దాదాపు తొమ్మిదేళ్ళ నాడు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశ పాలనలో సమాఖ్య వ్యవస్థ అనే అంశం తరచుగా ప్రస్తావనకు వస్తున్నది. మోడీ అయితే మరో అడుగు ముందుకు వేసి సహకార సమాఖ్య అంటున్నారు. సహకార సమాఖ్యను ఆవిష్కరించడం ద్వారా దేశంలో సుపరిపాలనను నెలకొల్పుకోడం కోసమే అంతకు ముందున్న ప్రణాళిక సంఘం స్థానంలో నీతిఆయోగ్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పుకొన్నారు. వాస్తవంలో మాత్రం దేశంలో కేంద్రీకృత పాలనే సాగుతున్నదనే అభిప్రాయం ఈ తొమ్మిదేళ్ళలో అపూర్వ స్థాయిలో గట్టి పడింది. మంగళవారం నాడు కేరళలో మొట్టమొదటి వందే భారత్ రైలును ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్లు ప్రసంగించారు. వారిద్దరూ ఒక్క కంఠంతో సహకార సమాఖ్య ఆవశ్యకత గురించి నొక్కి పలికారని కొన్ని వార్తలు వెల్లడించాయి.
అయితే పినరయి విజయన్ ఒక్కరే సహకార సమాఖ్య విధానాన్ని బలోపేతం చేయాలని అనగా ప్రధాని మోడీ మాత్రం బలమైన కేంద్రం ద్వారానే అభివృద్ధి పథంలో రాష్ట్రాలు పరుగెత్త గలుగుతాయని అన్నట్టు వచ్చిన వార్త విశ్వసనీయంగా వుంది. చెప్పేదొకటి చేసేదొకటి పద్ధతిని ఉద్దేశపూర్వకంగా ఏ మాత్రం పొల్లు లేకుండా పాటిస్తున్న మోడీ ప్రభుత్వం ఆచరణలో సమాఖ్య విలువలకు సమాధి కట్టడానికే పని చేస్తున్నది. నిషక్షపాతంగా ఆలోచించే వారికి ఈ విషయం ఇప్పటికే ఎటువంటి సందేహానికి అవకాశం లేకుండా అర్థమై వుంటుంది. రాజ్యాంగ నిర్మాతలు భారత పాలనా వ్యవస్థను సమాఖ్య పద్ధతిలో దర్శించారని ఒక వాదన వుండగా, కేంద్రీకృతం (యూనిటరీ) చేసి కేంద్ర ప్రభుత్వానికి పైచేయి కల్పించారని మరో అభిప్రాయం వుంది.
ఇంత సువిశాల దేశ పాలనకు కేంద్రంలో ఒక ప్రభుత్వం వుంటే చాలదని భావించి వారు రాష్ట్రాలను సృష్టించి వాటిక్కూ డా అధికారాలు కల్పించారు గాని, వాస్తవంలో పెత్తనం కేంద్రం చేతికే ఇచ్చారన్నది వీరి ఉద్దేశం. అదేమైనప్పటికీ బిజెపి చేతికి అధికారం పూర్తిగా వెళ్ళాక రాష్ట్రాల జాబితాలోని అంశాల్లో కూడా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని చట్టాలు చేసి రుద్దడం అప్రతిహతంగా జరిగిపోతున్నది. వాస్తవానికి అమ్మకపు పన్ను వసూలు అధికారాన్ని హరించి వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) విధానాన్ని అమల్లోకి తెచ్చినప్పుడే రాష్ట్రాల ఆర్థిక అధికారాలకు గండి పడింది.
ఒక అర్ధరాత్రి పూట జిఎస్‌టి చట్టాన్ని పార్లమెంటులో ఆమోదింప చేయించి అట్టహాసంగా ఆవిష్కరించినప్పుడు రాష్ట్రాలు దాని వల్ల తమకు కలిగే ముప్పును ఊహించలేదు. ఇప్పుడు బిజెపి పాలకులు ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలకు జిఎస్‌టి వాటాను సకాలంలో పంచిపెట్టకుండా ఇబ్బందులు పెడుతున్న కఠోర వాస్తవాన్ని కళ్ళారా చూస్తున్నాము. విద్య రాష్ట్రాల జాబితాలో వుండగా, నూతన జాతీయ విద్యా విధానం పేరిట పాఠ్యగ్రంథాలను ఇష్టావిలాసంగా మార్చివేస్తూ, చరిత్రకు సంబంధించిన వాస్తవాలపై మసిపూస్తూ వాటి స్థానంలో హిందూత్వ అజెండాకు అనువైన అబద్ధపు పాఠాలను చేరుస్తూ కేంద్రం చేస్తున్న దుర్మార్గాన్ని ఎవరూ ఆపలేక పోతున్నారు. ఇందుకు విరుగుడుగా వాస్తవ చరిత్ర పాఠాలతో కూడిన అదనపు పాఠ్యగ్రంథాలను విద్యార్థులకు అందజేయాలని కేరళ ప్రభుత్వం యోచిస్తున్నట్టు వచ్చిన వార్తలు గమనించదగినవి. వ్యవసాయంలోనైతే ప్రధాని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల విశేష లాభార్జనకు అనుగుణంగా మూడు కొత్త చట్టాలను తీసుకొచ్చి ఢిల్లీ సరిహద్దుల్లో సుదీర్ఘ రైతు ఉద్యమానికి దారులు వేసిన సంగతి విదితమే. ఆ ఉద్యమ సెగలకు భయపడి ఆ మూడు చట్టాలను వెనుకకు తీసుకొన్నప్పటికీ కేంద్రం ఇప్పటికీ రైతుల మంచి గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు.
కేంద్రం తన చేతిలోని సిబిఐ, ఇడి వంటి దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల పాలక పార్టీల నేతలపై ప్రయోగిస్తున్న తీరు ఎంత జుగుప్సాకరమో, మరెంత అప్రజాస్వామికమో చెప్పనక్కర లేదు. సహకార సమాఖ్య పాలన అంటే కేంద్ర, రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంతో పాటు ఒక దాని మీద ఒకటి ఆధారపడి పని చేయడం. ప్రతిపక్ష ప్రభుత్వాలున్న రాష్ట్రాల గవర్నర్లు అక్కడి పాలనకు ఆటంకం కలిగిస్తూ ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించే బిల్లులను ఆమోద ముద్ర వేయకుండా, తిప్పి పంపించకుండా తమ వద్ద మాసాల తరబడి వుంచుకోడం ఎటువంటి సహకార సమాఖ్య కిందికి వస్తుందో ప్రధాని మోడీ చెప్పాలి. పినరయి విజయన్ సహకార సమాఖ్య గురించి గుర్తు చేయగా అదే వేదిక నుంచి మాట్లాడిన మోడీ బలమైన కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలను కలుపుకొని జాతీయాభివృద్ధిని సాధించగలదని అన్నారంటే మూడవసారి కూడా కేంద్రంలో బిజెపి ప్రభుత్వమే వస్తే దేశం ఏమవుతుందో ఊహించవచ్చు.