Tuesday, March 4, 2025

గిర్ అడవుల్లో ప్రధాని మోడీ లయన్ సఫారీ

- Advertisement -
- Advertisement -

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం గుజరాత్ జునాగఢ్ జిల్లాలోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. సమిష్టి ప్రయత్నాల ఫలితంగా ఆసియాటిక్ సింహాల సంఖ్య పెరిగిందని ఆయన తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆసియాటిక్ సింహాలు నివసిస్తున్న చుట్టుపక్కల గిరిజనులు, మహిళలు అందించిన సేవలను ఆయన ఈ సందర్భంగా పొగిడారు. ‘ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా నేటి ఉదయం నేను గిర్‌లో సఫారీకి వెళ్లాను. ఈ గిర్ ప్రాంతం ఆసియాటిక్ సింహాలకు అభయారణ్యంగా ఉంది. గిర్ ప్రాంతం విషయానికి వస్తే, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనమంతా సమిష్టిగా పనిచేసి విషయాలు గుర్తుకొస్తున్నాయి’ అని తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘గత కొన్ని ఏళ్లలో మనం ఆసియాటిక్ సింహాల పెరుగుదలకు సమిష్టిగా కృషి చేశాము. మనతోపాటు ఆసియాటిక్ సింహాలు నివసిస్తున్న చుట్టుపక్కల గిరిజనులు, మహిళలు వాటి సంరక్షణ, పెరుగుదలకు విశేష కృషి చేశారు’ అని పేర్కొన్నారు.

‘దశాబ్దకాలంలో పులులు, చిరుతలు, ఖడ్గమృగాలు కూడా గణనీయంగా పెరిగాయి. మనం వన్యప్రాణులను ఎంతగా ఆదరిస్తున్నామో, అటవీ జంతువులకు స్థిరమైన ఆవాసాలు నిర్మించడానికి ఎంతగా కృషిచేస్తున్నామో తెలుస్తోంది’ అని మోడీ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాక ఆయన తన సఫారీకి సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. ఈ ఆసియాటిక్ సఫారీ సందర్భంగా ప్రధాని వెంట కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, ఇతర మంత్రులు, అటవీ శాఖ సీనియర్ అధికారులు ఉన్నారు. తరువాత ప్రధాన మంత్రి గిర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రధాన కార్యాలయం అయిన ససన్ గిర్‌లో జరిగిన జాతీయ వన్యప్రాణుల బోర్డు ఏడవ సమావేశానికి అధ్యక్షత వహించారు. గుజరాత్‌లో ఏకైక నివాసంగా ఉన్న ఆసియాటిక్ సింహాల సంరక్షణకు ఉద్దేశించిన ‘ప్రాజెక్ట్ లయన్’ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2900 కోట్లకు పైగా నిధిని ఆమోదించినట్లు ఓ ప్రభుత్వ ప్రకటన తెలిపింది.

దాదాపు 30000 చదరపు కిలోమీటర్లు ఉన్న ఆసియాటిక్ సింహాల నివాస ప్రదేశం గుజరాత్‌లోని తొమ్మిది జిల్లాలు, 53 తాలూకాల మేరకు విస్తరించి ఉంది. దీనికితోడు జాతీయ ప్రాజెక్టులో భాగంగా జునాగఢ్ జిల్లాలోని న్యూ పిపాలియా వద్ద 20.24 హెక్టార్లకుపైగా భూమిలో వన్యప్రాణుల కోసం ‘జాతీయ రిఫెరల్ సెంటర్’ ఏర్పాటుచేయబడుతోందని ఆ్య ప్రభుత్వ ప్రకటన పేర్కొంది.
దీనికి ముందు మోడీ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి శివుడికి అర్చనలు చేశారు. అంతేకాక ఆదివారం మోడీ జంతు సంరక్షణ, పునరావాస కేంద్రం వంతారాను సందర్శించారు. అటవీశాఖ అతిథి గృహం అయిన సిన్హ్ సదన్‌లో ఆయన రాత్రి బసచేశారు. సోమవారం మధ్యాహ్నం గిర్ వన్య ప్రాణుల అభయారణ్యం ప్రధాన కార్యాలయమైన ససన్ గిర్‌లో నిర్వహించిన ‘నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్’ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. తరువాత మోడీ అటవీ సిబ్బందితో ముచ్చటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News