Friday, December 20, 2024

భారత్‌కు ప్రవేశంతోనే భద్రతా మండలి సార్థకత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భద్రతా మండలి పరిపూర్ణత ఇందులోకి భారతదేశ ప్రవేశంతోనే సాధ్యం అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. పేద దేశాల ఎదుగదలకు భారతదేశం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తోందని , ఈ క్రమంలో భద్రతా మండలి వంటి కీలక సంస్థల్లోకి భారత్ ప్రవేశించడం అవసరం అన్నారు.ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లే దశలో ప్రధాని మోడీ గురువారం ఫ్రెంచ్ వార్తా పత్రిక లెస్ ఎకోస్‌కు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. బహుళత్వం , వైవిధ్యతల నడుమ సామరస్య సాధన భారతదేశ ఘనత అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. భిన్న సంస్కృతులు, వేర్వురు సాంప్రదాయ ఆచార వ్యవహారాలు ఉన్నప్పటికీ సామరస్యం సాధించిన ప్రపంచ అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఇండియా ఉందని తెలిపారు.

పలు దేశాల సమస్యల గురించి భద్రతా మండలి వంటి వేదికల నుంచి మాట్లాడేందుకు భారత్‌కు శాశ్వత సభ్యత్వం అవసరం అని, ఈ స్థానం లేకపోతే వారి పక్షాన సమగ్రరీతిలో మాట్లాడేందుకు అవకాశం ఉంటుందా? అని ప్రశ్నించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఘర్షణ గురించి ప్రస్తావిస్తూ శాంతిస్థాపనకు భారతదేశం తగు విధంగాస్పందిస్తుందని ప్రధాని తెలిపారు. ఈ విషయాన్ని తాను పలుసార్లు అటు పుతిన్‌కు, ఇటు జెలెన్‌స్కీకి తెలియచేసినట్లు , దీనికి కట్టుబడి తమ శక్తిమేరకు భారతదేశం రాజీయత్నాలకు దిగుతుందని తెలిపారు. అంతర్జాతీయ సామాజిక వ్యవస్థ, పలు రకాల వ్యవస్థలలో సర్దుబాట్లు అవసరం అనే సహజసూత్రాన్ని భారతదేశం గుర్తిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఎక్కడా రాజీపడకుండా భారత్ తన ప్రత్యేక సముచిత స్థానం దక్కించుకొంటోందని తెలిపారు. ప్రధాని మోడీ తమ ఇంటర్వూలో అమెరికాతో భారత్ బంధం గురించి, ఇండో పసిఫిక్ స్నేహ సంబంధాల గురించి కూడా ప్రస్తావించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News