Sunday, December 22, 2024

వచ్చే ఏడాదీ నేనే జెండా ఎగరేస్తా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకోసం అధికార, ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్న తరుణంలో జరిగిన 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి, వారసత్వ రాజకీయాలు, ఆశ్రిత పక్షపాతం అనే మూడు దుష్టశక్తులతో ముడిపడిన పార్టీలుగా ప్రతిపక్షాలను అభివర్ణించారు. అంతే కాదు వచ్చే ఏడాది ఎన్నికల తర్వాత కూడా తానే ఎర్రకోటపైనుంచి ప్రసంగిస్తానన్న ధీమాను వ్యక్తం చేశారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సార్వత్రిక ఎన్నికలకు ముందు జాతినుద్దేశించి చేసిన తన చివరి ప్రసంగంలో ప్రధాని ప్రతి రంగంలోను రుజు ప్రవర్తన, పారదర్శకత, నిష్పాక్షికతను ప్రోత్సహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశాన్ని నాశనం చేసే ఈ మూడు చెడులను అంతంచేస్తానని ప్రధాని శపథం చేశారు. అవినీతిపై పోరాడుతూనే ఉండడానికి తాను నిబద్ధతతో జీవితకాలం కట్టుబడి ఉంటానని చెప్పారు.

వారసత్వ రాజకీయాలు చెదపురుగుల్లాగా ఈ వ్యవస్థను సర్వనాశనం చేశాయన్నారు. ప్రజల హక్కులను వారసత్వ రాజకీయాలు తొలగించాయన్నారు. బుజ్జగింపులు జాతీయ స్వభావంపై ఓ కళంకంగా మారిపోయాయన్నారు. ఈ మూడు చెడుగులపై మనం సంపూర్ణ శక్తితో పోరాడాలన్నారు. నేడు మనకు ప్రజల సంఖ్యాబలం ఉందని,అదే విధంగా ప్రజాస్వామ్యం, వైవిధ్యంఉన్నాయని, దేశయొక్క కలలను సాకారం చేసే శక్తి సామర్థాలు ఈ మూడింటికి ఉన్నాయన్నారు. నూతనోత్సాహంతో అభివృద్ధి పథంలో దూసుకువెళ్తున్న భారత దేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని, 2047 నాటికి అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలుస్తుందన్న ధీమాను ప్రధాని వ్యక్తం చేశారు. ఈ కలను సాకారం చేయడానికి రాబోయే అయిదేళ్లు అత్యంత కీలకమని ఆయన అన్నారు.మరో వెయ్యేళ్లు భారత్ వెలుగుతూనే ఉంటుందన్నారు.

90 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం
దాదాపు 90 నిమిషాలు ప్రసంగించిన ప్రధాని దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రసంగంలో మొదటగా మణిపూర్ అంశాన్ని ప్రస్తావిస్తూ దేశం మణిపూర్ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ఇప్పుడిప్పుడే మణిపూర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత దేశం స్వాతంత్య్రం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగఫలమే ఈ స్వాతంత్య్రమని అన్నారు.ఈ సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ బారత్ వైపు చూస్తున్నాయని, గడచిన పదేళ్లలో భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందిందని అన్నారు.‘ ఈ పదేళ్లలో దేశ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోంది. శాటిలైట్ రంగంలో దూసుకెళ్తున్నాం. రాబోయే కాలాన్ని సైన్స్, టెక్నాలజీ శాసిస్తుంది. 30 ఏళ్ల లోపు యువతే భారత్‌కు దిశా నిర్దేశం చేయాలి. సాంకేతికంగానేకాదు, వ్యవసాయ రంగంలోను దేశం చాలా అభివృద్ధి చెందుతోంది. నారీశక్తి, యువశక్తి బారత్‌కు బలం, భారత్‌లో యువశక్తి అద్భుతంగా ఉంది’ అని అన్నారు.

డెమోగ్రఫీ, డెమోక్రసీ, డైవర్సిటీ .. ఈ మూడు అంశాలు భారత దేవానికి ఎంతో ముఖ్యమైనవి. టెక్నాలజీ విషయంలో భారత్ ఎంతో మెరుగుపడి డిజిటల్ ఇండియా దిశగా దూసుకెళ్తోందన్నారు. క్రీడారంగంలో కూడా యువత ప్రపంచపటంమీద తన సత్తాను చాటుతోంది. అలాగే సాంకేతికంగా స్టారప్స్‌రంగంలో నంబర్3గా ఉంది. ఇక ఈ ఏడాది జరగబోయే ప్రతిష్ఠాత్మక జి20 సమావేశానికి ఆతిథ్యమిచ్చే అరుదైన అవకాశం భారత్‌కు లభించిందన్నారు. కరోనాలాంటి సంక్షోభ సమయంలో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందన్నారు. కరోనా మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. కరోనా సంక్షోభం తర్వాత భారత్ ప్రపంచానికి దిక్సూచిగా మారింది. కరోనా సమయంలో ఎన్నో కఠిన సవాళ్లను అధిగమించి ముందుకెళ్లాం. ప్రపంచాన్ని మార్చడంలో భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోందన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత్ బలమని, ప్రతి నిర్ణయంలోను దేశ ప్రగతికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. దేశంలో సుస్థిరమైన , శక్తివంతమైన ప్రభుత్వం ఉందన్నారు.

గత పదేళ్లలో ఎన్నో కీలకమైన సంస్కరణలు తీసుకు రావడంతో దేశం అన్ని రంగాల్లోను ముందుకు వెళ్తోందన్నారు. తాను ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశానని మోడీ చెబుతూ వాటిని తానే ప్రారంభించగలనన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గత స్వాతంత్య్ర దినోత్సవాల ప్రసంగాలకు భిన్నంగా ప్రధాని ఈ సారి తన ప్రసంగంలో ఎలాంటి భారీ సంక్షేమ పథకాలను ప్రకటించక పోవడం గమనార్హం. 90 నిమిషాల పాటు సుదీర్ఘంగా చేసిన ప్రసంగంలో గత తొమ్మిదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడానికి, గత ప్రభుత్వాల అవినీతి, ఆశ్రిత పక్షపాతం లాంటి వాటిని విమర్శించడానికే ఎక్కువ సమయం కేటాయించడం విశేషం. తాను సామాన్య జనంలోంచి వచ్చిన వ్యక్తినని చెప్పుకున్న ప్రధాని వారి కోసమే జీవిస్తున్నానని చెప్పుకున్నారు.

సుప్రీంకోర్టుకు ప్రశంస..స్పందించిన సిజెఐ
ప్రధాని తన సుదీర్ఘ ప్రసంగంలో ప్రాంతీయ భాషల ప్రాముఖ్యతను ప్రస్తావిసూ ్తసుప్రీంకోర్టునిర్ణయాన్ని గుర్తు చేశారు.తీర్పులను ప్రాంతీయ భాషల్లోకిఅనువాదం చేస్తూ న్యాయస్థానం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. ప్రధాని ప్రశంసలకు ఈ వేడుకలకు అతిథిగా హాజరైన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ స్పందించారు. అభినందనపూర్వకంగా ప్రధానికి నమస్కరించారు.
6 జి ప్రస్తావన
ప్రధాని మోడీ తన ప్రసంగంలో 6జి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తోందని, అంతర్జాతీయంగా ఎక్కడా లేని విధంగా తక్కువ ధరకే మొబైల్ డేటా ప్లాన్‌లను అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం దేశంలో 5 జిసాంకేతికత అందుబాటులో ఉందని, త్వరలోనే 6జి సాంకేతికతను ప్రజలకు పరిచయం చేసేందుకు భారత్ వడివడిగా అడుగులు వేస్తోందని అన్నారు. ఇందుకోసం 6జి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.

మారిన సంబోధన
ప్రధాని తన ప్రసంగంలో సంప్రదాయానికి భిన్నంగా దేశ ప్రజలను ‘పరివార్ జన్’(కుటుంబ సభ్యులు)గా అభివర్ణించడం విశేషం.గతంలో ఆయన దేశ ప్రజలను ‘నా ప్రియమైన సోదర సోదరీ మణులారా’ అని సంబోధించే వారు.
రాజస్థానీ తలపాగా
పదేళ్లుగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వెరైటీగా కనిపించే ప్రధాని ఈ సారి రాజస్థానీ తలపాగా గెటప్‌తో దర్శనమిచ్చారు. రాజస్థానీ సంప్రదాయ బందేజ్ సాఫా తలపాగా ధరించిన మోడీ వైట్ కుర్తా, చుడీదార్‌తో పాటుగా బ్లాక్ జాకెట్ ధరించారు. ఈ ఏడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల దృష్టా ఆయన ఈ గెటప్‌లో కనిపించి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రాజ్‌ఘాట్ వద్ద నివాళి
ఎర్రకోటకు చేరుకోవడానికి ముందు ప్రధాని మోడీ రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News