న్యూఢిల్లీ : డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్ సనాతనధర్మ సంబంధిత వ్యాఖ్యలు, ఇప్పుడు నెలకొన్న ఇండియా / భారత్ వివాదంపై మంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ హితవుతో కూడిన సూచనలు వెలువరించారు. సనాతన ధర్మ వ్యాఖ్యలపై కానీ ఇతర విషయాలపై కానీ ఇప్పుడు ఎవరు పడితే వారు మాట్లాడటం సరికాదు. వీటిపై ప్రత్యేకించి స్టాలిన్ సనాతన ధర్మ వ్యాఖ్యలపై సమగ్ర రీతిలో సముచితంగా స్పందించాల్సి ఉంది.
కాబట్టి కేవలం కేవలం అధీకృత నేత లేదా వ్యక్తి ద్వారానే వీటిపై మాట్లాడాల్సి ఉంది. ఎవరు పడితే వారు దీనిపై స్పందించి గందరగోళానికి దిగరాదని ఆయన సహచర మంత్రులకు పిలుపు నిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో జి 20 సదస్సు నేపథ్యంలో దీనిపై ఏర్పాటు అయిన సమావేశంలో ఆయన మంత్రి మండలి సభ్యులతో మాట్లాడారు. కొన్ని మాటలపై మన నుంచి ఘాటైన స్పందన అవసరం అవుతుంది.
పలువురు మాట్లాడితే ఇతరత్రా సమస్యలు తలెత్తుతాయి. మంత్రులు దీనిని గుర్తించాలి. ఎవరో ఒకరు మాట్లాడి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా ఎవరికి ఈ స్పందన బాధ్యత ఇవ్వాల్సిందనేది ఖరారు చేసుకోవల్సి ఉంటుందని ప్రధాని మోడీ తెలిపారు. ఓ వైపు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగి సాగుతున్న దశలోనే దేశం పేరు ఇండియాను భారత్‌గా మార్చినట్లు ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడటంతో ఇది కూడా వివాదాస్పదం అయింది. ఈ రెండు విషయాలపై ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుందని మంత్రులకు కేబినెట్‌లో నేరుగా చెప్పడం , పరోక్షంగా పార్టీ నేతలకు కూడా దీనిపై సంకేతాలు వెలువరించడం కీలకం అయింది.