందని వివరించారు. ప్రతి ఒక్కరి ఆశలు, ఆకాంక్షలను తీర్చడం ద్వారానే మోడీ గ్యారంటీలు సార్థకం అవుతాయని స్పష్టం చేశారు. ఈ దిశలో తమ ప్రభుత్వం సకల విధాలుగా పాటుపడుతోందన్నారు.

సామాన్యుడే మోడీకి విఐపి
దేశ సామాన్య ప్రజలందరిని ప్రధాని మోడీ తమ విఐపిగా భావిస్తుంటారని,ఈ క్రమంలో వారికి తగు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తుంటారని సంకల్ప్ యాత్ర దశలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ప్రధాని ఆలోచనా దృక్పథంతో ఇప్పుడు ప్రతి ఒక్కరి పని అత్యంత వేగవంతంగా జరుగుతుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News