అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 21న నాలుగు రోజుల పర్యటనకు వెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి అమెరికా ప్రభుత్వం ‘రెడ్ కార్పెట్’ స్వాగత సన్నాహాలు చేస్తున్నట్లు మన మీడియాలో ప్రముఖంగా వార్తలు చూస్తున్నాము. అయితే వైట్ హౌస్‌లో బైడెన్ తో కలసి విందు ఆరగించడం కోసమో, వారి ప్రతినిధుల సభలో ప్రసంగిస్తే వారు కొట్టే చప్పట్లకు మురిసిపోవడానికి ఆయన అమెరికా పర్యటనకు వెళ్లడం లేదని గమనించాలి. భారత దేశాన్ని అభివృద్ధిలో ‘సమాన భాగస్వామి’గా పరిగణించేందుకు అమెరికా సిద్ధంగా లేదని వారి వ్యవహార శైలి స్పష్టం చేస్తున్నది. కేవలం వ్యూహాత్మక ప్రయోజనాల కోసమే ప్రధాని మోడీని ఆహ్వానిస్తున్నారు. భౌగోళిక, రాజకీయ వ్యవహారాలలో భారత్ అమెరికా దారిలో ప్రయాణించేందుకు సిద్ధంగా ఉంటె,
మోడీని ప్రసన్నం చేసుకొనేందుకు ఒక విందు ఏర్పాటు చేస్తేనో, ప్రతినిధుల సభలో ప్రసంగించమని ఆహ్వానిస్తేనో వారికి వచ్చే నష్టం లేదు. సాధ్యమైనంత తక్కువ రాయితీలు కల్పిస్తూ, ‘దిగువ స్థాయి భాగస్వామి’గా వీలయినన్ని ఒప్పందాలపై భారత్ సంతకాలు చేసే విధంగా చేసేందుకు బైడెన్ ఎదురు చూస్తున్నారు. ఈ విధంగా ఇతరులను లొంగదీసుకోవడం అమెరికా వంటి బలమైన దేశాలకు అలవాటే. అందుకనే ఇటువంటి విషయాలలో భారత్ అప్రమత్తతో వ్యవహరించాల్సి ఉంది. ఎరిక్ గార్సెట్టిని భారత రాయబారిగా నియమించడానికి బైడెన్‌కు సగానికి పైగా పదవీకాలం పట్టిందని మరచిపోరాదు. రాయబారిగా భారత్‌కు ప్రయాణమయ్యే ముందు భారత ప్రభుత్వంతో మానవ హక్కుల అంశాలను ప్రస్తావిస్తూ ఉంటానని బైడెన్ యంత్రాంగానికి హామీ ఇచ్చి రావడం గుర్తుంచుకోవాలి. అందుకనే భారత్ పట్ల బైడెన్ ఉదారంగా వ్యవహరిస్తారని పొరపాటుపడితే ప్రమాదంలో చిక్కుకున్నట్లు కాగలదు.
ప్రధానమైన భౌగోళిక, రాజకీయ అంశాలపై అమెరికాతో కలిసి నడవని పక్షంలో భారత్‌ను ఎక్కడ ఇరకాటంలో పెట్టాలో తమకు తెలుసు అన్నట్లు బైడెన్ ప్రభుత్వం మొదటి నుండి వ్యవహరిస్తున్నది. పైగా బైడెన్ ప్రభుత్వం అనుసరితే ‘హిందుత్వ సానుకూల’ విధానాల పట్ల అమెరికా ప్రతికూల ధోరణులు అనుసరిస్తుంది. మరోవంక, భారత్ వ్యతిరేక శక్తులు అమెరికాలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. రాహుల్ గాంధీ సమావేశంలో ఖలీస్తానీ వాదులు తమ జెండాలు ఎగురవేయడం, ప్రశ్నలు కురిపించడం చూసా ము. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ అనుకూల వర్గాలు సహితం అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాయి. ప్రధాని మోడీ పర్యటనకు ముందుగా ‘భారత్ శక్తివంతమైన ప్రజాస్వామ్యం’ అంటూ అమెరికాలోని కీలక అధికారులు మాట్లాడుతూ ఉండడం కేవలం భారత దేశం తమ విధానాలకు సానుకూలంగా స్పందించేటట్లు చేసుకోవడమే. ఈ సందర్భంగా చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆయుధ సరఫరా ఒప్పందాలను ఖరారు చేసుకొనేందుకు అమెరికా ఆదుర్దాగా ఉన్నట్లు స్పష్టం అవుతుంది.
అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు ప్రత్యేకంగా ఈ వారం భారత్ పర్యటనకు రావడం ఆ ఉద్దేశంతోనే అని గమనించాలి. ఇప్పటికే భారత్ ఆయుధ అవసరాలలో సింహ భాగం రష్యాపై ఆధారపడుతున్నది.అయితే ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా నుండి ఆయుధాల సరఫరాలో కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకొని తమ ఆయుధాలను భారత్‌కు అమ్ముకునేందుకు అమెరికా కంపెనీలు తొందరపడుతున్నాయి. విదేశీ పర్యటనల సందర్భంగా ఆయా దేశాధినేతల స్వాగత సత్కారాలు, పొగడ్తలకు భారత నేతలు పొంగిపోయి, వారి వ్యూహాలను తేలికగా తీసుకోవడం నెహ్రూ సమయం నుండి జరుగుతుంది. బరాక్ ఒబామా హయాంలో అమెరికా అధ్యక్షుడు మన్మోహన్ సింగ్‌ను ‘తెలివైన నాయకుడు’ అని, ‘గురు’ అంటూ పదేపదే కొనియాడారు.
టిబెట్‌ను చైనా ఆక్రమించేకొవడానికి ముందు జవహర్ లాల్ నెహ్రూతో తరచూ సమావేశాలు జరిపిన అప్పటి చైనా ప్రధాని చౌ ఎన్‌లాయ్ భౌగోళిక రాజకీయాలపై నెహ్రూకు గల అపార ప్రజ్ఞాపాటవాలను తెలుసుకునేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థిగా నటించాడు. ఆనాడు టిబెట్ ఆక్రమణకు భారత్ మద్దతు ఇవ్వకుండా ఉంటె చరిత్ర మరో విధంగా ఉండెడిది. అదే విధంగా సరిహద్దుల్లో చైనా సైనికులు భారత్ భూభాగంలోకి ప్రవేశించి, మన సైనికులపై కాల్పులు జరుపుతున్న సమయంలో చైనా ప్రధాని నెహ్రూ ఇంట్లో విందు ఆరగిస్తున్నారు. జూన్ 2020లో గాల్వాన్‌లో చైనా చేసిన దురాగతం తర్వాతనైనా భారత్ కఠినమైన వాస్తవాల నుండి మృదువైన సంకేతాలను వేరు చేయగలిగి ఉండాల్సింది. కానీ జరగడం లేదు.మోడీ తన వార్షిక సమావేశాల సందర్భంగా జీ జిన్‌పింగ్‌ను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నా
సరిహద్దుల్లో చైనా దళాల కదలికలను నిలిపివేసే ప్రయత్నం చేయలేదు. సరిహద్దుల్లో నెమ్మదిగా ఒకొక్క చదరపు కిలోమీటరుకు తన నియంత్రణ రేఖ కిందకు తెచ్చుకోవడం ద్వారా క్రమంగా భూభాగాన్ని విస్తరించుకునే దుష్ట విధానంతో చైనా వ్యవహరిస్తున్నది. ఇప్పటికీ చైనా తన దుష్ట ప్రయత్నాలను కొనసాగిస్తున్నా భారత్ కఠినంగా తిప్పికొట్టలేకపోతున్నది. అమెరికా పూర్వ అధ్యక్షుడు బరాక్ ఒబామా, డోనాల్డ్ ట్రంప్‌లతో సహితం మోడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒబామా భారత్ పర్యటన నుండి తిరిగి వెడుతూ మోడీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మరచిపోలేము. ట్రంప్‌తో మోడీ స్నేహం గురించి ఎన్నో కథనాలు వెలువడిగినా వాణిజ్యపరంగా అవసరమైన ఒప్పందాలు చేసుకోలేకపోయాము.
వాస్తవానికి ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన రెండేళ్ల వరకు అమెరికా పర్యటన సందర్భంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించే వరవడికి మోడీ విరామం ఇవ్వాల్సి వచ్చింది.
మరో దేశాధినేత వచ్చి తమ దేశంలో భారీ సభల్లో మాట్లాడితే ట్రంప్ సహించలేకపోవచ్చని వెనుకాడారు. ఆ తర్వాతనైనా, ట్రంప్‌ను కూడా ఆహ్వానించి ఉమ్మడిగా ప్రధాని ప్రసంగించారు. ఆ సభ బాగా జరగడంతో, కరోనాకు ముందు అహ్మదాబాద్‌లో కూడా ట్రంప్ రాక సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ సభలతో ట్రంప్ భారత్ కు ఒరగబెట్టింది ఏమీలేదు గాని, ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు అమెరికాలోని భారత సంతతి వారి ఓట్ల కోసం మోడీ ప్రచారం చేస్తున్నారనే తప్పుడు సంకేతాలు పంపింది. అందుకనే బైడెన్ అనుమానంగా చూస్తూ వచ్చారు.భారత దేశం నేడు $ 3.75 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉంది. రాబోయే కొద్ది సంవత్సరాలలో జర్మనీ, జపాన్‌లను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరిస్తుంది. అయితే, భారత్ ఆర్థికంగా, శక్తివంతంగా ఎదగడం గురించి కేవలం చైనా మాత్రమే కాకుండా, అమెరికా కూడా కలవరం చెందుతుందని గుర్తించాలి.
భారత దేశం ఒక బలీయమైన స్వతంత్ర శక్తిగా ఎదగక ముందే యుకె, జపాన్, జర్మనీ వంటి దేశాలతో పాటుగా తన శిబిరంలో జూనియర్ భాగస్వామిగా భారత్ కూడా చేరాలని అమెరికా కోరుకుంటుంది. అది సాధ్యం కాని పక్షంలో దాదాపుగా 2030ల ప్రారంభంలో భారత్‌తో ‘సమాన నిబంధనలు’ ప్రాతిపదికగా, ‘సమాన భాగస్వామిగా’ అమెరికా వ్యవహరించవలసిన పరిస్థితులు అనివార్యం కాగలవు. ఇప్పటికే, తమ ప్రయోజనాల కోసం భారత్‌ను క్వాడ్‌లో భాగస్వామిగా చేయడం ద్వారా భారత్ చైనాల మధ్య ప్రతికూలంగా ఉన్న సంబంధాలను మరింత జటిలంగా మార్చడంలో అమెరికా విజయం సాధించిందని చెప్పవచ్చు.అయితే, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాను వాణిజ్య పరంగా అమెరికా, పాశ్చాత్య దేశాలు బహిష్కరించడంతో భారత్ సహకరించకపోవడం ఒక విధంగా వారి ఆధిపత్యాన్ని ధిక్కరించినట్టు అయింది. రష్యా విషయంలో అమెరికా ఒత్తిడులకన్నా భారత దేశ భద్రతా, ఆర్ధిక ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వక తప్పలేదు. నేడు బైడెన్ ప్రధాన ఉద్దేశం అమెరికా కంపెనీలకు భారత్‌లో లభించే విస్తారమైన మార్కెట్‌లను తెరిచేటట్లు చేయడమా,
వారి రక్షణ ఉత్పత్తుల కంపెనీలకు భారత్ వంటి పెద్ద మార్కెట్‌ను అందుబాటులోకి తేవడమే. అంతరిక్ష, అణు పరిజ్ఞానం, ప్రజా జీవనంలో డిజిటల్ వినియోగం వంటి రంగాల్లో భారత్ ఇప్పటికే అంతర్జాతీయంగా మరేదేశానికీ తీసిపోని విధంగా అగ్రగామిగా నిలిచింది. అదే విధంగా రక్షణ ఉత్పత్తులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో సహితం ప్రావీణ్యం సాధించేందుకు అమెరికా ఏమేరకు ఉపయోగపడగలడో చూడాల్సి ఉంది. ‘కొన్ని వేల మైళ్ళ దూరం నుండి వర్ధమాన దేశాలు ఏమీ చేయాలో ఇక్కడి నుండి నియంత్రించలేరు’ అంటూ 1971 యుద్ధం ముందు వైట్ హౌస్‌కు వెళ్లి మొహమాటం లేకుండా చెంపపెట్టు మాదిరిగా చెప్పి వచ్చిన ఇందిరా గాంధీ మాదిరిగా అమెరికాతో మన దేశ ప్రయోజనాలను దృష్టి లో ఉంచుకొని నిర్మోహమాటంగా వ్యవహరించడం నేటి అవసరం.