Wednesday, January 22, 2025

రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: పియూష్ గోయల్

- Advertisement -
- Advertisement -

రైతుల సంక్షేమానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. రైతు నాయకులు దీన్ని అర్థం చేసుకుని తమ నిరసనను విరమించుకుంటారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. పంటలకు కనీస మద్దతు ధరపై(ఎంఎస్‌పి) చట్టబద్ధ భరోసాను కోరుతున్న రైతు సంఘాలతో ఆహార మంత్రి గోయల్, వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ శుక్రవారం నాలుగవ విడత చర్చలు జరిపారు. అనంతరం గోయల్ విలేకరులతో మాట్లాడుతూ రైతులకు ఎల్లవేళలా ప్రభుత్వ మద్దతు ఉంటుందని, వారికి అండగా నిలబడుతుందని చెప్పారు. కొందరు వ్యక్తుల ప్రచారాన్ని నమ్మి తప్పుదారి పట్టవద్దని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి రైతు ఉజ్వల భవిష్యత్తు కోసం తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. రైతాంగానికి మెరుగైన భవిష్యత్తు కోసం వారితో కలసి ప్రభుత్వం ఎలా పనిచేయనున్నదో,

దేశం స్వయం సమృద్ధి సాధించడానికి ప్రభుత్వం ఎంత అంకితభావంతో ఉందో రైతు నాయకులకు వివరించామని గోయల్ చెప్పారు. ప్రభుత్వ నిజాయితీని అర్థం చేసుకుని వారు తమ సమ్మెను ఉపసంహరిస్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. రైతులతో ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వ సంస్థలు ఐదేళ్ల పాటు రైతుల నుంచి పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటను ఎంఎస్‌పిపై కొనుగోలు చేస్తాయన్న ప్రతిపాదనను ముగ్గురు మంత్రుల కమిటీ రైతు నాయకుల వద్ద ఉంచింది. అయితే ఈ ప్రతిపాదనను రైతు నాయకులు తిరస్కరించారు. ఇది రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకమని వారు స్పష్టం చేశారు. పంజాబ్‌కు చెందిన వేలాది మంది రైతులు ఫిబ్రి 13న తమ ఛలో ఢిల్లీ యాత్రను ప్రారంభించగా వారిని హర్యానా సరిహద్దులోని శంభూ, ఖనౌరి పాయింట్ల వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అప్పటి నుంచి రైతులు అక్కడే తిష్టవేసి తమ నిరసనను తెలియచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News